
తాజా వార్తలు
అనుకోకుండా క్రికెటరయ్యా: అశ్విన్
ఇంటర్నెట్‌డెస్క్: భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తానని అసలు ఊహించలేదని, అనుకోకుండా క్రికెటర్ అయ్యానని టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ‘‘అనుకోకుండా క్రికెటర్ అయ్యాను. టీమిండియా జెర్సీ ధరిస్తానని అసలు ఊహించలేదు. అయితే విజయంలో కీలక పాత్ర పోషించి జట్టును గెలిపించిన సందర్భాల్లో.. ఆశీర్వాదంతో అలా జగిందని భావించేవాడిని. కానీ కొవిడ్-19 వ్యాప్తితో భారత్ తరఫున ఆడటం ఎంతో అదృష్టమని తెలిసి వచ్చింది’’ అని తెలిపాడు.
‘‘ఐపీఎల్ కోసం దుబాయ్‌కు వెళ్లినప్పుడు అసలు నేను ఆస్ట్రేలియా పర్యటనలో ఆడతానని అనుకోలేదు. ప్రతిదీ నాకు దక్కిన బహుమతే. ఆటను ప్రేమిస్తూ ఉంటే అదే మనకి తిరిగి విజయాల్ని అందిస్తుంది. ఆర్చర్ సమీక్షకు వెళ్లిన తర్వాత 400 వికెట్ల ఘనత సాధించానని తెలిసింది. బోర్డుపై టెస్టుల్లో 400 వికెట్ల మార్క్‌ను అందుకున్నాని కనిపించింది. స్టేడియంలోని ప్రేక్షకులు లేచి చప్పట్లతో అభినందించారు. ఆ సమయంలో ఎలా భావోద్వేగం చెందానో చెప్పలేను. గత మూడు నెలలు గొప్పగా సాగాయి’’ అని అశ్విన్ పేర్కొన్నాడు.
మొతేరా వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అశ్విన్ సుదీర్ఘ ఫార్మాట్లో నాలుగు వందల వికెట్ల మైలురాయిని అందుకున్న విషయం తెలిసిందే. రెండో ఇన్నింగ్స్‌లో ఆర్చర్‌ను ఔట్ చేసి ఈ ఘనత సాధించాడు. ప్రపంచ క్రికెట్లో అత్యంత వేగంగా ఆ మైలురాయి చేరుకున్న రెండో బౌలర్‌గా యాష్ (77 టెస్టుల్లో) నిలిచాడు. తొలి స్థానంలో శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ (72 టెస్టులు) ఉన్నాడు.