INDvsSL: తొలి టీ20 భారత్‌దే

తాజా వార్తలు

Updated : 25/07/2021 23:56 IST

INDvsSL: తొలి టీ20 భారత్‌దే

శ్రీలంకపై 38 పరుగులతో గెలుపు..

కొలంబో: శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో భారత్‌ 38 పరుగుల తేడాతో విజయం సాధించింది. గబ్బర్‌సేన నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆతిథ్య జట్టు 126 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌ 4/22, దీపక్‌ చాహర్‌ 2/24 కీలక సమయంలో చెలరేగడంతో ఆ జట్టు 18.3 ఓవర్లలోనే ఆలౌటైంది. దాంతో భారత్‌ మూడు టీ20ల సిరీస్‌లో శుభారంభం చేసింది. మరోవైపు లంక జట్టులో మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ చారిత్‌ అసలంక (44; 26 బంతుల్లో 3x4, 3x6) ఒక్కడే మెరిశాడు. అంతకుముందు ఓపెనర్‌ అవిష్క ఫెర్నాండో (26; 23 బంతుల్లో 3x4) ఫర్వాలేదనిపించాడు.

మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక 15 ఓవర్ల వరకు బాగానే ఆడింది. అప్పటికి జట్టు స్కోర్‌ 107/4తో మంచి స్థితిలో ఉంది. అసలంక అర్ధశతకానికి చేరువై దూకుడుమీదున్నాడు. దాంతో ఆ జట్టు సునాయాస విజయం సాధిస్తుందని అనిపించింది. అయితే, దీపక్‌ చాహర్‌ వేసిన 16వ ఓవర్‌లో అసలంక ఔటవ్వడంతో మ్యాచ్‌ మలుపు తిరిగింది. అదే ఓవర్‌లో హసరంగా సైతం డకౌటయ్యాడు. దాంతో శ్రీలంక 16 ఓవర్లకు 113/6తో నిలిచింది. తర్వాత వరుస ఓవర్లలో కరుణరత్నె(3), డాసున్‌ శనక (16) సైతం పెవిలియన్‌ చేరడంతో లంక ఓటమి ఖాయమైంది. చివరికి భువనేశ్వర్‌ 19వ ఓవర్‌లో ఆఖరి రెండు వికెట్లు తీసి భారత్‌కు విజయాన్ని అందించాడు.

ఇక తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. సూర్యకుమార్‌ యాదవ్‌(50; 34 బంతుల్లో 5x4, 2x6), అర్ధ శతకంతో మెరవగా, కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌(46; 36 బంతుల్లో 4x4, 1x6) త్రుటిలో ఆ అవకాశాన్ని కోల్పోయాడు. అయితే, వీరిద్దరూ మూడో వికెట్‌కు 62 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలోనే స్కోరుబోర్డును పరుగులు పెట్టించే క్రమంలో ధావన్‌ అర్ధ శతకానికి ముందు ఔటయ్యాడు. తర్వాత సూర్యకుమార్‌ అర్ధశతకం పూర్తి చేసుకున్నాక పెవిలియన్‌ చేరాడు. కాగా, చివర్లో ఇషాన్‌ కిషన్‌(20 నాటౌట్‌; 14 బంతుల్లో 1x4, 1x6) కాస్త వేగంగా పరుగులు చేయడంతో భారత్‌ మోస్తరు స్కోర్‌ నమోదు చేసింది.

4 వికెట్లు తీసి భారత్ విజయంలో కీలకపాత్ర పోషించిన భువనేశ్వర్‌ కుమార్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని