close

తాజా వార్తలు

Updated : 08/04/2021 18:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మనోళ్లుంటే అదో కిక్కు..

ఏ ఐపీఎల్‌ జట్టులో భారత ఆటగాళ్లు ఎక్కువ?

ఐపీఎల్‌లో ఫేవరెట్‌ జట్టు ఏదంటే.. ఏం చెబుతాం? మన ఇండియా టీంలో ఇష్టమైన ప్లేయర్లు ఏ జట్టులో ఉంటే అదే అని చెబుతాం. ప్రపంచ స్థాయి ఆటగాళ్లు ఉన్న జట్టు గురించి తర్వాత ఆలోచిస్తాం. సరేగానీ.. అసలు ఇప్పుడు భారత జాతీయ జట్టుకు ఆడుతున్న ఆటగాళ్లు ఎక్కువ మంది ఏ ఐపీఎల్‌ జట్టులో ఉన్నారో తెలుసా?

నంబర్‌ వన్‌ ముంబయి.. 

సందేహం లేదు, ముంబయి ఇండియన్స్‌ని ఎక్కువ మంది ఇష్టపడటానికి కారణం.. ఆ జట్టులో ఏకంగా తొమ్మిది మంది భారత జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించినవారు ఉండటమే. కెప్టెన్‌ రోహిత్‌శర్మకి తోడు విధ్వంసక ఆల్‌రౌండర్‌ హార్ధిక్‌ పాండ్య,  అతడి సోదరుడు కృనాల్‌ ఉన్నారు. ఐపీఎల్‌ సునామీ సూర్యకుమార్‌ యాదవ్‌ మరోసారి మెరిసేందుకు సిద్ధం. పేసు గుర్రం జస్‌ప్రీత్‌ బుమ్రా అస్త్రాలు సిద్ధం. పాకెట్‌ డైనమైట్‌ ఇషాన్‌ కిషన్‌, ధవళ్‌ కులకర్ణి, రాహుల్‌ చహర్‌, జయంత్‌ యాదవ్‌ కూడా జట్టులో ఉన్నారు. ఇంతమంది ఉండటం వల్లే ముంబయి ఇండియన్స్‌ టీమ్‌ అన్నా, ఇండియన్‌ టీమ్‌ అన్నా ఒకేలా అనిపిస్తుంటుంది.  మొత్తంగా 17 మంది భారత ఆటగాళ్లు ఉన్నారు. అన్నట్టు.. సచిన్‌ తనయుడు అర్జున్‌ తెందూల్కర్‌ కూడా ముంబయి ఇండియన్స్‌ లోనే ఉన్నాడండోయ్‌.

దిల్లీ పిడుగులు..

పన్నెండో ఐపీఎల్‌ వరకు దిల్లీ లెక్క ఒకటి. కానీ గత ఐపీఎల్‌లో మాత్రం ఉరికే యువ రక్తంతో నిండిన దిల్లీ కాపిటల్స్‌ కప్ గెలవడం ఖాయం అనేంతలా పోరాడారు. ఈసారి కూడా అదే ఉరిమే ఉత్సాహంతో ముందుకొస్తున్నారు. ఈ  జట్టులో కూడా తొమ్మిది మంది జాతీయ జట్టుకు ఆడిన భారత ఆటగాళ్లు ఉన్నారు. దురదృష్టవశాత్తూ కెప్టెన్‌ అయ్యర్‌ గాయపడటంతో పంత్‌కు సారథ్యం అప్పగించారు. నిలకడగా స్ర్టయిక్‌ రొటేట్‌ చేస్తూ ఇన్నింగ్స్‌ నడిపే రహానే జట్టుకు వెన్నెముక. సచిన్‌నీ సెహ్వాగ్‌నీ కలిపినట్టు ఆడే పృథ్వీ షా ప్రమాదకారి. బౌండరీలతో హోరెత్తించే గబ్బర్‌ ఓ పట్టు పడతాడు.  బౌన్సీ స్వింగ్‌తో దడపుట్టించే ఇషాంత్‌, బ్యాట్స్‌మన్‌ ఆడే షాట్లను ముందే ఊహించే అశ్విన్‌.. కీలక ఆటగాళ్లు. ఇంకా ఉమేశ్‌, అక్షర్‌ పటేల్‌తో దిల్లీ కాపిటల్స్‌ ఆటగాళ్లు ఫ్లాగ్‌ లోగోలోని పులుల్లానే ఉన్నారు. ఏదైనా కొత్త జట్టుకు కప్‌ రావాలని కోరుకునేవారిలో ఎక్కువ శాతం దిల్లీ గెలుపును కోరుకోవడంలో ఆశ్చర్యం లేదు.

సన్‌రైజ్‌ స్పెషల్‌..

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు మొదటినుంచి బౌలింగ్‌ స్పెషల్‌కు మారుపేరు. ఈ మాటకి తగ్గట్టుగానే స్వింగ్‌ షో చేయడానికి డెత్‌ ఓవర్స్‌ ధీరుడు భువనేశ్వర్‌ కుమార్‌ ఉన్నాడు. అతడు ఒక్కడే కాదు.. అడిగినప్పుడల్లా యార్కర్‌ వేయడానికి నట్టూ ఉన్నాడు. అసలు ఒక ఓవర్‌లో ఆరు యార్కర్లు వేస్తే దానికి నట్టూ ఓవర్‌ అని పేరు పెట్టేంత కచ్చితత్వం అతనిది. ఇక వైవిధ్యంగా బంతులు సంధించే ఖలీల్‌ అహ్మద్‌ కూడా భరోసా ఇస్తాడు. సిద్ధార్థ్‌ కౌల్‌ అనుభవంతో పాటు విజయ్‌ శంకర్‌ కూడా బౌలింగ్‌ విభాగానికి అదనపు బలం. బ్యాటింగ్‌లో మాత్రం మనీశ్‌ పాండే, సాహా తప్ప ఇంకెవరూ లేరు. మొత్తంగా ఓ ఆరుగురు జాతీయ జట్టుకు ఆడేవారు సన్‌రైజర్స్‌లో ఉన్నారు.    

బెంగళూరులో బౌలర్లదే హవా!

ఛేదన రారాజు.. కెప్టెన్‌ కోహ్లీ పట్టుదల గురించి తెలిసిందే. ఎంతటి లక్ష్యమైనా అతని ముందు చిన్నబోతుంది. ఇక బౌలింగ్ విభాగంలో సిరాజ్‌, సైనీల పేస్‌ ద్వయం పదును చూపడానికి సిద్ధంగా ఉన్నారు. చాహల్‌ మణికట్టు మాయాజాలం ప్రదర్శిస్తే ప్రత్యర్థికి కష్టాలు తప్పవు. వీళ్లకు తోడు వాషింగ్‌టన్‌ సుందర్‌ ఆల్‌రౌండ్‌ సహకారం ఎలాగూ ఉంది. అయితే మొత్తంగా 13 మంది భారత ఆటగాళ్లు ఉన్నా.. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నవాళ్లు మాత్రం అయిదుగురే. 

కోల్‌కతా.. రాజస్థాన్‌.. పంజాబ్‌..

 

ఈ మూడు ఫ్రాంఛైజీల్లోనూ భారత జట్టుకు ఆడిన ఆటగాళ్లు తక్కువగానే ఉన్నారు. కోల్‌కతాలో కుల్‌దీప్‌, శుభ్‌మన్‌ గిల్, ప్రసిద్ధ్‌ కృష్ణ, కరుణ్‌ నాయర్, దినేశ్‌ కార్తీక్‌.. ఇటీవల జట్టులోకి ఎంపిక అయిన వరుణ్‌ చక్రవర్తిని చూడొచ్చు. రాయల్స్‌ జట్టులోనూ సంజు సాంసన్‌, శివమ్‌ దుబే, ఉనాద్కట్‌లతో పాటు రాహుల్‌ తెవాటియా ఆట ఆకర్షణ. పంజాబ్‌ కింగ్స్‌లో కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌, షమి మాత్రమే ఉన్నారు.

చెన్నై.. రెట్రో ఇండియా..

ధోనీ.. రిటైర్ అయినా అభిమానుల దృష్టిలో ఇంకా టీమిండియా ఆటగాడే. సిక్సర్లతో విరుచుకుపడే రైనా, రాయుడు, ఉతప్పలు ఇప్పుడు జాతీయ జట్టులో లేకపోయినా వాళ్లలో పస తగ్గనే లేదు. అయితే ప్రస్తుతం జాతీయ జట్టుకు ఆడేవాళ్లు మాత్రం నలుగురే ఉన్నారు. అద్భుత ఫీల్డింగ్‌తో ఆశ్చర్యపరిచే ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా, బౌలింగ్‌ ఆల్‌ రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌, దీపక్‌ చాహర్‌ బరిలో దిగవచ్చు. అంతే కాదు.. సరికొత్త బ్యాటింగ్‌ గేర్‌లో పుజారా ఆటను కూడా చూడొచ్చు.

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని