
తాజా వార్తలు
నవ్వుతూ తిరిగొస్తానని మాటిచ్చా: సూర్యకుమార్
ఇంటర్నెట్‌డెస్క్: టీమిండియాలో చోటు దక్కించుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని ముంబయి ఇండియన్స్ స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. ఇంగ్లాండ్‌తో జరగనున్న అయిదు టీ20ల సిరీస్‌కు సూర్య ఎంపికైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఓ జాతీయమీడియాతో మాట్లాడాడు. భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి ఆటగాళ్ల నుంచి మెళకువలు నేర్చుకుంటానని పేర్కొన్నాడు.
‘‘టీమిండియాకు ఎంపికైనందుకు ఎంతో గర్వంగా ఉంది. ఆ శుభవార్త విన్న తర్వాత నా క్రికెట్ ప్రయాణం ఒక్కసారిగా గుర్తొచ్చింది. కుటుంబమంతా ఎంతో సంతోషంగా ఉంది. ఎప్పటినుంచో కంటున్న కల ఇది. ప్రస్తుతం ఆట పరంగా ఉత్తమంగా ఉన్నానని భావిస్తున్నా. ఏ మేరకు ప్రాక్టీస్ చేయాలో, ఎంత విశ్రాంతి తీసుకోవాలనే అంశాలపై అవగాహన ఉంది. భారత జట్టుకు విజయాలు అందించడానికి సిద్ధంగా ఉన్నా. కోహ్లీ, రోహిత్ నుంచి ఆటలో మరింత నైపుణ్యం నేర్చుకుంటా. వారి నుంచే కాదు, భారత ఆటగాళ్లందరి సాయంతో సాధ్యమైనంత వరకు నా ఆటను మెరుగుపర్చుకుంటా’’ అని సూర్యకుమార్ అన్నాడు.
‘‘ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక కాకపోవడంపై ఎంతో నిరాశ చెందా. అయితే కుటుంబంతో పాటు ముంబయి ఆటగాళ్లందరూ నాకు ధైర్యం చెప్పారు. శ్రమిస్తూనే ఉండమని, సమయం వచ్చినప్పుడు తప్పక అవకాశం వస్తుందన్నారు. ఆ తర్వాత నా భార్యతో.. ఒంటరిగా బీచ్‌కు వెళ్తానని, తిరిగివచ్చేప్పుడు నవ్వుతూ తిరిగొస్తానని చెప్పా. బయోబబుల్, ఎంపిక కాకపోవడం వంటి ఆ పరిస్థితుల్లో నా సతీమణి నాతో ఉండటం అదృష్టమే. ఇక ఆ సమయంలో మా జట్టుకు కీలక మ్యాచ్‌లు ఉన్నాయి. మానసికంగా సన్నద్ధమై మంచి ప్రదర్శన చేశా’’ అని సూర్య తెలిపాడు.
గత ఐపీఎల్ సీజన్లో ముంబయి ఇండియన్స్ టైటిల్ సాధించడంలో సూర్య కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. 16 మ్యాచ్‌ల్లో 40 సగటు, 145 స్ట్రైక్‌రేట్‌తో 480 పరుగులు సాధించాడు. అయితే అతడు ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక కాకపోవడంపై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. కాగా, మార్చి 12న భారత్×ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌ను ప్రారంభం కానుంది.