ఐపీఎల్‌ సూపరో ‘సూపర్‌’
close

తాజా వార్తలు

Updated : 05/04/2021 05:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఐపీఎల్‌ సూపరో ‘సూపర్‌’

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్) గత 13 సంవత్సరాలుగా ఇటు బీసీసీఐకి, అటు ఆటగాళ్లకు కాసుల వర్షం కురిపిస్తుంటే.. అభిమానులకు వినోదాల విందును పంచుతోంది.. సుమారు రెండు నెలలపాటు జరిగే ఈ మెగా ఈవెంట్‌లో ఎందరో దేశ, విదేశీ ఆటగాళ్లు పాలుపంచుకుంటారు. ఈ టోర్నీలో ఎన్నో మ్యాచ్‌లు చివరి బంతి వరకు ఫలితం తేలకుండా ఉత్కంఠభరితంగా సాగుతూ అభిమానులను ఊర్రూతలూగిస్తుంటాయి. కొన్ని సార్లు ఇరుజట్ల స్కోరు సమానమవుతుంది. అప్పుడే ఉంటుంది అసలు మాజా! ఎందుకంటారా రెండు జట్లు ‘సూపర్‌ ఓవర్‌’లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలి. ఈ సూపర్‌ ఓవర్‌లో బంతి బంతికీ ఇటు ఆటగాళ్లలోనూ, అటు అభిమానుల్లో ఉత్కంఠ తారస్థాయికి చేరుతుంది. అందుకే ఐపీఎల్‌లో సూపర్‌ ఓవర్లకు ఫుల్ క్రేజ్‌ ఉంది. ఇప్పటివరకూ ఈ మెగా లీగ్‌లో ఎన్నిసార్లు సూపర్‌ ఓవర్లు జరిగాయి. వాటిల్లో ఏ జట్టు గెలిచింది అనే వివరాలను తెలుసుకుందాం.

ఐపీఎల్‌ ఆరంభ సంవత్సరం(2008)లో ఒక్క సూపర్‌ ఓవర్‌ కూడా జరగలేదు. 2009లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్ల మధ్య మొదటి సూపర్‌ ఓవర్‌ జరిగింది. దీంట్లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా.. క్రిస్‌గేల్‌ మూడు ఫోర్లు కొట్టడంతో 15 పరుగులు చేసింది. ఛేదనకు దిగిన రాయల్స్.. యూసుఫ్ పఠాన్( 2×6, 1×4) మెరుపులు మెరిపించడంతో మొదటి నాలుగు బంతుల్లోనే విక్టరీ సాధించింది.

 

2010లో పంజాబ్ కింగ్స్(ఇంతకు ముందు కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌)‌‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్లు నిర్ణీత ఓవర్లలో 136 పరుగులు చేయడంతో సూపర్‌ ఓవర్‌ అనివార్యమైంది. సూపర్‌ ఓవర్‌లో చెన్నై 9 పరుగులే చేసింది. 10 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్‌.. నాలుగు బంతుల్లోనే ఛేదించింది.    

2011, 2012లో సూపర్‌ ఓవర్లు ఆడే పరిస్థితి రాలేదు. 2013లో రెండు సూపర్‌ ఓవర్లు జరిగాయి. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య జరిగిన సూపర్‌ ఓవర్‌లో హైదరాబాద్‌ 20 పరుగులు చేసింది. లక్ష్యఛేదనకు దిగిన బెంగళూరు 15 పరుగులే చేయడంతో సన్‌రైజర్స్‌ విజయం సాధించింది. బెంగళూరు, దిల్లీ జట్ల మధ్య జరిగిన మరో సూపర్‌ ఓవర్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు జట్టు.. డివిలియర్స్‌ రెండు భారీ సిక్సర్లు బాదడంతో 15 పరుగులు చేసింది. ఛేదనకు దిగిన దిల్లీ 10 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది.

2014లో కోల్‌కతా, రాజస్థాన్‌ మధ్య సూపర్‌ ఓవర్‌ జరిగింది. మొదట బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా రెండు వికెట్లు కోల్పోయి 11 పరుగులు చేసింది. రాజస్థాన్ రాయల్స్‌ వికెట్లేమీ కోల్పోకుండా 11 పరుగులు చేయడంతో విజయం సాధించింది.

2015లో రాజస్థాన్ రాయల్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ జట్ల మధ్య సూపర్‌ ఓవర్‌ ఆడే పరిస్థితి తలెత్తింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌.. షాన్‌ మార్ష్ వరుసగా మూడు ఫోర్లు కొట్టడంతో మొత్తం 15 పరుగులు చేసింది. రాజస్థాన్ రాయల్స్‌ మూడు బంతుల్లో 6 పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోవడంతో పంజాబ్‌ విజయం సాధించింది. 2016లో సూపర్‌ ఓవర్‌ జరగలేదు.

2017లో గుజరాత్‌ లయన్స్‌, ముంబయి ఇండియన్స్ మధ్య సూపర్‌ ఓవర్‌ జరిగింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబయి జట్టు 11 పరుగులు చేసింది. 12 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ లయన్స్‌..  బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేయడంతో 6 పరుగులకే తోకముడిచింది. దీంతో రోహిత్ సేన విక్టరీ సాధించింది. 2018లో సూపర్‌ ఓవర్‌ ఆడే పరిస్థితి రాలేదు.

2019లో దిల్లీ, కోల్‌కతా మధ్య జరిగిన మ్యాచ్‌లో సూపర్‌ ఓవర్‌ జరిగింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన దిల్లీ క్యాపిటల్స్‌ ఒక వికెట్ నష్టానికి 10 పరుగులు చేసింది. కోల్‌కతా వికెట్ కోల్పోయి 7 పరుగులు మాత్రమే చేయడంతో దిల్లీ విజయం సాధించింది. సూపర్‌ ఓవర్‌లో కాగిసో రబాడ వైవిధ్యమైన బంతులు వేసి దిల్లీ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇదే సీజన్‌లో జరిగిన మరో సూపర్‌ ఓవర్లో ముంబయి ఇండియన్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్లు తలపడగా తొలుత బ్యాటింగ్ సన్‌రైజర్స్‌ 8 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. కేవలం 3 బంతుల్లో లక్ష్యాన్ని ఛేదించి ముంబయి మెరిసింది.  

ఇక..ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధికంగా(4) సూపర్‌ ఓవర్లు 2020లో జరిగాయి. సూపర్‌ ఓవర్‌లో రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబయి ఇండియన్స్‌ తలపడగా.. ఏబీ మెరుపులు మెరిపించడంతో బెంగళూరు విజయం సాధించింది. దిల్లీ, పంజాబ్ మధ్య జరిగిన మరో సూపర్‌ ఓవర్లో దిల్లీ గెలిచింది. ఆ తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మధ్య సూపర్‌ సమరం జరిగింది. దీంట్లో కోల్‌కతా విజేతగా నిలిచింది. 

డబుల్‌..సూపర్‌..

ఇదే సీజన్‌లో ఐపీఎల్‌లో మునుపెన్నడూ లేనివిధంగా ఒకే మ్యాచ్‌లో రెండు సూపర్‌ ఓవర్లు జరిగాయి. పంజాబ్‌, ముంబయి జట్ల మధ్య ఈ ఆసక్తికరమైన మ్యాచ్‌ జరిగింది. తొలుత ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో సూపర్‌ ఓవర్‌ నిర్వహించారు. దీంట్లో కూడా ఫలితం తేలకపోడంతో మరో సూపర్‌ నిర్వహించారు. నరాలు తెగేంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ సూపర్‌ ఓవర్‌లో చివరకు పంజాబ్‌ విజయం సాధించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని