close
Array ( ) 1

తాజా వార్తలు

‘మహేంద్రజాల’మే కోహ్లీసేనకు శ్రీరామ రక్ష!

ధోనీ ఉంటే గెలుపు.. లేదంటే రక్షించుకోలేదా???

ఆసక్తికరంగా గణాంకాలు

అంతర్జాతీయ క్రికెట్లో లక్ష్యాన్ని ఛేదించడం కన్నా కాపాడుకోవడం చాలా కష్టమని నానుడి. ఛేదించే జట్టుకు ఏ వేగంతో పరుగులు చేయాలో తెలుసు. దూకుడుగా ఆడటం, వికెట్లు కాపాడుకోవడంపై స్పష్టత ఉంటుంది. వాతావరణం అనుకూలిస్తుంది. మంచు ప్రభావం కలిసొస్తుంది. ఎటొచ్చీ తొలుత బ్యాటింగ్‌ చేసేవాళ్లకే కష్టాలన్నీ!? టీమ్‌ఇండియా చాన్నాళ్లుగా ఈ  ఇబ్బందే ఎదుర్కొంటోంది. ఆసక్తికరం ఏమిటంటే? తుది జట్టులో ధోనీ లేనప్పటి కన్నా ఉన్నప్పుడు సాధించిన విజయాలే ఎక్కువ. అంటే దీనర్థం ‘మహేంద్ర జాలం’ లేకుండా కోహ్లీసేన లక్ష్యాలను రక్షించుకోలేదనా???


తడబాటు గమనించారా?

ప్రపంచకప్‌ తర్వాత వన్డేల్లో టీమ్‌ఇండియా గెలుపోటముల తీరును పరిశీలించారా? ఛేదన కన్నా లక్ష్యాలను కాపాడుకోవడంలో తడబాటు ఎక్కువగా కనిపిస్తోందా? అవును, అది నిజమే. 2019 నుంచి కోహ్లీసేన ఆటతీరును విశ్లేషిస్తే ఇదే తేటతెల్లం అవుతోంది. మెగాటోర్నీ తర్వాత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ సైతం ఈ విషయాన్ని స్పష్టం చేశారు. తొలుత బ్యాటింగ్‌ చేసి లక్ష్యాలను కాపాడుకోవడంలో జట్టు పదేపదే విఫలం అవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మాజీ సారథిగా తన వద్ద కొన్ని సూచనలు ఉన్నాయన్నారు. వాటిని సారథి విరాట్‌ కోహ్లీ, కోచ్‌ రవిశాస్త్రితో పంచుకుంటానని వెల్లడించారు. స్థూలంగా ఇందుకు ఎన్నో అంశాలు దోహదం చేస్తున్నాయి. సూక్ష్మంగా పరిశీలిస్తే మాత్రం ఎంఎస్‌ ధోనీ మార్గనిర్దేశం లేకపోవడమే అసలు కారణమా అనిపించకమానదు!


సులువేం కాదు

ఆ..! ఏముందిలే అనిపిస్తుంది గానీ వాస్తవంగా తొలుత బ్యాటింగ్‌ చేయడం సులువు కాదు. అందుకే టాస్‌ గెలవగానే అన్ని జట్లు దాదాపు ఛేదనకే మొగ్గు చూపిస్తాయి. కొన్ని ప్రత్యేక సందర్భాలకు మినహాయింపు. సాధారణంగా తొలుత బ్యాటింగ్‌ చేసే జట్టుకు ప్రత్యర్థికి ఎంత లక్ష్యం నిర్దేశించాలన్న దానిపై స్పష్టత అవసరం. ఏ వేగంతో చేస్తే దాన్ని అందుకోగలం? అది సరిపోతుందా లేదా? దూకుడుగా ఆడాలా? నిలకడగా ముందుకెళ్లాలా? పిచ్‌ స్వభావం ఏంటి? గాల్లోని తేమ, పచ్చికపై తడి బంతిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? అవతలి బౌలర్లు వాటిని సద్వినియోగం చేసుకుంటే మరి దాడి చేయడం ఎలా? ఇలాంటి ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. టాప్‌ ఆర్డర్‌ కుప్పకూలితే మిడిలార్డర్‌పై తీవ్ర ఒత్తిడి పడుతుంది. దాంతో సహజంగానే పరుగుల వేగం మందగిస్తుంది. కీలక భాగస్వామ్యాలు నిర్మించడం అవసరం. అందుకే కెప్టెన్‌, కోచ్‌కు వీటిపై అవగాహన అత్యంత ముఖ్యం. అప్పుడే విజయాలు సొంతం అవుతాయి.


విజయాల శాతం బాగున్నా..?

ప్రపంచకప్‌ ముందు వరకు టీమ్‌ఇండియా పరిస్థితి బాగానే కనిపించింది. స్వల్ప లక్ష్యాలను సైతం కాపాడుకున్న సందర్భాలు ఉన్నాయి. కివీస్‌తో సెమీస్‌లో ఓటమి తర్వాత జట్టులో అత్యంత అనుభవజ్ఞుడు మహేంద్రసింగ్‌ ధోనీ అందుబాటులో లేకుండా పోయాడు. భవిష్యత్తుపై ఏమీ చెప్పకపోవడంతో అతడి కెరీర్‌పై సందిగ్ధం నెలకొంది. ఒకప్పటితో పోలిస్తే రెండేళ్లుగా మహీ పరుగుల వేగం మందగించింది. అతడికి చోటివ్వడంపై ప్రశ్నలు తలెత్తుతున్నా అతడి అనుభవం అత్యవసరం అనిపిస్తోంది. 2019 జనవరి నుంచి న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ వరకు టీమ్‌ఇండియా 34 (2019లో 28; 2020లో 6) వన్డేలు ఆడింది. ఇందులో 21 విజయాలు సాధించగా 12 ఓటములు చవిచూసింది. ఒక మ్యాచ్‌ రద్దైంది. విజయాల శాతం 61+. పైకి బాగానే కనిపిస్తోంది గానీ కూలంకషంగా విశ్లేషిస్తేనే అసలు విషయం బోధపడుతుంది. ధోనీ అనుభవం విలువ తెలుస్తోంది!


ధోనీ ఉంటేనే గెలుపు

2019, జనవరి నుంచి ప్రపంచకప్‌ సెమీస్‌ వరకు భారత్‌ 22 వన్డేలు ఆడగా 7 మ్యాచుల్లో ఓటమి పాలైంది. ఆసీస్‌ చేతిలో 4, న్యూజిలాండ్‌తో 2, ఇంగ్లాండ్‌తో 1 ఓడింది. మొత్తం 22లో కోహ్లీసేన 8 మ్యాచుల్లో తొలుత బ్యాటింగ్‌ చేసి అన్నింట్లో విజయాలు అందుకుంది. కివీస్‌పై 324, 252, ఆసీస్‌తో 250, 352, పాక్‌పై 336 (డ/లూ), అఫ్గాన్‌పై 224, విండీస్‌పై 268, బంగ్లాపై 314 పరుగుల్ని కాపాడుకుంది. ప్రతి మ్యాచులోనూ విరాట్‌కు తన సీనియర్‌ ధోనీ సలహాలు లభించాయి. మెగా టోర్నీ తర్వాత భారత్‌ 11 (రద్దైన మ్యాచ్‌తో 12) వన్డేల్లో తలపడగా 6 గెలిచి 5 ఓడింది. మొత్తం 7 మ్యాచుల్లో తొలుత బ్యాటింగ్‌ చేయగా 4 ఓడిపోవడం గమనార్హం. విండీస్‌పై 279, 387 లక్ష్యాలను కాపాడుకోగా 287ను 8 వికెట్ల తేడాతో కోల్పోయింది. ఆసీస్‌పై 255ను 10 వికెట్లతో చేజార్చుకొని 340ని 36 పరుగుల తేడాతో గెలిచింది. న్యూజిలాండ్‌తో 347ను 4 వికెట్లు, 296ను 5 వికెట్ల తేడాతో చేజార్చుకుంది. ఇందులో ఏ మ్యాచులోనూ మహీ లేడన్న సంగతి గమనించాలి.


అద్భుతమైన క్రికెట్‌ బుర్ర

స్టార్‌ పేసర్లు లేకున్నా దేశవాళీ యువ పేసర్‌ దీపక్‌ చాహర్‌ను ఉపయోగించుకొని చెన్నైకి ధోనీ మూడో ఐపీఎల్‌ ట్రోఫీ అందించాడు. మరి బుమ్రా, షమి, సైని ఉన్నా కోహ్లీ ఏం చేశాడు? న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో టీమ్‌ఇండియా వైట్‌వాష్‌ తర్వాత సోషల్‌ మీడియాలో వచ్చిన వ్యాఖ్యలు ఇవి. కాస్త కఠినంగా అనిపించినా నిజమే అనకుండా ఉండలేం. ఎవరు ఔనన్నా? కాదన్నా? గత పదేళ్ల కాలంలో మహీని మించిన అద్భుతమైన క్రికెట్‌ బుర్రను మనం చూసుండం. ఆటపై అతడి పరిజ్ఞానానికి అబ్బురపడని వారుండరు. పరిస్థితులు ఎలాగున్నా అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకొని తన అనుభవం, తెలివితేటలతో విజయం అందించగలడు. ప్రత్యర్థి బలహీనతలను సొమ్ము చేసుకోగలడు.


కోహ్లీకి రోహిత్‌ ముప్పు!

మహీ విశ్లేషణా సామర్థ్యానికి ఫిదా అవ్వకుండా ఉండలేం. మ్యాచ్‌ ఆడేముందు ఆకాశంలో మబ్బుల్ని బట్టి ఎంతసేపట్లో వర్షం వస్తుందో అంచనా వేయగల సామర్థ్యం అతడి సొంతం! చెన్నై, బెంగళూరు, కోల్‌కతా మైదానాల్లో ఆడినప్పుడు ఇలాంటి ఎన్నో కారకాలను అతడు పరిగణనలోకి తీసుకుంటాడు. పిచ్‌ను అద్భుతంగా అధ్యయనం చేస్తాడు. వాటిని అనుసరించే టాస్‌ గెలిస్తే ఏం చేయాలో నిర్ణయిస్తాడు. 16 ఏళ్లకు పైగా క్రికెట్‌ ఆడిన తన కెరీర్లో సాధించడానికి ఇంకా ఏం మిగల్లేదు. ఇది దిగ్గజాల మాట. రేపో యెల్లుండో అతడు వీడ్కోలు పలకక తప్పదు. కానీ మహీ అనుభవం టీమ్‌ఇండియాకు అవసరం. దానిని విరాట్‌ కోహ్లీ ఎంత త్వరగా అందిపుచ్చుకుంటాడన్నదే సందేహం. లేదంటే అద్భుతమైన నాయకత్వ లక్షణాలున్న రోహిత్‌ శర్మ రూపంలో అతడికి ముప్పు ఉందన్నది కాదనలేని సత్యం!!!

- ఇంటర్నెట్‌డెస్క్‌, హైదరాబాద్‌


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.