India vs Srilanka: దంచికొడితే.. పరుగుల సునామీయే!

తాజా వార్తలు

Published : 06/07/2021 09:49 IST

India vs Srilanka: దంచికొడితే.. పరుగుల సునామీయే!

భారత్‌, లంకలో టాప్‌-5 పరుగుల వీరులు వీరే

లంకేయులతో పోరు ఎప్పటికీ ఆసక్తికరమే! ఎందుకంటే టీమ్‌ఇండియా ఘనమైన రికార్డులన్నీ వారిపైనే ఉన్నాయి. భారత్‌, శ్రీలంక మధ్య ఎప్పుడు మ్యాచులు జరిగినా భారీ స్కోర్లు నమోదు అవుతుంటాయి. మరికొన్ని రోజుల్లోనే యువకులతో కూడిన ‘గబ్బర్‌ సేన’ లంకతో పరిమిత ఓవర్ల క్రికెట్లో తలపడనుంది. ఈ నేపథ్యంలో వన్డేల్లో ఈ రెండు జట్ల ఆటగాళ్ల అత్యుత్తమ ఇన్నింగ్సులు గుర్తు చేసుకుందామా!!


అద‘రోహిత్‌’ @ 264

రోహిత్‌ శర్మ.. లంకేయులకు ఈ పేరు వింటేనే హడల్‌! ఒక్కసారి కాదు ఏకంగా రెండుసార్లు ఆ జట్టుపై వన్డేల్లో ద్విశతకాలు చేశాడు. తిరుగులేని ఘనతలు సొంతం చేసుకున్నాడు. ‘వన్డేల్లో డబుల్‌ సెంచరీ అంటే నేనే’ అని నిరూపించుకున్నాడు. లంకతో మ్యాచంటే హిట్‌మ్యాన్‌కు ఓ సంబరమే అనుకోవాలి. 2014, నవంబర్‌ 13న కోల్‌కతా వేదికగా రోహిత్‌ ప్రత్యర్థికి చుక్కలు చూపించాడు. 173 బంతుల్లోనే 33 బౌండరీలు, 9 సిక్సర్లతో 264 పరుగులు చేశాడు. ఓపెనర్‌గా దిగిన అతడు ఆఖరి ఓవర్‌ ఆఖరి బంతికి ఔటయ్యాడు.72 బంతుల్లో అర్ధశతకం చేసిన హిట్‌మ్యాన్‌ 100 బంతుల్లో 100 పూర్తి చేశాడు. డ్రింక్స్‌ బ్రేక్‌ తర్వాత ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. 125 బంతుల్లోనే 150కి, 151 బంతుల్లో 200, 166 బంతుల్లో 250కి చేరుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఈ రికార్డును బద్దలు చేయడం మళ్లీ రోహిత్‌కే సాధ్యమేమో!


మళ్లీ హిట్‌మ్యానే

రెండు జట్ల పోరులో రెండో అత్యధిక స్కోరు నమోదు చేసిందీ హిట్‌మ్యానే కావడం గమనార్హం. ఈ సారి వేదిక మొహాలి. 2017, డిసెంబర్‌ 13న మ్యాచ్‌ జరిగింది. 13 బౌండరీలు 12 సిక్సర్లతో 153 బంతుల్లోనే 208 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచులో టీమ్‌ఇండియా కెప్టెన్‌ కూడా అతడే కావడం ప్రత్యేకం. అతడి ధాటికి తట్టుకోలేక లంక ఏకంగా ఏడుగురు బౌలర్లను ప్రయోగించింది. నువాన్‌ ప్రదీప్‌, సురంగ లక్మల్‌, తిసారా పెరీరాలకు హిట్‌మ్యాన్‌ సినిమా చూపించాడు. ఇక్కడా రోహిత్‌ ఆలస్యంగానే జోరందుకున్నాడు. 65 బంతుల్లో 50 చేశాడు. 115 బంతుల్లో శతకం అందుకున్నాడు. మరోవైపు శ్రేయస్ అయ్యర్‌కు స్టాండింగ్‌ ఇస్తూనే .. 5 సిక్సర్లు, 1 బౌండరీ దంచి మరో 18 బంతుల్లోనే 150కు చేరుకున్నాడు. విధ్వంసం అలాగే కొనసాగిస్తూ 151 బంతుల్లో 200కు చేరుకొని ద్విశతకాలు చేయడంలో తనను మించిన మొనగాడు లేడని చాటాడు.


జయసూర్య మెరుపులు

అంతర్జాతీయ క్రికెట్లో సనత్‌ జయసూర్య విధ్వంసకర ఓపెనింగ్‌ గురించి తెలియని వారుండరు. ఈ రెండు జట్ల వన్డే పోరాటాల్లో మూడో అత్యధిక స్కోరు అతడిదే. షార్జా వేదికగా 2000, అక్టోబర్‌ 29న జరిగిన మ్యాచులో అతడు వీర విహారం చేశాడు. 161 బంతుల్లో 21 బౌండరీలు, 4 సిక్సర్ల సాయంతో 189 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్‌ చాలా విచిత్రంగా సాగింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా జయసూర్య మాత్రం స్వేచ్ఛగా ఆడాడు. కులవితరణ (15), మర్వాన్‌ ఆటపట్టు (9), జయవర్దనె (3), సంగక్కర (8) వరుసగా పెవిలియన్‌ చేరినా.. అతడు మాత్రం 118 బంతుల్లోనే శతకం చేసేశాడు. 143 బంతుల్లో 150కి చేరుకున్నాడు. వేగం పెంచిన అతడిని గంగూలీ 49వ ఓవర్లో పెవిలియన్‌ పంపించాడు. అయితే లంక నిర్దేశించిన 300 లక్ష్య ఛేదనలో టీమ్‌ఇండియా 54 పరుగులకే కుప్పకూలింది.


ధోనీలో ‘ఫినిషర్’ తెలిశాడు

టీమ్‌ఇండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనీలో ఒక గొప్ప మ్యాచ్‌ ఫినిషర్‌ దాగున్నాడని తెలిసింది శ్రీలంకతో వన్డేలోనే! 2005 ఏప్రిల్‌లో విశాఖలో పాక్‌పై 148 స్కోరు చేసిన మహీ.. అదే ఏడాది అక్టోబర్‌, 31న జైపుర్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు 183* అందుకున్నాడు. శ్రీలంక నిర్దేశించిన 299 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి 6 వికెట్ల తేడాతో విజయం అందించాడు. ఓపెనర్లు సెహ్వాగ్‌ (39), సచిన్‌ (2) విఫలమైన వేళ అతడు నిలిచాడు. బౌండరీల వరద పారించాడు. 145 బంతుల్లో 15 బౌండరీలు 10 సిక్సర్లతో చెలరేగాడు. ఆరంభం నుంచే అతడు దూకుడుగా ఆడాడు. 3 సిక్సర్లు, 4 బౌండరీలతో 40 బంతుల్లోనే 50 చేశాడు. ఆపై మరింత చెలరేగి 85 బంతుల్లోనే సెంచరీ అందుకున్నాడు. 36 ఓవర్లకే టీమ్‌ఇండియా 250 చేస్తే మహీ 151*తో ఉన్నాడు. చివరికి జట్టుకు అద్భుతమైన విజయం అందించాడు.


టాంటన్‌లో దాదా ధనాధన్‌

లంకేయులపై టీమ్‌ఇండియాలో అందరికన్నా ముందుగా 180+ స్కోరు చేసింది సౌరవ్‌ గంగూలీయే. 1999, మే 26న టాంటన్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌ మ్యాచులో దాదా తన కవర్‌డ్రైవ్‌లు, లాఫ్టెడ్‌ సిక్సర్ల సొగసును ప్రదర్శించాడు. మిస్టర్‌ డిపెండబుల్‌ రాహుల్‌ ద్రవిడ్‌ (145; 129 బంతుల్లో 17×4, 1×6)తో కలిసి శ్రీలంకకు చుక్కలు చూపించాడు. రెండో వికెట్‌కు 318 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ మ్యాచులో దాదా 158 బంతుల్లో 17 బౌండరీలు, 7 సిక్సర్ల సాయంతో 183 పరుగులు చేశాడు. 119 బంతుల్లో సెంచరీ కొట్టిన సౌరవ్‌ 5 బౌండరీలు, 4 సిక్సర్లు బాదేసి మరో 24 బంతుల్లోనే 150కి చేరువయ్యాడు. ఆపై మరింత రెచ్చిపోయి 183కు చేరుకున్నాడు. అయితే ఆఖరి ఓవర్‌ ఐదో బంతికి అతడిని విక్రమసింఘె పెవిలియన్‌ పంపించాడు.

-ఇంటర్నెట్‌ డెస్క్‌


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని