భారత్‌ ‘రెడ్‌లిస్ట్‌’లో ఉన్నా యథావిధిగా WTC Final 
close

తాజా వార్తలు

Published : 20/04/2021 16:41 IST

భారత్‌ ‘రెడ్‌లిస్ట్‌’లో ఉన్నా యథావిధిగా WTC Final 

హామీ ఇచ్చిన ఐసీసీ

దుబాయి: టీమ్‌ఇండియా, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జూన్‌లో ఇంగ్లాండ్‌లో జరగాల్సిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ (WTC) యథావిధిగా జరుగుతుందని ఐసీసీ స్పష్టం చేసింది. సౌథాంప్టన్‌ వేదికగా జూన్‌ 18 నుంచి టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ నిర్వహించాలని ఇదివరకే ఐసీసీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే, భారత్‌లో ప్రస్తుతం రెండో దశ కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో అక్కడకు రాకపోకలపై ఇంగ్లాండ్‌ ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. భారత్‌ను ‘రెడ్‌లిస్ట్‌’ జాబితాలో చేర్చింది. అలాగే భారత్‌ నుంచి స్వదేశం తిరిగి వచ్చే బ్రిటన్‌ వాసులు పది రోజుల కఠిన క్వారంటైన్‌లో ఉండాల్సిన విధంగా చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఇంగ్లాండ్‌ కొత్త ఆంక్షలు విధించినా అనుకున్న ప్రకారమే టెస్టు ఛాంపియన్‌షిప్‌ నిర్వహిస్తామని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి హామీ ఇచ్చింది.

‘కరోనా వైరస్‌ తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లోనూ ఇంగ్లాండ్‌లో టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ను ఎలా నిర్వహించాలనేదానిపై ఈసీబీ, ఇతర అధికారులు మాకు వివరించారు. దాంతో అనుకున్న తేదీలోనే యథావిధిగా మ్యాచ్‌ను నిర్వహిస్తామనే నమ్మకంతో ఉన్నాం. అలాగే ప్రయాణ ఆంక్షలు విధించిన దేశాల పరిస్థితులపై ఇంగ్లాండ్‌ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాం’ అని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు ఈ విషయంపై స్పందించిన ఓ బీసీసీఐ అధికారి.. జూన్‌లో పరిస్థితులు ఎలా ఉంటాయో ఇప్పుడే చెప్పడం కష్టమన్నారు. ‘ప్రయాణ ఆంక్షలనేవి కరోనా వ్యాప్తిని బట్టి ఉంటాయి. జూన్‌లో టీమ్‌ఇండియా ఇంగ్లాండ్‌కు బయలుదేరే నాటికి భారత్‌ ‘రెడ్‌లిస్ట్‌’లో ఉండకపోవచ్చు’ అని అభిప్రాయపడ్డారు. అయితే, రెడ్‌లిస్ట్‌లో ఉన్న దేశాల ఆటగాళ్లు ఇంగ్లాండ్‌కు ఆడడానికి వస్తే తగిన ఏర్పాట్లు చేసి బయోసెక్యూర్‌ విధానంలో మ్యాచ్‌లు నిర్వహిస్తామని, అందుకు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని ఈసీబీ అధికారి మీడియాకు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని