ఆ క్రెడిటంతా ఫీల్డింగ్‌ కోచ్‌కే : హర్మన్‌

తాజా వార్తలు

Published : 11/07/2021 13:53 IST

ఆ క్రెడిటంతా ఫీల్డింగ్‌ కోచ్‌కే : హర్మన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇటీవలి కాలంలో టీమ్‌ఇండియా మహిళా జట్టు ఫీల్డింగ్‌ ఎంతో మెరుగైందని.. అందుకు ప్రధాన కారణం తమ ఫీల్డింగ్‌ కోచ్‌ అభయ్‌ శర్మ అని టీ20 కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ వెల్లడించింది. తాజాగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత మహిళా జట్టు డక్‌వర్త్‌లూయిస్‌ పద్ధతిలో 18 పరుగుల తేడాతో  ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అయినా, ఈ మ్యాచ్‌లో భారత ప్లేయర్లు తమ ఫీల్డింగ్‌ నైపుణ్యాలతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌లో 19వ ఓవర్‌లో హర్మన్‌ ప్రీత్‌, హర్లీన్‌ డియోల్‌ రెండు అద్భుత క్యాచ్‌లు అందుకొని అందర్నీ ఆశ్చర్యపరిచారు.

శిఖాపాండే వేసిన ఆ ఓవర్‌లో రెండో బంతికి నాట్‌సీవర్స్‌ (55; 27 బంతుల్లో 8x4, 1x6) ఆడిన షాట్‌ను.. లాంగాన్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న హర్మన్‌ప్రీత్‌ ముందుకు డైవ్‌చేస్తూ క్యాచ్‌ అందుకుంది. మరో మూడు బంతుల తర్వాత అమీజోన్స్‌ (43; 27 బంతుల్లో 4x4, 2x6) ఆడిన భారీ షాట్‌ను లాంగాఫ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న హర్లీన్‌ డియోల్‌ అత్యద్భుతమైన రీతిలో క్యాచ్‌ అందుకుని ఔరా అనిపించింది. తల మీదుగా వస్తున్న క్యాచ్‌ను ఎడమవైపు గాల్లోకి డైవ్‌ చేసి అందుకొంది. ఈ క్రమంలో బౌండరీ అవతల పడిపోతానని తెలుసుకొని బంతిని గాల్లోకి విసిరింది. బౌండరీ అవతలికి వెళ్లి మళ్లీ గాల్లోని బంతిని అందుకొనేందుకు మైదానంలోకి డైవ్‌ చేసింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో పలువురు ప్రముఖులు ప్రశంసలతో ముంచెత్తారు.

ఈ నేపథ్యంలోనే మ్యాచ్‌ అనంతరం స్పందించిన హర్మన్‌ ఆ క్రెడిటంతా తమ ఫీల్డింగ్‌ కోచ్‌ అభయ్‌ శర్మకు దక్కుతుందని పేర్కొంది. ‘‘జట్టుగా ఆడే ఆటలో ఒక స్ఫూర్తి ఉండాలి. ఈ ఆటలో మా ఫీల్డింగ్‌ చాలా బాగుంది. అనేక పరుగులు ఆదా చేయడంతో పాటు అద్భుతమైన క్యాచ్‌లు ఒడిసిపట్టాం. మా ఫీల్డింగ్‌ మెరుగైందనడానికి ఇదే గొప్ప నిదర్శనం. ఇంతకుముందు కూడా మేం ఫీల్డింగ్‌లో బాగా కష్టపడే వాళ్లం. అయితే.. ఇప్పుడు ఫీల్డింగ్‌ కోచ్‌ చిన్నచిన్న మెళకువలు నేర్పించి, వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవడంతో మంచి ఫలితాలు సాధిస్తున్నాం’’ అని హర్మన్‌ చెప్పుకొచ్చింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని