T20 World Cup: ఆస్ట్రేలియాతో వార్మప్‌ మ్యాచ్‌.. భారత్ ముందు మోస్తరు లక్ష్యం

తాజా వార్తలు

Published : 20/10/2021 17:27 IST

T20 World Cup: ఆస్ట్రేలియాతో వార్మప్‌ మ్యాచ్‌.. భారత్ ముందు మోస్తరు లక్ష్యం

ఇంటర్నెట్‌ డెస్క్‌: దుబాయ్‌ వేదికగా జరుగుతున్న వార్మప్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆరంభంలో తడబడినా.. తర్వాత కుదురుకుని మోస్తరు పరుగులు చేసింది. తొలి నాలుగు ఓవర్లలోనే మూడు కీలక వికెట్లు తీసిన భారత బౌలర్లు తర్వాత పట్టు సడలించారు. దీంతో ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. భారత్‌ ముందు 153 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో స్టీవ్‌ స్మిత్‌ (57) అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. భారత బౌలర్లలో రవిచంద్రన్‌ అశ్విన్‌ రెండు, రవీంద్ర జడేజా, రాహుల్‌ చాహర్‌, భువనేశ్వర్‌ కుమార్‌ తలో వికెట్‌ తీశారు. 

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కి దిగిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ డేవిడ్‌ వార్నర్‌ (1) ఫేలవ ఫామ్‌ను కొనసాగించాడు. రవిచంద్రన్‌ అశ్విన్‌ వేసిన రెండో ఓవర్‌ ఐదో బంతికి అతడు ఎల్బీగా వెనుదిరిగాడు. వన్‌డౌన్‌ బ్యాటర్‌గా క్రీజులోకి వచ్చిన మిచెల్‌ మార్ష్‌ (0) కూడా తర్వాతి బంతికే పెవిలియన్‌ చేరాడు. రెండో ఓవర్‌ చివరి బంతికి అతడు రోహిత్ శర్మకి క్యాచ్‌ ఇచ్చి క్రీజు వీడాడు. మరో ఓపెనర్ ఆరోన్‌ ఫించ్‌(8) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. రవీంద్ర జడేజా వేసిన నాలుగో ఓవర్లో అతడు వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన స్టీవ్‌ స్మిత్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (37) నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్‌ని నిలబెట్టారు. ఈ క్రమంలోనే రాహుల్ చాహర్ వేసిన 12వ ఓవర్లో మాక్స్‌వెల్‌ బౌల్డయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన మార్కస్‌ స్టొయినిస్ (41)తో కలిసి స్టీవ్‌ స్మిత్ ఇన్నింగ్స్‌ కొనసాగించాడు. భువనేశ్వర్‌ కుమార్ వేసిన చివరి ఓవర్లో స్టీవ్ స్మిత్‌ రోహిత్ శర్మకి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఆఖరి ఓవర్లలో ఆస్ట్రేలియా బ్యాటర్లు దూకుడుగా ఆడటంతో మోస్తరు పరుగులు చేయగలిగింది. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని