
తాజా వార్తలు
కాదంటే.. ఔననా పాండ్యా!
ఏడాది తర్వాత బౌలింగ్.. ఫిట్‌నెస్‌పై సందేహాలు
నా బౌలింగ్‌పై కసరత్తు చేస్తున్నాను. సరైన సమయంలోనే బంతి అందుకుంటా. నా బౌలింగ్ సామర్థ్యం 100% ఉండాలని భావిస్తున్నా. అంతర్జాతీయ స్థాయికి సరిపోయే వేగంతో బంతులు వేయాలన్నదే నా లక్ష్యం. మేం టీ20 ప్రపంచకప్ గురించి ఆలోచిస్తున్నాం. ఇతర టోర్నీలతో పోలిస్తే అక్కడ నా బౌలింగ్‌కు మరింత ప్రాముఖ్యం ఉంటుంది. - హార్దిక్ పాండ్య
పై మాటలను మరొక్కసారి గమనించండి. ‘సరైన సమయంలో బంతి అందుకుంటా.. బౌలింగ్ సామర్థ్యం 100% ఉండాల్సిందే’ అని ఆసీస్‌తో తొలి వన్డే తర్వాత బలంగా నొక్కి చెప్పిచెప్పినట్టు అర్థమవుతోంది కదా! పాండ్య ఇప్పటికీ బౌలింగ్ ఫిట్నెస్ సాధించలేదనే కదా దీనర్థం. అలాంటిది కంగారూలతో రెండో వన్డేలోనే అతడు బంతిని అందుకోవడం విమర్శలకు తావిస్తోంది. ఆటగాళ్ల పనిభారం, గాయాల విషయంలో జట్టు నిర్వహణ బాగాలేదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అసలు టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ అతడికి బంతి ఎందుకిచ్చినట్టు? అతడు ఎందుకు తీసుకున్నట్టు? అంటే పాండ్య పూర్తిగా మెరుగయ్యాడా? అతడి ఫిట్‌నెస్‌పై ఇక ఎలాంటి భారం పడనట్టేనా? ఇకపై పూర్తిగా బౌలింగ్ కోటా ఇవ్వొచ్చుగా? అని సోషల్‌మీడియాలో ప్రశ్నల వర్షం కురుస్తోంది.
ఏడాది తర్వాత హార్దిక్‌పాండ్య బౌలింగ్ చేయడం సంతోషమే. గతేడాది సెప్టెంబర్‌లో దక్షిణాఫ్రికాపై చివరగా అతడు బౌలింగ్ చేశాడు. కానీ బౌలింగ్ ఫిట్నెస్ సాధించలేదని ప్రకటన చేసిన రెండోరోజే అతడు బంతి అందుకోవడం అనుమానాలకు తావిస్తోంది. గతేడాది అతడు వెన్నెముకకు శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అప్పటి నుంచి బౌలింగ్‌కు దిగలేదు. ఐపీఎల్ 13వ సీజన్లోనూ ముంబయి అతడికి బంతి ఇవ్వలేదు. టీమ్ఇండియాకు అతడి అవసరమేంటో తెలుసు కాబట్టే రోహిత్ అతడిపై పనిభారం మోపలేదు. టీమ్ఇండియా నుంచీ అదే ఆశించారు. కానీ ఆసీస్‌తో రెండో మ్యాచులో పాండ్యకు బంతినివ్వక తప్పలేదని తెలుస్తోంది.
నిజానికి ఈ మ్యాచులో మయాంక్ అగర్వాల్‌తో కోహ్లీ ఒక ఓవర్ బౌలింగ్ చేయించాడు. మళ్లీ అతడికి బంతి ఇవ్వకుండా హార్దిక్‌తో వేయించాడు. అతడు 4 ఓవర్లలో 24 పరుగులే ఇచ్చి కీలకమైన స్మిత్‌ను పెవిలియన్ పంపించాడు. మరో క్యాచ్ చేజారింది. వాస్తవంగా పాండ్య తన మునుపటి వేగంతో బంతులు వేయలేదు. తన బౌలింగ్శైలిలో కొంత మార్పు చేసుకున్నాడు. తెలివిగా ఆఫ్‌సైడ్ క్రీజుకు దూరంగా బంతులేశాడు. స్లోడెలివరీలతో బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశాడు.
గత్యంతరం లేని పరిస్థితుల్లో పాండ్యకు విరాట్ బంతినిచ్చినప్పటికీ ఈ విషయంపై సీరియస్‌గానే చర్చ జరుగుతోంది. ఎందుకంటే వచ్చే ఏడాది భారత్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో టీమ్ఇండియాకు హార్దిక్ పాండ్య ఎంతో కీలకం. భారీ సిక్సర్లతో చెలరేగే ఈ యువ ఆల్‌రౌండర్‌కు ప్రాముఖ్యం ఉంది. అందుకే అతడు పూర్తి స్థాయిలో ఫిట్‌గా ఉంటేనే మేలు. మధ్యలో ఇలా తప్పడం లేదంటూ బంతి తీసుకొని పనిభారం పెంచుకుంటే అసలుకే మోసం రాగలదు. ఎందుకంటే ఆటగాడికి వెన్నెముక అత్యంత కీలకం. పూర్తి దేహదారుఢ్యం పెంచుకోకుండానే బౌలింగ్ చేస్తే అతడి వెన్నెముక గాయం తిరిగబట్టే ప్రమాదం లేకపోలేదు. ఈ నేపథ్యంలో జట్టులో ఆరో బౌలర్ అవసరం ఉంటే విజయ్‌శంకర్ లాంటి మీడియం పేసర్ ఆల్రౌండర్లను ప్రోత్సహిస్తే బాగుంటుందని విశ్లేషకులు అంటున్నారు.
-ఇంటర్నెట్ డెస్క్