Team India: అప్పుడు ఆసీస్‌కే సాధ్యం కాలేదు

తాజా వార్తలు

Published : 21/05/2021 11:20 IST

Team India: అప్పుడు ఆసీస్‌కే సాధ్యం కాలేదు

ఇప్పుడు భారత్‌ చేస్తోందన్న ఇంజమామ్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒకే సమయంలో రెండు జట్లను ఆడిస్తున్న ఏకైక దేశం భారతేనని పాక్‌ క్రికెట్‌ దిగ్గజం ఇంజమామ్‌ ఉల్‌ హఖ్‌ అన్నాడు. టీమ్‌ఇండియా-ఏ మాదిరిగానే ‘బి’ జట్టు సైతం పటిష్ఠంగా ఉందన్నాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌, చక్కని దేశవాళీ క్రికెట్‌ విధానమే ఇందుకు కారణమని వెల్లడించాడు. 1998లో రెండు జట్లుగా విడిపోయిన భారత్‌ విఫలమైందని వివరించాడు.

‘భారత్‌ రెండో జట్టును బరిలోకి దించడం ఆసక్తిగా అనిపిస్తోంది. ఇప్పుడు టీమ్‌ఇండియా చేస్తున్నట్టే కొన్నేళ్ల ముందు ఆస్ట్రేలియా సైతం చేసింది. కానీ విజయవంతం కాలేదు. బీసీసీఐ మళ్లీ దానిని తెరపైకి తెస్తోంది. తొలిసారి ఒక జాతీయ జట్టు రెండుగా విడిపోయి రెండు వేర్వేరు సిరీసులు ఆడుతోంది. ఒకటి ఇంగ్లాండ్‌, మరోటి శ్రీలంకలో పర్యటించనుంది. రెండూ జాతీయ జట్లే’ అని ఇంజీ అన్నాడు.

‘ప్రపంచ క్రికెట్లో ఆస్ట్రేలియా ఆధిపత్యం వహిస్తున్న రోజుల్లో అంతర్జాతీయ జట్లకు ఆస్ట్రేలియా-ఏ, ఆస్ట్రేలియా-బిగా నామకరణం చేయాలని ప్రయత్నించింది. కానీ అనుమతి దొరకలేదు. ఒకప్పుడు ఆసీస్‌ చేయలేనిది ఇప్పుడు భారత్‌ చేసేస్తోంది. ప్రస్తుత ఐసోలేషన్‌, క్వారంటైన్‌ ఆంక్షల్లో ఇది సమంజసంగానే అనిపిస్తోంది’ అని ఇంజమామ్‌ తెలిపాడు.

ఇంగ్లాండ్‌లో పర్యటిస్తున్న జట్టులాగే శ్రీలంకకు వెళ్లే జట్టూ బలంగానే అనిపిస్తోందని ఇంజీ అంచనా వేశాడు. ‘భారత్‌ వద్ద భారీ సంఖ్యలో ప్రతిభావంతులు ఉన్నారు. శ్రీలంకకు వెళ్తున్న ఆటగాళ్ల బృందమూ అసలైన టీమ్‌ఇండియాలాగే అనిపిస్తోంది. భారత్‌ తన దేశవాళీ క్రికెట్‌ విధానాన్ని మెరుగుపర్చుకుంది. అదే సమయంలో ఐపీఎల్‌ సాయపడింది. ఫలితంగానే భారత్‌ రెండు జట్లను పంపగలుగుతోంది. జాతీయ జట్టుకు ఆడగల 50 మంది ఆటగాళ్లను బీసీసీఐ సిద్ధం చేసింది’ అని అన్నాడు. కాగా 1998లో కామన్వెల్త్‌ క్రీడల కోసం రెండు జట్లుగా విడిపోయినప్పుడు భారత్‌ విజయవంతం కాలేదని పేర్కొన్నాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని