యువీ రికార్డు బద్దలు: మోరిస్‌ @ రూ.16.25 కోట్లు
close

తాజా వార్తలు

Published : 18/02/2021 16:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యువీ రికార్డు బద్దలు: మోరిస్‌ @ రూ.16.25 కోట్లు

ఇంటర్నెట్‌ డెస్క్‌: దక్షిణాఫ్రికా పేస్‌బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ క్రిస్‌మోరిస్‌ రికార్డులు తిరగరాశాడు. ఐపీఎల్‌ వేలం చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా ఘనత సాధించాడు. 2021 సీజన్‌ వేలంలో రాజస్థాన్‌ రాయల్స్‌ అతడిని రూ.16.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది.

ఇప్పటి వరకు వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడి రికార్డు యువరాజ్‌ సింగ్‌ పేరిట ఉండేది. 2015లో అతడిని దిల్లీ రూ.16 కోట్లకు దక్కించుకుంది. ఇప్పటి వరకు ఆ రికార్డును మరొకరు కదిలించలేకపోయారు. తాజా వేలంలో క్రిస్‌ మోరిస్‌ను రాయల్స్‌ రూ.16.25 కోట్లకు దక్కించుకోవడంతో ఆ రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. యువీ తర్వాతి స్థానంలో కమిన్స్‌ (రూ.15.5 కోట్లు), బెన్‌స్టోక్స్‌ (రూ.14.5) కోట్లు ఉన్నారు.

ఐపీఎల్‌ తాజా వేలంలో ఆల్‌రౌండర్లకు విపరీతమైన డిమాండ్‌ కనిపిస్తోంది. మొయిన్‌ అలీ (రూ.7 కోట్లు), శివమ్‌ దూబె (రూ.4.4 కోట్లు), షకిబ్‌ అల్‌ హసన్‌ (3.2 కోట్లు)కు భారీ ధర పలికింది. అయితే బెంగళూరు విడుదల చేసిన క్రిస్‌ మోరిస్‌పై మాత్రం అన్ని జట్లూ ఆసక్తి ప్రదర్శించాయి. సమయోచితంగా వికెట్లు తీయడంతో పాటు భారీ సిక్సర్లు బాదగలగడం అతడి ప్రత్యేకత. పైగా ప్రపంచ వ్యాప్తంగా అనేక టీ20 లీగులు ఆడిన అనుభవం అతడి సొంతం. తక్కువ ధరకే అతడిని దక్కించుకోవాలన్న ఉద్దేశంతో బెంగళూరు అతడిని విడుదల చేసింది. కానీ ఆ పాచిక పారలేదు.

తాజా వేలంలో మొదట అతడి కోసం బెంగళూరు పోటీ పడింది. రూ.5కోట్ల వరకు పంజాబ్‌ కింగ్స్‌తో పోరు కొనసాగించింది. ఆ తర్వాత ముంబయి ఇండియన్స్‌ రంగంలోకి దిగింది. రూ. 10 కోట్ల వరకు ప్రయత్నించింది. రూ.13 కోట్ల వరకు పోటీ పడ్డా అనూహ్యంగా రాజస్థాన్‌ రాయల్స్‌ రంగంలోకి దిగడంతో తప్పుకుంది. రాయల్స్‌ రూ.25 లక్షల చొప్పున పెంచుతూ పంజాబ్‌పై ఒత్తిడి పెంచింది. రూ.16 లక్షల వరకు పంజాబ్‌ ప్రయత్నం చేసినా మరో రూ.25 లక్షలు అదనంగా చెల్లించి రాయల్స్‌ అతడిని సొంతం చేసుకుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని