అ‘స్పిన్’‌ ఉచ్చులో ఇంగ్లాండ్‌ విలవిల 

తాజా వార్తలు

Updated : 14/02/2021 17:10 IST

అ‘స్పిన్’‌ ఉచ్చులో ఇంగ్లాండ్‌ విలవిల 

249 పరుగుల ఆధిక్యంలో భారత్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: అదే ఆధిపత్యం. తొలి రోజు బ్యాటుతో చెలరేగిన టీమిండియా.. రెండో రోజు బంతితో విజృంభించింది. రవిచంద్రన్ అశ్విన్‌ (5/43) మాయాజాలానికి ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 134 పరుగులకే కుప్పకూలింది. బెన్‌ ఫోక్స్‌ (42*; 107 బంతుల్లో, 4×4) టాప్‌ స్కోరర్‌. అనంతరం 195 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన టీమిండియా ఆదివారం ఆట ఆఖరుకు 54/1తో నిలిచింది. మొత్తంగా ప్రత్యర్థి కంటే 249 పరుగుల ఆధిక్యంలో ఉంది. క్రీజులో రోహిత్ శర్మ (25*; 62 బంతుల్లో, 2×4, 1×6), పుజారా (7*; 18 బంతుల్లో, 1×4) ఉన్నారు.


అంతకుముందు 300/6 స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. 7.5 ఓవర్లలో 29 పరుగులు చేసి ఆఖరి నాలుగు వికెట్లు కోల్పోయింది. రిషభ్‌ పంత్‌ (58*; 77 బంతుల్లో, 7×4, 3×6) అజేయంగా నిలిచాడు. రెండో ఓవర్‌లోనే మొయిన్‌ అలీ (4/128) టీమిండియాను దెబ్బతీశాడు. అక్షర్‌ పటేల్‌ (5; 14 బంతుల్లో, 1×4), ఇషాంత్ శర్మ (0)ను ఔట్ చేశాడు.

నంతరం పంత్‌ బౌండరీలే లక్ష్యంగా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కుల్‌దీప్‌కు ఎక్కువ స్ట్రైక్‌ ఇవ్వకుండా పరుగులు సాధించాడు. ఈ క్రమంలో 65 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. అయితే పంత్‌కు సహచరుల నుంచి ఎక్కువసేపు సహకారం లభించలేదు. కుల్‌దీప్‌(0), సిరాజ్‌ (4)ను స్టోన్‌ (3/47) పెవిలియన్‌కు చేర్చడంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 329 పరుగులకు ఆలౌటైంది.


ఇంగ్లాండ్ 134 పరుగులకే ఆలౌట్‌

రెండో రోజు ఆటలో టీమిండియాను తక్కువ స్కోరుకే కట్టడిచేశామనే ఆనందం ఇంగ్లాండ్‌కు ఎక్కువసేపు నిలవలేదు. భారత బౌలర్ల ధాటికి లంచ్‌ విరామానికి ఇంగ్లాండ్ 39/4తో పీకల్లోతు కష్టాల్లో నిలిచింది. తొలి ఓవర్‌లోనే బర్న్స్‌ (0)ను ఇషాంత్‌ (2/22) వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ తర్వాత సిబ్లీ (16)ని అశ్విన్‌, ప్రమాదకర బ్యాట్స్‌మన్‌ రూట్‌ (6)ను అక్షర్‌ పటేల్ (2/40) ఔట్ చేశారు. అయితే తొలి సెషన్‌ ఆఖరి బంతికి డేనియల్‌ (9)ను అశ్విన్‌ తెలివిగా బోల్తాకొట్టించడం ఆకట్టుకుంది.

రెండో సెషన్‌ ప్రారంభమైన కొద్దిసేపటికే అశ్విన్‌ అద్భుతమైన బంతికి బెన్‌ స్టోక్స్‌ (18) ఔటవ్వడంతో ఇంగ్లాండ్ 52 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. అయితే పోప్ (22; 57 బంతుల్లో, 1×4)తో కలిసి ఫోక్స్‌ ఇన్నింగ్స్‌ చక్కదిద్దడానికి ప్రయత్నించాడు. వీరిద్దరూ మరో వికెట్‌ పడకుండా కాసేపు ప్రతిఘటించారు. అయితే డ్రింక్స్‌ బ్రేక్‌ తర్వాత సిరాజ్‌ (1/5) తొలి బంతికే పోప్‌ను ఔట్ చేసి ఇంగ్లాండ్‌ను దెబ్బతీశాడు. ఆ తర్వాత భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో ఇంగ్లాండ్ 134 పరుగులకే కుప్పకూలింది. అయితే పర్యాటక జట్టు ఫాలోఆన్‌ తప్పించుకోవడానికి కారణం ఫోక్స్‌ పోరాటమే.


అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన రోహిత్ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌ (14; 28 బంతుల్లో, 1×6) ధాటిగా ఆడారు. రోహిత్ ఫుల్‌, గిల్ లాఫ్టెడ్‌ షాట్లతో అలరించారు. అయితే జట్టు స్కోరు 42 పరుగుల వద్ద గిల్‌ను లీచ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. గిల్‌ సమీక్షకు వెళ్లినా ఫలితం లేకపోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన పుజారాతో కలిసి రోహిత్‌ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు. కాగా, లీచ్‌ వేసిన తొమ్మిదో ఓవర్‌లో రోహిత్‌కు లైఫ్ లభించింది. వికెట్‌కీపర్ ఫోక్స్‌ స్టంపౌట్ చేయడంలో విఫలమయ్యాడు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని