ఉత్కంఠ పోరులో భారత్‌ విజయం

తాజా వార్తలు

Published : 07/12/2020 01:08 IST

ఉత్కంఠ పోరులో భారత్‌ విజయం

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆస్ట్రేలియాపై టీమిండియా వరుస విజయాలతో బెబ్బులిలా చెలరేగుతోంది. సిడ్నీ వేదికగా ఉత్కంఠ భరితంగా సాగిన రెండో టీ20లో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి.. మరో మ్యాచ్‌ మిగిలుండగానే సిరీస్‌ కైవసం చేసుకుంది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లకు 194 పరుగులు చేసింది. మాథ్యూ వేడ్‌ (58; 32 బంతుల్లో, 10×4, 1×6) టాప్‌ స్కోరర్‌. అనంతరం బరిలోకి దిగిన భారత్‌ నాలుగు వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. శిఖర్‌ ధావన్‌ (52; 36 బంతుల్లో, 4×4, 2×6), హార్దిక్ పాండ్య (42*; 22 బంతుల్లో, 3×4 ,2×6), విరాట్ కోహ్లీ (40; 24 బంతుల్లో, 2×4, 2×6), కేఎల్‌ రాహుల్‌ (30; 22 బంతుల్లో, 2×4, 1×6) రాణించారు.

టీమిండియా భారీ లక్ష్యాన్ని ఎలాంటి తడబాటూ లేకుండా ఛేదించింది. తొలి రెండు ఓవర్లలో నిదానంగా ఆడిన ఓపెనర్లు రాహుల్‌, ధావన్‌ తర్వాత టాప్‌ గేర్‌లో చెలరేగారు. ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడుతూ బౌండరీల మోత మోగించారు. ఆరో ఓవర్‌లో రాహుల్‌ భారీ షాట్‌కు యత్నించి ఔటైనప్పటికీ పవర్‌ప్లేలో భారత్‌ 60 పరుగులతో మెరుగైన స్కోరు సాధించింది. అనంతరం క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీతో కలిసి ధావన్‌ ఇన్నింగ్స్‌ నడిపించాడు. కోహ్లీ నిలకడగా ఆడుతున్నా ధావన్‌ బౌండరీలు సాధిస్తూ రన్‌రేటును నియంత్రణలో ఉంచాడు. ఈ క్రమంలో 34 బంతుల్లో అర్ధశతకం అందుకున్నాడు. వెంటనే భారీ షాట్‌కు యత్నించి పెవిలియన్‌కు చేరాడు.

హార్దిక్ విధ్వంసం..

తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన సంజు శాంసన్‌ (15; 10 బంతుల్లో, 1×4, 1×6) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. మరోవైపు కోహ్లీ దూకుడు పెంచి లక్ష్యాన్ని కరిగించసాగాడు. ఆండ్రూ టై బౌలింగ్‌లో స్కూప్‌ షాట్‌తో అద్భుతంగా సిక్సర్‌ సాధించాడు. అయితే కోహ్లీని డేనియల్ సామ్స్‌ బోల్తా కొట్టించడంతో మ్యాచ్‌ ఉత్కంఠగా మారింది. క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ (12*) బ్యాటు ఝుళిపించడంతో భారత్‌ విజయ సమీకరణం ఆఖరి రెండు ఓవర్లలో 25 పరుగులుగా మారింది. అనంతరం హార్దిక్‌ విధ్వంసం సృష్టించాడు. భారీ సిక్సర్లు, ఫోర్లతో శివమెత్తాడు. ఆరు బంతుల్లో 14 పరుగులు అవసరమవ్వగా రెండు సిక్సర్లు బాది మరో రెండు బంతులు మిగిలుండగానే జట్టును గెలిపించాడు. ఆఖరి రెండు ఓవర్లు పాండ్యనే స్ట్రైకింగ్ చేశాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో జంపా, స్వెప్సన్‌, ఆండ్రూ టై, డేనియల్ తలో వికెట్‌ తీశారు.

రాణించిన వేడ్‌

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు శుభారంభం లభించింది. షార్ట్‌ (9)ను ఔటైనప్పటికీ వేడ్‌ దూకుడుగా ఆడటంతో ఆ జట్టు పవర్‌ప్లేలో 59 పరుగులు చేసింది. ఎడాపెడా బౌండరీలు బాదుతూ వేడ్‌ స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో 25 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. 8వ ఓవర్‌లో కోహ్లీ అతడిని రనౌట్ చేయడంతో స్కోరువేగానికి కాస్త బ్రేకులు పడ్డాయి. అనంతరం మాక్స్‌వెల్‌ (22; 13 బంతుల్లో, 2×6)తో కలిసి స్టీవ్‌ స్మిత్‌ (46; 38 బంతుల్లో, 3×4, 2×6) అడపాదడపా బౌండరీలు బాదడంతో ఆసీస్‌ 11 ఓవర్లకు 100 పరుగులు చేసింది. కాగా, భారత్‌ బౌలర్లు పుంజుకుని వికెట్లు తీస్తూ స్కోరును కట్టడిచేశారు. అయితే ఆఖర్లో హెన్రిక్స్‌ (26; 18 బంతుల్లో, 1×6), స్టాయినిస్ (16*, 7 బంతుల్లో, 1×6) బ్యాట్‌ ఝుళిపించారు. భారత బౌలర్లలో నటరాజన్‌ రెండు, శార్దూల్, చాహల్ చెరో వికెట్‌ సాధించారు.

ఇదీ చదవండి

బంతి బంతికి ఉత్కంఠ.. మ్యాచ్‌ సాగిందిలా!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని