ఇషాన్‌ తుపాన్‌: 94 బంతుల్లో 173 బాదేశాడు

తాజా వార్తలు

Published : 20/02/2021 17:26 IST

ఇషాన్‌ తుపాన్‌: 94 బంతుల్లో 173 బాదేశాడు

దేశవాళీ వన్డే క్రికెట్లో ఝార్ఖండ్‌ అత్యధిక స్కోరు

ఇంటర్నెట్‌ డెస్క్‌: జాతీయ జట్టుకు ఎంపిక చేయడం లేదన్న కసిమీద ఉన్నాడో ఏమో! ఝార్ఖండ్‌ డైనమైట్‌ ఇషాన్‌ కిషన్‌ విజయ్‌ హజారే వన్డే టోర్నీ తొలిరోజు సంచలనం సృష్టించాడు. కేవలం 94 బంతుల్లోనే 173 పరుగులు బాదేశాడు. 184.04 స్ట్రైక్‌రేట్‌తో విజృంభించాడు. తన ఇన్నింగ్స్‌లో ఏకంగా 19 బౌండరీలు, 11 సిక్సర్లు బాదేశాడు. హోల్కర్‌ స్టేడియం ఈ విధ్వంసానికి వేదికగా మారింది.

విజయ్‌ హజారే ట్రోఫీలో భాగంగా ఇషాన్‌ నేతృత్వంలోని ఝార్ఖండ్‌ శనివారం మధ్యప్రదేశ్‌తో తలపడింది. ఓపెనర్‌గా దిగిన కిషన్‌ 42 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. 74 బంతుల్లో 100, 86 బంతుల్లో 150 కొట్టేశాడు. ద్విశతకానికి మరో 27 పరుగుల దూరంలో ఉండగా జట్టు స్కోరు 240 వద్ద ఔటయ్యాడు. అతడితో పాటు విరాట్‌ సింగ్‌ (68; 49 బంతుల్లో 5×4, 3×6), సుమిత్‌ కుమార్‌ (52; 58 బంతుల్లో 5×4), అనుకుల్‌ రాయ్‌ (72; 39 బంతుల్లో 3×4, 7×6) దంచికొట్టడంతో 50 ఓవర్లకు ఝార్ఖండ్‌ 422 పరుగులు చేసింది. విజయ్‌ హజారే చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం.

బౌలింగ్‌లోనూ వరుణ్‌ ఆరోన్‌ 6/37 విజృంభించడంతో మధ్యప్రదేశ్‌ కేవలం 18.4 ఓవర్లకు 98 పరుగులకే ఆలౌటైంది. అభిషేక్‌ భండారి (42), వెంకటేశ్‌ అయ్యర్‌ (23) టాప్‌ స్కోరర్లు. మిగతా అంతా ఒక అంకె స్కోరుకే పరిమితం అయ్యారు. ఐపీఎల్‌ 2020లో ముంబయి ఇండియన్స్‌ తరఫున ఆడిన ఇషాన్‌ కిషన్‌ మెరుపులు మెరిపించిన సంగతి తెలిసిందే. 516 పరుగులతో ఆ జట్టులో అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. ముంబయి ఐదోసారి ట్రోఫీ గెలవడంతో కీలక పాత్ర పోషించాడు. మరో రెండు నెలల్లో జరిగే సీజన్‌కు సన్నద్ధమవుతున్నాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని