రహానెతో మాట్లాడాం.. ఇంగ్లాండ్‌తో పోటీకి సిద్ధం
close

తాజా వార్తలు

Published : 15/06/2021 01:13 IST

రహానెతో మాట్లాడాం.. ఇంగ్లాండ్‌తో పోటీకి సిద్ధం

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా టెస్టు వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానెతో మాట్లాడాక తాము ఇంగ్లాండ్‌తో టెస్టు మ్యాచ్‌కు మానసికంగా సిద్ధమయ్యామని మహిళల జట్టు ఉప సారథి హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ పేర్కొంది. టీమ్‌ఇండియా మహిళా జట్టు బుధవారం నుంచి ఇంగ్లాండ్‌తో ఏడేళ్ల తర్వాత ఒక టెస్టు మ్యాచ్‌ ఆడనున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత వన్డే, టీ20 సిరీస్‌ల్లోనూ తలపడనుంది. ఈ క్రమంలోనే టెస్టు మ్యాచ్‌కు ముందు తాము మానసికంగానూ దృఢంగా ఉన్నామని హర్మన్‌ చెప్పుకొచ్చింది.

‘నేను టెస్టు క్రికెట్‌ ఎక్కువగా ఆడలేదు. కేవలం రెండు మ్యాచ్‌లే ఆడాను. అయితే, ఈసారి మాకు రహానెతో మాట్లాడే అవకాశం దక్కింది. సుదీర్ఘ ఫార్మాట్‌లో ఎలా ఆడాలనే దానిపై ఆయన నుంచి ఎన్నో విషయాలు అడిగి తెలుసుకున్నాం. ఇప్పుడు మేం నెట్స్‌లో సాధన చేస్తున్నప్పుడు కూడా సానుకూల దృక్పథంతో ఉండడానికి ప్రయత్నిస్తాము. క్రీడాకారులు సంతోషంగా ఉన్నప్పుడే బాగా ఆడతారు. ఇంగ్లాండ్‌తో తలపడేటప్పుడు మా అత్యుత్తమ ప్రదర్శన చేయడానికి ప్రయత్నిస్తాము. ఇక రహానె గురించి చెప్పాలంటే ఈ ఆటలో ఎంతో అనుభవమున్న ఆటగాడు. మాతో స్నేహపూర్వకంగా మాట్లాడాడు. చాలా మంచి విషయాలు పంచుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో గంటల కొద్దీ ఎలా బ్యాటింగ్‌ చేయాలో విలువైన సలహాలిచ్చాడు. ఎలాంటి ఆలోచనాలతో ముందుకెళ్లాలో, ఇన్నింగ్స్‌ బ్రేక్‌ ఎలా తీసుకోవాలో అన్నీ వివరంగా చెప్పాడు’ అని హర్మన్‌ వెల్లడించింది.

అనంతరం యువ బ్యాటింగ్‌ సంచలనం షెఫాలీ వర్మపై స్పందించిన హర్మన్‌.. ‘ఆమె బ్యాటింగ్‌ విషయంలో జట్టు కలగజేసుకోదు. యువ బ్యాటర్‌ సహజంగానే బాగా ఆడుతుంది, అలాంటప్పుడు ఆమెతో టెక్నిక్ గురించి కానీ, జట్టు ప్రణాళికల గురించి కానీ మాట్లాడటం మంచిది కాదు. షెఫాలీ చుట్టూ మేం సానుకూల వాతావరణం ఉంచుతున్నాం. దాంతో ఆమె ఒత్తిడికి లోనవ్వకుండా ఆటను ఆస్వాదించేలా చూస్తున్నాం. నెట్స్‌లోనూ యువ బ్యాటర్‌ బాగా కష్టపడుతోంది. దాంతో అవకాశం వస్తే మ్యాచ్‌లో చెలరేగుతుందనే నమ్మకం ఉంది. మరోవైపు మేం ప్రాక్టీస్‌ చెయ్యడానికి తగిన సమయం దొరకలేదనే సంగతి నాకు తెలుసు. అయినా క్రికెటర్లుగా పరిస్థితులకు త్వరగా అలవాటు పడాలి. ఇంగ్లాండ్‌లోని వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. ఒక్కో రోజు ఒక్కోలా ఉంటుంది. మ్యాచ్‌కు సన్నద్ధమవ్వాలంటే పరిస్థితులకు తగ్గట్టు అలవాటు పడాలి’ అని హర్మన్‌ తన అభిప్రాయాలు వివరించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని