ఒలీ రాబిన్‌సన్‌ను క్షమించాం: అండర్సన్‌ 
close

తాజా వార్తలు

Published : 09/06/2021 01:43 IST

ఒలీ రాబిన్‌సన్‌ను క్షమించాం: అండర్సన్‌ 

లండన్‌: ఇంగ్లాండ్‌ క్రికెట్‌ జట్టు ఒలీ రాబిన్‌సన్‌కు అండగా ఉందని, ఆటగాళ్లు అతడిని అర్థం చేసుకొని క్షమించారని సీనియర్‌ పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌ వెల్లడించాడు. అతడిని తాము అంగీకరిస్తున్నామని చెప్పాడు. 2012-13 కాలంలో యుక్తవయసులో ఉండగా రాబిన్‌సన్‌ ట్విటర్‌లో జాతి విద్వేష, లైంగిక సంబంధిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇంగ్లాండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డు తాజాగా నిషేధం విధించిన సంగతి తెలిసిందే. గతవారమే న్యూజిలాండ్‌తో తొలి అంతర్జాతీయ టెస్టు ఆడిన అతడు ఒక్క మ్యాచ్‌తోనే కెరీర్‌కు ముగింపు పలికాడు. ఈ నేపథ్యంలోనే సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో అండర్సన్‌ మాట్లాడుతూ ఇలా వ్యాఖ్యానించాడు.

రాబిన్‌సన్‌ను ఇంగ్లాండ్‌ టీమ్‌ క్షమించిందా లేక ఎవరైనా ఆటగాళ్లు ఇంకా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారా అని అండర్సన్‌ను మీడియా ప్రశ్నించగా.. అలాంటిదేం లేదని, అతడిని తామంతా క్షమించామని చెప్పాడు. ‘అతడు మా అందరి ముందూ నిలబడి బహిరంగ క్షమాపణలు చెప్పాడు. దాంతో అతడెంత నిజాయతీగా ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. అయితే, ఇప్పుడతడు చాలా బాధపడుతున్నాడు. పూర్తిగా మారిపోయాడని మేమంతా నమ్ముతున్నాం. అప్పటి నుంచి రాబిన్‌సన్‌ ఎంతో పరిణతి చెందాడు. ఇప్పుడతడికి జట్టు నుంచి పూర్తి మద్దతు దొరికింది’ అని సీనియర్‌ పేసర్‌ చెప్పుకొచ్చాడు.

కాగా, న్యూజిలాండ్‌తో తొలి టెస్టు అనంతరం మీడియాతో మాట్లాడిన రాబిన్‌సన్ తాను 18 ఏళ్ల కుర్రాడిగా ఉన్నప్పుడు అలా చేశానని చెప్పాడు. అప్పుడు తన బుర్ర సరిగా పనిచేయలేదని చెప్పాడు. ‘నేను అలాంటి చెడ్డవాడిని కాదు. నా వ్యాఖ్యలకు చింతిస్తున్నా. అలాంటి కామెంట్లు చేయడం పట్ల సిగ్గుపడుతున్నా. అప్పుడు నేను ఏం చేస్తున్నాననేదానిపై స్పష్టత లేదు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించాను. ఏదేమైనా అది క్షమించరానిది. అప్పటి నుంచి నేను ఎంతో పరిణతి చెందాను. అప్పుడు చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెబుతున్నా’ అని రాబిన్‌సన్‌ వాపోయాడు. అయితే, ఈ క్షమాపణలపై సంతృప్తి చెందని ఇంగ్లాండ్‌, వేల్స్‌ క్రికెట్ బోర్డు కివీస్‌తో తొలి టెస్టు పూర్తి అయిన వెంటనే అతడిని సస్పెండ్‌ చేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని