ఇంగ్లాండ్‌పై టీమ్‌ఇండియాదే కొత్త రికార్డు

తాజా వార్తలు

Published : 21/03/2021 10:18 IST

ఇంగ్లాండ్‌పై టీమ్‌ఇండియాదే కొత్త రికార్డు

ఐదో టీ20లో నమోదైన మరిన్ని రికార్డులు..

(Photo:BCCI)

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇంగ్లాండ్‌తో జరిగిన ఆఖరి టీ20లో టీమ్‌ఇండియా 36 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో కోహ్లీసేన ఈ సిరీస్‌ను 3-2 తేడాతో కైవసం చేసుకుంది. ఇక ఇదే విజయంతో టీమ్‌ఇండియా.. 2016 టీ20 ప్రపంచకప్‌ తర్వాత ఇంగ్లాండ్‌పై అత్యధికంగా మూడుసార్లు పొట్టి సిరీస్‌ కైవసం చేసుకుంది. ఆ జట్టుపై ఈ రికార్డు నమోదు చేసిన తొలి టీమ్‌గా భారత్‌ అవతరించింది.

మొతేరా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్‌ఇండియా 224/2 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ రోహిత్‌ శర్మ (64; 34 బంతుల్లో 4x4, 5x6), కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(80నాటౌట్‌; 52 బంతుల్లో 7x4, 2x6) రెచ్చిపోయి ఆడారు. వీరిద్దరూ ఈ ఫార్మాట్‌లో తొలిసారి ఓపెనింగ్‌ చేసి ఇంగ్లాండ్‌ బౌలర్లకు చుక్కలు చూపించారు. రోహిత్‌ క్రీజులో ఉన్నంతసేపు దూకుడుగా ఆడగా, కోహ్లీ నిలకడగా ఆడాడు. అలా వీరిద్దరూ 9 ఓవర్లకే జట్టు స్కోరును 90 పరుగులు దాటించారు. ఇక 94 పరుగుల వద్ద రోహిత్‌ ఔటయ్యాక గేర్‌ మార్చిన కోహ్లీ.. సూర్యకుమార్‌ యాదవ్‌(32; 17 బంతుల్లో 3x4, 2x6), హార్దిక్‌ పాండ్య(37నాటౌట్‌; 17 బంతుల్ల్లో 4x4, 2x6)తో కలిసి జట్టుకు భారీ స్కోర్‌ అందించాడు. ఆపై ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ జాస్‌ బట్లర్‌(52; 34బంతుల్లో 2x4, 4x6), డేవిడ్‌ మలన్‌(68; 46 బంతుల్లో 9x4, 2x6) దంచికొట్టినా ఇతర బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారు. చివరికి ఆ జట్టు 188/8తో సరిపెట్టుకొని ఓటమిపాలైంది.

ఈ మ్యాచ్‌లో నమోదైన రికార్డులు..

* పొట్టి క్రికెట్‌లో ఇంగ్లాండ్‌పై టీమ్‌ఇండియాకు ఇదే అత్యుత్తమ స్కోర్‌ 224/2. 2007లో ఇదే జట్టుపై 218/4 స్కోర్‌ సాధించింది. ఇక మొత్తంగా ఇది నాలుగో అత్యుత్తమ స్కోర్‌ కావడం విశేషం.

* ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ మలన్‌ టీ20ల్లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు పూర్తిచేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. 24 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించాడు. అంతకుముందు బాబర్‌ అజామ్‌ 26, విరాట్‌ కోహ్లీ 27, ఆరోన్‌ ఫించ్‌, కేఎల్‌ రాహుల్‌ చెరో 29 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించారు.

* ఇక కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీ ఈ ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు(1,502) సాధించిన ఆటగాడిగా నిలిచాడు. 45 మ్యాచ్‌ల్లో ఈ రికార్డు చేరుకున్నాడు. అంతకుముందు ఆరోన్‌ఫించ్‌ 44 మ్యాచ్‌ల్లో 1,462 పరుగులు, కేన్‌ విలియమ్సన్‌ 49 మ్యాచ్‌ల్లో 1,383 పరుగులతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

* అలాగే ఒక టీ20 సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగానూ కోహ్లీ కొత్త రికార్డు నమోదు చేశాడు. ఈ సిరీస్‌లో అతడు మొత్తం 231 పరుగులు సాధించాడు. దీంతో 2020లో న్యూజిలాండ్‌పై కేఎల్‌ రాహుల్‌ సాధించిన 224 పరుగుల రికార్డును అధిగమించాడు. ఇక 2018లో కొలిన్‌ మన్రో వెస్టిండీస్‌పై 223 పరుగులు సాధించడంతో మూడోస్థానంలో ఉన్నాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని