ఐసీసీలో ‘కరకు’ ప్రవర్తన కలకలం

తాజా వార్తలు

Published : 10/03/2021 14:50 IST

ఐసీసీలో ‘కరకు’ ప్రవర్తన కలకలం

సెలవుపై వెళ్లిన అత్యున్నత అధికారి.. రాజీనామాకు యత్నాలు

దుబాయ్‌: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ)లో కలకలం! ప్రైస్‌వాటర్‌హౌజ్‌  కూపర్స్‌ నిర్వహించిన అంతర్గత దర్యాప్తులో ఐసీసీ సీఈవో మను సాహ్నీ ప్రవర్తన బాగాలేదని తేలింది. ప్రస్తుత ఆయన సెలవుపై వెళ్లారు. ఆయన చేత రాజీనామా చేయించేందుకు రంగం సిద్ధమవుతోందని సమాచారం.

2019 ప్రపంచకప్‌ ముగిసిన తర్వాత డేవ్‌ రిచర్డ్స్‌సన్‌ వెళ్లిపోయారు. ఆయన స్థానంలో సాహ్నీ వచ్చారు. 2022 వరకు పదవీకాలం ఉన్నా అన్ని విషయాల్లోనూ ఆయన ప్రవర్తన ఘర్షణాత్మకంగా ఉండటంతో సాగనంపక తప్పడం లేదు. సహోద్యోగులతోనూ ఆయన ‘కరకు’గా ప్రవర్తించేవారని దర్యాప్తులో తెలిసింది.

‘సాహ్నీ కరకు ప్రవర్తనకు గురై బాధపడ్డవారిలో ఐసీసీ సిబ్బంది చాలామందే ఉన్నారు’ అని బోర్డు సన్నిహిత అధికారి ఒకరు పీటీఐకి తెలిపారు. ‘సాహ్నీ మర్యాదపూర్వకంగా రాజీనామా సమర్పించేందుకు బోర్డు సభ్యులు ప్రయత్నాలు మొదలు పెట్టారు’ అని ఆ అధికారి పేర్కొన్నారు.

కొన్ని క్రికెట్‌ బోర్డులు సైతం సాహ్నీ ప్రవర్తనపై అసంతృప్తి వ్యక్తం చేసిన దాఖలాలు అనేకం ఉన్నాయి. తాత్కాలిక ఛైర్మన్‌ ఇమ్రాన్‌ ఖవాజాకు ఆయన మద్దతివ్వడమే ఇందుకు కారణం. గతేడాది కొత్త ఛైర్మన్‌ ఎన్నికల ప్రక్రియ చేపట్టినప్పటి నుంచి ఆయనపై ఒత్తిడి పెరిగింది. గత సీఈవో రిచర్డ్‌సన్‌ అందరితో చర్చించి సమష్టి నిర్ణయాలు తీసుకుంటే సాహ్నీ మాత్రం నియంతృత్వ ధోరణితో పనిచేసేవారన్న ఆరోపణలు ఉన్నాయి.

‘చాలా క్రికెట్‌ బోర్డులకు సాహ్నీపై ఇష్టం లేదు. కొత్త ఛైర్మన్‌ ఎన్నికల ప్రక్రియలో ఆయన జోక్యంపై అసంతృప్తి చెందాయి’ అని బీసీసీఐలోని ఓ సీనియర్‌ అధికారి తెలిపారు. ఐసీసీ నిర్వహణ, బిడ్లు దాఖలు చేసేందుకు రుసుము చెల్లించాలన్న నిర్ణయానికి ఆయన మద్దతు తెలపడమూ పెద్ద బోర్డులకు నచ్చలేదు. బీసీసీఐ, ఈసీబీ, క్రికెట్‌ ఆస్ట్రేలియా బోర్డు సమావేశాల్లో దీనిని తీవ్రంగా వ్యతిరేకించడం గమనార్హం. 2023-2031 మధ్య ఏటా ఐసీసీ టోర్నీ ఒకటి నిర్వహించాలన్న ఆయన నిర్ణయమూ వ్యతిరేకతకు కారణమైంది. సాహ్నీ రాజీనామా చేయకపోతే తొలగింపు ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. బోర్డుకు ఉన్న 17 మంది డైరెక్టర్లలో 12 మంది ఇందుకు మద్దతు ప్రకటించాల్సి ఉంటుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని