Mary Kom: నాకు ఇంకా వయసు ఉంది! 40 ఏళ్ల వరకూ ఆడతా: మేరీకోమ్‌

తాజా వార్తలు

Published : 01/08/2021 01:07 IST

Mary Kom: నాకు ఇంకా వయసు ఉంది! 40 ఏళ్ల వరకూ ఆడతా: మేరీకోమ్‌

న్యూదిల్లీ: తాను బాక్సింగ్‌ ఆడేందుకు ఇంకా వయసు ఉందని, 40ఏళ్లు వచ్చే వరకూ తన ఆటను కొనసాగిస్తానని దిగ్గజ బాక్సర్‌ మేరీకోమ్‌ అన్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో అనూహ్యంగా ఓటమిపాలైన ఆమె శనివారం భారత్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో దిగిన ఆమెను బాక్సింగ్‌కు వీడ్కోలు పలుకుతారా? అని మీడియా ప్రశ్నకు పైవిధంగా స్పందించారు.

‘ఏమీ తీసుకురాకుండా దేశానికి తిరిగి రావటం చాలా బాధగా ఉంది. పతకంతో వస్తానని భావించా. దేశం మొత్తం నాకు మద్దతుగా నిలిచింది. ప్రీక్వార్టర్స్‌లో న్యాయ నిర్ణేతలు వ్యవహరించిన తీరు సరిగా లేదు. నేను తొలి రెండు రౌండ్లు గెలిచాను. నేనెలా ఓడిపోతాను? మరోసారి దేశానికి క్షమాపణలు చెబుతున్నా’ అని మేరీకోమ్‌ పేర్కొన్నారు.

ఇక జెర్సీ వివాదంపైనా మాట్లాడుతూ.. ‘బౌట్‌కు ముందు అధికారులు నా దగ్గరకు వచ్చి ‘మీ సొంత జెర్సీని వాడకూడదు’ అని చెప్పారు. తొలి మ్యాచ్‌లో అదే జెర్సీ వేసుకున్నా. అప్పుడు ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. మా కిట్‌ను చెక్‌ చేస్తామని ముందే చెప్పాల్సింది. అదొక మానసిక ఆందోళన. కేవలం మనకి మాత్రమే ఇలా చెప్పడమేంటి? ఇతర దేశాలకు లేని నిబంధనలు మనకే ఎందుకు’ అంటూ మేరీ ప్రశ్నించారు.

తాజా ఒలింపిక్స్‌ ప్రీక్వార్టర్స్‌లో హోరాహోరీగా సాగిన పోరులో 38ఏళ్ల మేరీ కోమ్‌ రియో ఒలింపిక్స్‌  కాంస్య పతక విజేత ఇంగ్రిట్‌ వాలెన్సియా(కొలంబియా) చేతిలో ఓటమి చవిచూసింది. బౌట్‌ ఆసాంతం కదులుతూ ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించినా చివరకు మేరీకి పరాజయమే మిగిలింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని