
తాజా వార్తలు
నాలుగో టెస్టు: పట్టు బిగించిన భారత్
(Image: BCCI)
అహ్మదాబాద్: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఆఖరి టెస్టుపై టీమ్ఇండియా పట్టుబిగించింది. రెండోరోజు ఆటముగిసే సరికి 294/7తో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో 89 పరుగుల ఆధిక్యం సాధించింది. యువ ఆటగాడు రిషభ్ పంత్ (101; 118 బంతుల్లో 13×4, 2×6) అద్వితీయమైన శతకంతో జట్టును ఆదుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ (60 బ్యాటింగ్; 117 బంతుల్లో 8×4), అక్షర్ పటేల్ (11 బ్యాటింగ్; 34 బంతుల్లో 2×4) అజేయంగా నిలిచారు.
దక్కని శుభారంభం
రెండోరోజు, శుక్రవారం ఓవర్‌నైట్ స్కోరు 24/1తో ఆట ఆరంభించిన భారత్‌కు శుభారంభం దక్కలేదు. జట్టు స్కోరు 40 వద్ద చెతేశ్వర్ పుజారా (17)ను జాక్‌లీచ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. మరో పరుగు వ్యవధిలోనే విరాట్ కోహ్లీ (0)ని బెన్‌స్టోక్స్ పెవిలియన్ పంపించాడు. ఈ క్రమంలో అజింక్య రహానె (27; 45 బంతుల్లో 4×4)తో కలిసి రోహిత్ శర్మ (49; 144 బంతుల్లో 7×4) జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశాడు. అయితే అజింక్యను అండర్సన్ బోల్తా కొట్టించడంతో 80/4తో టీమ్ఇండియా భోజన విరామానికి వెళ్లింది. తేనీటి విరామం ముంగిట రోహిత్, అశ్విన్ (13) వెంటవెంటనే ఔటవ్వడంతో స్కోరు వేగం మందగించింది.
‘పంత్’ సుందరం
తేనీటి విరామం తర్వాత వాషింగ్టన్ సుందర్‌తో కలిసి రిషభ్ పంత్ అద్భుతమైన భాగస్వామ్యం నిర్మించాడు. ఏడో వికెట్‌కు 158 బంతుల్లో 113 పరుగుల భాగస్వామ్యం అందించాడు. 82 బంతుల్లో అర్ధశతకం అందుకున్న పంత్ ఆ తర్వాత రెచ్చిపోయాడు. కొత్త బంతితో స్వింగ్ చేద్దామనుకున్న ఇంగ్లాండ్ పేసర్లు అండర్సన్, బెన్‌స్టోక్స్‌పై వరుస బౌండరీలతో విరుచుకుపడ్డాడు. వారిపై ఆధిపత్యం చెలాయించాడు. కేవలం 115 బంతుల్లోనే శతకం అందుకున్నాడు. 94 పరుగుల వద్ద అతడు సిక్సర్‌తో ఈ ఘనత అందుకోవడం ప్రత్యేకం. కానీ మరో పరుగు చేయగానే అండర్సన్ బౌలింగ్‌లో అతడు రూట్‌కు క్యాచ్ ఇచ్చాడు. అప్పటికి జట్టు స్కోరు 259. మరికాసేపటికే సుందర్ అర్ధశతకం సాధించాడు. అతడికి అక్షర్ పటేల్ అండగా నిలిచాడు. మూడో రోజు భారత్ మరో 100 పరుగులు చేయగలిగితే ఇక మ్యాచ్ పూర్తిగా భారత్‌వైపు తిరిగినట్టే!