
తాజా వార్తలు
అశ్విన్ ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ బౌలరవుతాడు!
ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్
ఇంటర్నెట్‌డెస్క్: సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టీమ్ఇండియా తరఫున ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ బౌలర్ అవుతాడని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. తాజాగా తన బ్లాగ్‌లో ఈ విషయాన్ని పేర్కొన్నాడు. టెస్టుల్లో తక్కువ మ్యాచ్‌ల్లో 400 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా రికార్డులకెక్కిన భారత స్పిన్నర్ అందుకోసం ఎంతో శ్రమించాడని పీటర్సన్ కొనియాడాడు.
‘అశ్విన్ చాలా తెలివైన ఆటగాడు. పరిస్థితులకు అనుగుణంగా ఎక్కడ ఎలా ఫలితాలు రాబట్టాలో అతడికి బాగా తెలుసు. ఇంటా, బయటా అతడి బౌలింగ్‌లో మంచి వైవిధ్యంతో పాటు కచ్చితమైన నియంత్రణ ఉంటుంది. రాబోయే కాలంలోనూ అతడి అమ్ములపొదిలో మరిన్ని అస్త్రాలున్నాయని నాకు తెలుసు. దాంతో టీమ్ఇండియా తరఫున ఆల్‌టైమ్ అత్యుత్తమ బౌలర్‌గా నిలుస్తాడని ఆశిస్తున్నా’ అని పీటర్సన్ వివరించాడు.
ఇక ఈ సిరీస్‌లో అద్భతంగా రాణిస్తున్న అశ్విన్ ఇప్పటివరకు 176 పరుగులు, 24 వికెట్లు సాధించి అందరినుంచీ ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ క్రమంలోనే పింక్‌బాల్ టెస్టులో జోఫ్రా ఆర్చర్‌ను పెవిలియన్ చేర్చి 77 టెస్టుల్లో 400 వికెట్లు సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. అంతకుముందు శ్రీలంక స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ 72 టెస్టుల్లోనే ఆ ఘనత సాధించాడు. ఈ నేపథ్యంలోనే ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో బౌలర్ల జాబితాలో మూడో స్థానం సంపాదించాడు. మరోవైపు ఫిబ్రవరి నెలకు సంబంధించి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా అశ్విన్ నామినేటయ్యాడు.