సాహో అంటూ.. ధావన్‌కు దండాలు పెట్టి..

తాజా వార్తలు

Published : 30/03/2021 01:11 IST

సాహో అంటూ.. ధావన్‌కు దండాలు పెట్టి..

స్టోక్స్‌ ఔట్‌ అనంతరం ఉపశమనం పొందిన హార్దిక్‌

(ఫొటో: బీసీసీఐ)

పుణె : ఇంగ్లాండ్‌తో జరిగిన నిర్ణయాత్మక చివరి వన్డేలో భారత్‌ 7 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, రెండో వన్డేలో విధ్వంసకరంగా ఆడి ఆ జట్టుకు విజయాన్ని అందించిన ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ వికెట్‌ పడిన అనంతరం మైదానంలో హార్దిక్‌ పాండ్య రియాక్షన్‌ ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఎందుకంటే అంతకుముందు స్టోక్స్‌ ఇచ్చిన క్యాచ్‌ను జారవిడిచాడు హార్దిక్‌.

రెండో వన్డేలో స్టోక్స్‌ 52 బంతుల్లో 99 పరుగులతో చెలరేగిన విషయం తెలిసిందే. ఇక మూడో వన్డేలో 35 పరుగులు మాత్రమే చేసి నటరాజన్‌ బౌలింగ్‌లో స్టోక్స్‌ ఔటయ్యాడు. అయితే అంతకుముందు.. ఇన్నింగ్స్‌ అయిదో ఓవర్లోనే స్టోక్స్‌ ఔట్‌ నుంచి తప్పించుకున్నాడు. భువీ బౌలింగ్‌లో స్టోక్స్‌ ఇచ్చిన సింపుల్‌ క్యాచ్‌ను హార్దిక్‌ పట్టలేకపోయాడు. ఆ తర్వాత 11వ ఓవర్లో నటరాజన్‌ బౌలింగ్‌లో స్టోక్స్‌.. ధావన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ధావన్‌ క్యాచ్‌ పట్టడంతో ఆ సమయంలో హార్దిక్‌ ఉపశమనం పొందినట్లు కనిపించాడు. మైదానంలో మెకాళ్లపై వంగి బౌలర్‌కు, ధావన్‌కు దండాలు పెడుతూ కనిపించాడు.

ఇక ఈ వన్డేలో భారత ఫీల్డింగ్‌ సవ్యంగా సాగి ఉంటే మ్యాచ్‌ చివరి ఓవర్‌ వరకూ వచ్చేదే కాదు. సామ్‌ కరన్‌ తొలుత ఇచ్చిన సులభమైన క్యాచ్‌ను హార్దిక్‌ అందుకోలేకపోయాడు. 22 పరుగుల వద్ద ఉన్నపుడు ఇన్నింగ్స్‌ 34వ ఓవర్లో ప్రసిద్ధ్‌ బౌలింగ్‌లో అతనిచ్చిన క్యాచ్‌ను నేలపాలు చేశాడు. దీంతో అతను మ్యాచ్‌ను ఆఖరి బంతి వరకూ తీసుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. ప్రత్యర్థికి 330 పరుగుల లక్ష్యాన్ని విసిరింది. ఇంగ్లాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది. దీంతో భారత్‌ ఈ సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని