
తాజా వార్తలు
గబ్బాలో బుమ్రా ఆడితే టీమ్ఇండియాకు మేలు
ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా ఆడితే మంచిదని మాజీ క్రికెటర్ మదన్‌లాల్ అభిప్రాయపడ్డారు. భిన్నంగా ఉండే గబ్బా పిచ్‌పై అతడు టీమ్ఇండియాకు ప్రయోజనకారి అవుతాడని పేర్కొన్నారు. అతడు 50% ఫిట్నెస్తో ఉన్నా జట్టులోకి తీసుకొనే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నాడు. సిడ్నీ టెస్టు ముగిసే సరికి టీమ్ఇండియాలో గాయాల బారిన పడ్డ ఆటగాళ్ల జాబితా మరింత పెరిగింది. రవిచంద్రన్ అశ్విన్ వెన్నుముక నొప్పితో బాధపడుతున్నాడు. బుమ్రా అనారోగ్యంతో ఉన్నాడని తెలిసింది. నాలుగో టెస్టులో అతడు ఆడకపోయినా ఆశ్చర్యం లేదన్న వార్తలు వచ్చాయి. కాగా అతడు బుధవారం జట్టుతో కలిసి సాధన చేయడం గమనార్హం.
‘బ్రిస్బేన్ మైదానం భిన్నమైంది. టీమ్ఇండియాకు కచ్చితంగా సవాళ్లు ఎదురవుతాయి. ఒకవేళ జస్ప్రీత్ బుమ్రా ఆడితే జట్టుకు ప్రయోజనం కలుగుతుంది. గాయాలతో సీనియర్లు, కీలక ఆటగాళ్లు లేకపోయినా రిజర్వు బెంచ్ పటిష్ఠంగానే ఉంది. వారికి సుదీర్ఘ ఫార్మాట్లో దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం దొరుకుతుంది. ఏదేమైనా సిరీసులో ఆఖరి మ్యాచ్ కావడంతో రెండు జట్లు హోరాహోరీగా తలపడటం ఖాయం’ అని మదన్‌లాల్ అన్నారు.
‘టీమ్ఇండియా ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. సగానికి పైగా ఆటగాళ్లు గాయపడ్డారు. కీలక ఆటగాళ్లు లేని లోటు కచ్చితంగా ఉంటుంది. ఇప్పటికైతే తుది 11 మందీ ఆడటమే కష్టంగా అనిపిస్తోంది. గాయాల నేపథ్యంలో రిజర్వుబెంచ్లో ఆటగాళ్లకు అవకాశాలు దక్కుతాయి. ఒకవేళ అశ్విన్ ఫిట్‌గా ఉంటే ఆడతాడు. నిజానికి ఇదెంతో మంచివార్త. గాయాలు, జట్టుకు సంబంధించిన పూర్తి వివరాలు గురువారానికి తెలియొచ్చు’ అని మదన్ లాల్ తెలిపారు.
ఇవీ చదవండి
స్టీవ్ స్మిత్ కథలో మరో మలుపు
ఐపీఎల్ వల్లే ఆటగాళ్లకు గాయాలు