close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 28/05/2020 17:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

.. మరో 100 ఏళ్లైనా చెక్కు చెదరని క్రికెట్‌ రికార్డు!

ఒకే టెస్టు ఒకే రోజు రెండు ఇన్నింగ్స్‌ల్లో హ్యాట్రిక్‌ వికెట్లు

జిమ్మీ మాథ్యూస్‌ అత్యంత అరుదైన రికార్డు

ఆచితూచి ఆడేందుకు బ్యాట్స్‌మెన్‌కు ఎంతో సమయమున్న టెస్టు మ్యాచులో వికెట్లు తీయడం బౌలర్లకు సవాల్‌. వరుసగా రెండు వికెట్లు తీస్తేనే అబ్బా అంటాం. అదే హ్యాట్రిక్‌ వికెట్లు తీస్తే ఔరా అనేస్తాం. మరి ఒకే పోరులో ఒకే రోజు రెండు ఇన్నింగ్స్‌ల్లో హ్యాట్రిక్‌ వికెట్లు పడగొడితే ఏమనాలి? అతడికెంత ఘనత దక్కాలి? అలాంటి ఆటగాడు ఎన్ని మ్యాచులాడాలి?

ప్రపంచ క్రికెట్లో ఒకే మ్యాచులో ఒకే రోజు రెండు ఇన్నింగ్సుల్లో హ్యాట్రిక్‌ వికెట్లు పడగొట్టిన ఆ వీరుడే జిమ్మీ మాథ్యూస్‌. ఆస్ట్రేలియాకు చెందిన ఆటగాడు. 1912, మే28న ఇంగ్లాండ్‌లో జరిగిన ముక్కోణపు సిరీసులో దక్షిణాఫ్రికాపై ఈ ఘనత సాధించాడు. అంటే నేటికి సరిగ్గా 108 ఏళ్లన్నమాట. ఈ మధ్య కాలంలో చురకత్తుల్లాంటి బంతులు సంధించి మహా మహా బ్యాట్స్‌మెన్‌ను వణికించిన బౌలర్లెందరో ఉన్నారు. జిమ్మీ ఫీట్‌ను మాత్రం సమం చేయలేకపోయారు. ఇంతటి ఘనత సాధించినప్పటికీ అతడు ఆసీస్‌ తరఫున 8 టెస్టులే ఆడి 16 వికెట్లే తీయడం గమనార్హం.


ఆస్ట్రేలియా ఆధిపత్యం

ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచులో ఏకంగా ఏడుగురు ఆటగాళ్లు అరంగేట్రం చేయడం విశేషం. ఆసీస్‌ తరఫున ముగ్గురు, సఫారీల తరఫున నలుగురు తొలిసారి మైదానంలో అడుగుపెట్టారు. టాస్‌ గెలిచిన కంగారూ సారథి గ్రెగరీ బ్యాటింగ్‌ ఎంచుకొని క్లాడ్‌ జెన్నింగ్స్‌, ఛార్లెస్‌ కెల్లీవేను ఓపెనర్లుగా పంపించాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 62 పరుగులు చేశారు. జెన్నింగ్స్‌ను సిద్‌ పెగ్లర్‌ పెవిలియన్‌ పంపగా కెల్లీవే (114), వారెన్‌ బార్డ్‌స్లె (121) శతకాలు బాదేశారు. అయితే సఫారీ బౌలర్లు పెగ్లర్‌ (6/105), రెగ్గీ ష్వార్జ్‌ (3/142) వికెట్లు తీయడంతో 294/2తో పటిష్ఠంగా ఉన్న ఆసీస్‌ 448కి ఆలౌటైంది. ఇంకా సమయం ఉండటంతో దక్షిణాఫ్రికా 16/1 ఓవర్‌నైట్‌ స్కోరుతో తొలి రోజు ఆట ముగించింది.

జిమ్మీ.. తొలి హ్యాట్రిక్‌

ఆసీస్‌ బౌలర్లు బిల్‌ వైటీ (5/55), జిమ్మీ మాథ్యూస్‌ (3/16) విజృంభించడంతో తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 265 పరుగులకే కుప్పకూలింది. ఆర్బరీ ఫాల్క్‌నర్‌ (122) ఒంటరి పోరాటం చేశాడు. రెండో రోజు ఉదయాన్నే వైటీ చురకత్తుల్లాంటి బంతులకు విలవిల్లాడిన సఫారీలు 54/4తో బెంబేలెత్తారు. ఐతే గార్డన్‌ వైట్‌ సహకారంతో ఫాల్క్‌నర్‌ 89 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలో మరోసారి వైటీ వణికించాడు. గార్డన్‌ వైట్‌, కెప్టెన్‌ ఫ్రాంక్‌ మిచెల్‌ను పెవిలియన్‌ పంపించాడు. ష్వార్జ్‌ సైతం నిలవకపోడంతో సఫారీలు 200/7తో నిలిచారు.

వికెట్లు పడుతున్నప్పటికీ ఫాల్క్‌నర్‌ మాత్రం వెనుదిరగలేదు. అరంగేట్రం ఆటగాడు బ్యూమాంట్‌ (31)తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. శతకం బాదేశాడు. స్కోరును 265/7కు తీసుకెళ్లాడు. అప్పటి వరకు 11.3 ఓవర్లు వేసి 16 పరుగులిచ్చిన మాథ్యూస్‌ ఒక్కసారిగా మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఓ అద్భుత బంతితో బ్యూమాంట్‌ను క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. అప్పుడే క్రీజులోకి వచ్చిన పెల్గర్‌ను మాయ చేసి పెవిలియన్‌ పంపించాడు. ఆ తర్వాతి బ్యాట్స్‌మన్‌ వార్డ్‌ మైదానంలో వస్తున్నప్పుడు ఒకటే గుసగుసలు. జిమ్మీ హ్యాట్రిక్‌ తీస్తాడా అని? అనుకున్నదే జరిగింది. గింగిరాలు తిరిగే బంతితో వార్డ్‌ను అతడు వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో హ్యాట్రిక్‌ తీసిన ఏడో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.


ఔరా.. రెండో హ్యాట్రిక్‌ 

ఆస్ట్రేలియాకు 183 పరుగుల భారీ ఆధిక్యం లభించడంతో కెప్టెన్‌ గ్రెగరీ ప్రత్యర్థిని ఫాలోఆన్‌ ఆడించాడు. తొలి ఇన్నింగ్స్‌లో అజేయ శతకం బాదిన ఫాల్క్‌నర్‌కు హర్టిగన్‌ను తోడుగా ఓపెనింగ్‌కు పంపించాడు సఫారీ కెప్టెన్‌. కొత్త బంతిని గెరీ హజ్లిత్‌కు కాకుండా వైటీతో పాటు కెల్లీవేకు అందించాడు ఆసీస్‌ సారథి. ఈ వ్యూహం అద్భుతంగా పనిచేసింది. కేవలం 22 పరుగులకే దక్షిణాఫ్రికా ఓపెనర్లిద్దరినీ కెల్లీవే పెవిలియన్‌కు పంపించాడు. వైటీ సైతం రెండు వికెట్లు తీయడంతో సఫారీలు 43/4తో ఒత్తిడిలో పడిపోయారు. ఐదో స్థానంలో వచ్చిన అరంగేట్రం ఆటగాడు టేలర్‌ కాసేపు నిలిచాడు. దీంతో మ్యాచ్‌ను  రెండు రోజుల్లోనే ముగించాలని భావించిన ఆసీస్‌ కెప్టెన్‌ వైటీ బదులు జిమ్మీకి బంతి అందించాడు.

మరి కాసేపటికే 70 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన టేలర్‌, వైట్‌ జోడీని కెల్లీ విడదీశాడు. వైట్‌ను ఔట్‌ చేశాడు. ఆ తర్వాత ఓవర్లోనే జిమ్మీ మాథ్యూస్‌ తన బంతితో టేలర్‌ డిఫెన్స్‌ను ఛేదించాడు. ష్వార్జ్‌ క్రీజులోకి దిగాడు. సానుకూలంగా ఆడదామనుకున్న అతడు తికమక పడ్డాడు. బంతిని నేరుగా జిమ్మీకే క్యాచ్‌ ఇచ్చాడు. దాంతో దక్షిణాఫ్రికా 80/7తో నిలిచింది. మరోసారి మాథ్యూస్‌ హ్యాట్రిక్‌కు చేరువయ్యాడు. అవతలి ఎండ్‌లో మిచెల్‌ నిస్సహాయంగా చూస్తున్నాడు. మైదానమంతా నిశ్శబ్దంగా మారింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ జిమ్మీ హ్యాట్రిక్‌ తీస్తాడా? అని అందరిలోనూ ఉత్కంఠ కలిగింది. క్రీజులో ఉన్న వార్డ్‌ బౌలర్‌ను తీక్షణంగా చూస్తున్నాడు. అందరి కళ్లూ అతడిపైనే ఉన్నాయి. ఎందుకంటే అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో ఆఖరి బ్యాట్స్‌మన్‌ అతడే. తెలివిగా ఆలోచించిన జిమ్మీ బంతిని టాస్‌ చేశాడు. దానిని ఆడిన వార్డ్‌ నేరుగా పెవిలియన్‌ బాటపట్టాడు. ఎందుకంటే బౌలర్‌కే క్యాచ్‌ ఇచ్చాడు. మొత్తానికి ఆసీస్‌ ఇన్నింగ్స్‌ 88 పరుగుల తేడాతో విజయం సాధించింది.


జిమ్మీ మాథ్యూస్‌ సాధించిన ఈ ఘనతలో మరో విశేషం ఏంటంటే? తీసిన ఆరు వికెట్లలో ఇద్దరిని బౌల్డ్‌ చేశాడు. ఇద్దరి క్యాచ్‌లను అందుకున్నాడు. ఇద్దరిని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అంటే ఈ రెండు హ్యాట్రిక్కుల్లో ఏ ఫీల్డరుకూ భాగస్వామ్యం లేదన్నమాట. శతాబ్దం గడిచినప్పటికీ ఈ రికార్డును మరే బౌలర్‌ సమం చేయకపోవడం గమనార్హం.

-ఇంటర్నెట్‌డెస్క్‌


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.