ధోనీసేనకు ముచ్చెమటలు పట్టించిన బంగ్లా.. 

తాజా వార్తలు

Published : 23/03/2021 11:01 IST

ధోనీసేనకు ముచ్చెమటలు పట్టించిన బంగ్లా.. 

ఒక్క పరుగుతో టీమ్‌ఇండియా విజయం

ఇంటర్నెట్‌డెస్క్‌: బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టు అప్పుడప్పుడు సంచలనాలు సృష్టిస్తుంది. ఎప్పుడు ఎలా చెలరేగుతుందో ఎవరికీ అంతుబట్టదు. తనదైన రోజు ఏ బలమైన జట్టునైనా ఓడించగలదు. ఈ విషయం భారత క్రికెట్‌ ప్రేమికులకు 2007 వన్డే ప్రపంచకప్‌లోనే తెలిసొచ్చింది. ఇక సరిగ్గా ఐదేళ్ల క్రితం కూడా బంగ్లా ఇలానే టీమ్‌ఇండియాకు షాకిచ్చేలా కనిపించింది. ఆ జట్టు విజయానికి చివరి 3 బంతుల్లో 2 పరుగులు అవసరమైన వేళ ధోనీ చాకచక్యంగా వ్యవహరించడంతో సరిపోయింది. లేదంటే టీమ్‌ఇండియాకు మరోసారి భంగపాటు తప్పేది కాదు. ఈ మ్యాచ్‌ గురించి ఓసారి గుర్తు చేసుకుందాం.


తేలిపోయిన టీమ్ఇండియా..

2016 టీ20 ప్రపంచకప్‌ సందర్భంగా గ్రూప్‌ బిలో జరిగిన ఈ మ్యాచ్‌కు బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికైంది. అప్పటికే మంచి బలమైన బ్యాటింగ్‌ లైనప్‌ కలిగిన టీమ్‌ఇండియా చిన్నస్వామి లాంటి చిన్న స్టేడియంలో పరుగుల వరద పారిస్తుందని అంతా భావించారు. కానీ, టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ధోనీసేన అనుకున్నంత స్థాయిలో మెరవలేదు. తొలి వికెట్‌కు రోహిత్‌(18), ధావన్‌(23).. 42 పరుగులు జోడించి శుభారంభం చేశారు. తర్వాత కోహ్లీ(24), రైనా(30), పాండ్య(15), ధోనీ(13), యువరాజ్‌(3) బ్యాటింగ్‌ చేసినా ఎవరూ పెద్ద స్కోర్లు సాధించలేకపోయారు. దాంతో టీమ్ఇండియా 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 146/7 స్కోర్‌ సాధించింది. ఈ స్కోరు చూశాక మ్యాచ్‌పై ఆశలు సన్నగిల్లాయి సగటు భారత అభిమానికి.


3 బంతులు, 2 పరుగులు, 3 వికెట్లు..

లక్ష్యం పెద్దది కాకపోవడంతో బంగ్లాదేశ్‌ సైతం ఆడుతూ పాడుతూ పరుగులు చేసింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు తగిన రన్‌రేట్‌ను కొనసాగిస్తూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లింది. తమిమ్‌ ఇక్బాల్‌(35; 32 బంతుల్లో 5x4), షకిబ్‌ అల్‌ హసన్‌(22; 15 బంతుల్లో 2x6), షబ్బిర్‌ రహ్మాన్‌(26; 15 బంతుల్లో 3x4, 1x6) ఫర్వాలేదనిపించారు. అయితే, బంగ్లా విజయానికి చివరి ఓవర్‌లో 11 పరుగులు అవసరమైన వేళ ఉత్కంఠ తారస్థాయికి చేరింది. అప్పటికే ధాటిగా ఆడుతున్న రహీమ్‌(11), మహ్మదుల్లా(18) క్రీజులో ఉన్నారు. పాండ్య వేసిన ఆ ఓవర్‌లో తొలి మూడు బంతులకు 9 పరుగులు చేశారు. దాంతో సమీకరణం 3 బంతుల్లో 2 పరుగులుగా మారింది. కానీ ఇక్కడే ధోనీ ఫీల్డింగ్‌ మార్చి తన చతురత ప్రదర్శించాడు. అది ఫలించింది. 19.4 బంతికి రహీమ్‌ ఆడిన షాట్‌ను ధావన్‌ క్యాచ్‌ అందుకోగా, తర్వాతి బంతికే మహ్మదుల్లా క్యాచ్‌ను జడేజా ఒడిసిపట్టాడు. ఇక చివరి బంతికి 2 పరుగులు అవసరమైన వేళ ధోనీ ముస్తాఫిజుర్‌(0)ను రనౌట్‌ చేయడంతో బంగ్లా స్కోర్‌ 145/9గా నమోదైంది. టీమ్‌ఇండియా ఒక్క పరుగుతో విజయం సాధించింది. కానీ, ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ గెలిచినంత పనిచేసి ధోనీసేనకు చెమటలు పట్టించింది. ఈ మ్యాచ్‌ జరిగి నేటికి ఐదేళ్లు గడిచాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని