
తాజా వార్తలు
స్పిన్నర్లదే రాజ్యం.. ఆడితే పరుగులు
అక్షర్‌కు 4, అశ్విన్‌కు 3, సిరాజ్‌కు 2 వికెట్లు
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు 205
ఆట ముగిసే సరికి భారత్ స్కోరు 24/1
పిచ్.. పిచ్.. పిచ్.. నాలుగో టెస్టు పిచ్‌పై సందిగ్ధం తొలగిపోయింది! పట్టుదలతో ఆడిన బ్యాట్స్‌మెన్‌కు.. కట్టుతప్పని బౌలర్లకు అది సహకరించింది. స్పిన్ ద్వయం అక్షర్ పటేల్ (4/68), రవిచంద్రన్ అశ్విన్ (3/47) మాయాజాలానికి సిరాజ్ (2/45) పేస్ తోడవ్వడంతో ఇంగ్లాండ్ విలవిల్లాడింది. తొలి ఇన్నింగ్స్‌లో 205 పరుగులకే కుప్పకూలింది. తొలిరోజు ఆట ముగిసే సరికి టీమ్ఇండియా 24/1తో నిలిచింది. రోహిత్ శర్మ (8 బ్యాటింగ్; 34 బంతుల్లో 1×4), చెతేశ్వర్ పుజారా (15 బ్యాటింగ్; 36 బంతుల్లో 1×4)) క్రీజులో ఉన్నారు. ఇన్నింగ్స్ మూడో బంతికే శుభ్‌మన్ గిల్ (0) వికెట్ చేజార్చుకున్న భారత్ చివరి (12 ఓవర్లు) వరకు పట్టుదలగా ఆడింది. కోహ్లీసేన 181 పరుగుల లోటుతో ఉంది.
అక్షర్‌తో మొదలు
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్‌కు మరోసారి వరుస షాకులిచ్చాడు అక్షర్ పటేల్. జట్టు స్కోరు 15లోపే వరుస ఓవర్లలో ఓపెనర్లు డామ్ సిబ్లీ (2), జాక్ క్రాలీ (9; 30 బంతుల్లో)ని పెవిలియన్ పంపించేశాడు. అతడిచ్చిన షాకు నుంచి తేరుకొనే లోపే సారథి జో రూట్ (5)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకొని ఇంగ్లాండ్‌ను మరింత దెబ్బకొట్టాడు సిరాజ్. 30కే 3 వికెట్లు చేజార్చుకున్న జట్టును జానీ బెయిర్‌స్టో (28; 67 బంతుల్లో 6×4)తో కలిసి బెన్‌స్టోక్స్ (55; 121 బంతుల్లో 6×4, 2×6) గట్టెక్కించే ప్రయత్నం చేశాడు. భోజన విరామానికి జట్టు స్కోరును 74/3కు చేర్చాడు.
స్టోక్స్ భాగస్వామ్యాలు
లంచ్ తర్వాత స్టోక్స్-బెయిర్ స్టో జోడీ ఒకవైపు ఆచితూచి ఆడుతూనే మరోవైపు అందివచ్చిన బంతుల్ని బౌండరీకి తరలించింది. నాలుగో వికెట్‌కు 48 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని జట్టు స్కోరు 78 వద్ద బెయిర్‌స్టోను ఎల్బీ చేయడం ద్వారా సిరాజ్ విడదీశాడు. ఈ క్రమంలో ఒలీపోప్ (29; 87 బంతుల్లో 2×4)తో కలిసి స్టోక్స్ భాగస్వామ్యం నెలకొల్పేందుకు ప్రయత్నించాడు. జట్టు స్కోరును 100 దాటించాడు. అర్ధశతకం అందుకున్నాడు. క్రీజులో నిలదొక్కుకున్న అతడిని చక్కని ఆర్మ్‌బాల్ ద్వారా వాషింగ్టన్ సుందర్ ఎల్బీగా ఔట్ చేశాడు. పిచైన తర్వాత స్పిన్ తిరగని బంతి నేరుగా స్టోక్స్ ప్యాడ్లను తాకేసింది. దాంతో ఐదో వికెట్‌కు 43 పరుగుల స్టోక్స్ భాగస్వామ్యానికి తెరపడింది.
ఆఖర్లోనూ స్పిన్నర్లే
బెన్‌స్టోక్స్ ఔటవ్వడంతో 144/5తో తేనీటి విరామానికి వెళ్లిన ఇంగ్లాండ్‌ను ఒలీ పోప్, కొత్త ఆటగాడు డేనియెల్ లారెన్స్ (46; 74 బంతుల్లో 8×4) కాసేపు ఆదుకున్నారు. ముఖ్యంగా లారెన్స్ చూడచక్కని షాట్లు ఆడాడు. అటు స్పిన్ ఇటు పేస్‌ను చక్కగా ఎదుర్కొన్నాడు. అడపా దడపా బౌండరీలు బాదుతూ అర్ధశతకంవైపు సాగాడు. ఆరో వికెట్‌కు 45 పరుగుల భాగస్వామ్యం అందించాడు. ఈ క్రమంలో అశ్విన్ వేసిన 61.3వ బంతికి ఒలీ పోప్.. గిల్‌కు క్యాచ్ ఇచ్చాడు. అప్పుడు జట్టు స్కోరు 166. మరికాపటికే అక్షర్ పటేల్ వేసిన 71 ఓవర్లో రెండు వికెట్లు పడ్డాయి. తొలి బంతికి లారెన్స్‌ను పంత్ స్టంపౌట్ చేయగా నాలుగో బంతికి బెన్‌ఫోక్స్ ఇచ్చిన (1; 12 బంతుల్లో) ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో రహానె అందుకొన్నాడు. ఆ తర్వాత డామ్ బెస్ (3)ను అక్షర్, జాక్ లీచ్ (7)ను యాష్ ఔట్ చేయడంతో ఇంగ్లాండ్ 205కు ఆలౌటైంది.