ఓపెనర్లుగా రోహిత్‌, రాహుల్‌!

తాజా వార్తలు

Published : 11/03/2021 01:36 IST

ఓపెనర్లుగా రోహిత్‌, రాహుల్‌!

ధావన్‌ రిజర్వు ఓపెనరన్న మాజీ సెలక్టర్‌ దేవాంగ్‌ గాంధీ

ఇంటర్నెట్‌ డెస్క్‌: బీసీసీఐ మాజీ సెలక్టర్‌ దేవాంగ్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌కు రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌ తొలిప్రాధాన్య ఓపెనర్లని పేర్కొన్నారు. టీ20 ప్రపంచకప్‌ దృష్ట్యా శిఖర్‌ ధావన్‌ను రిజర్వు ఓపెనర్‌గా ఎంపిక చేశారని అన్నారు. యువ క్రికెటర్‌ సూర్యకుమార్‌కు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని సూచించారు. ఇంగ్లాండ్‌తో పొట్టి క్రికెట్‌ సిరీస్‌కు ముందు ఆయన మాట్లాడారు.

ఇంగ్లాండ్‌లో జరిగిన 2019 వన్డే ప్రపంచకప్‌ నుంచి ధావన్‌కు గాయాల బెడద పట్టుకుంది. తరచూ అతడు గాయపడుతున్నాడు. మోకాలికి చికిత్స చేయించుకున్నాడు. బ్యాటింగ్‌లో మునుపటి దూకుడు తగ్గింది. ఆస్ట్రేలియా సిరీసులోనూ అతడు వేగంగా పరుగులు చేయలేకపోయాడు. విజయ్ హజారే వన్డే టోర్నీలోనూ నామమాత్రపు పరుగులతో సరిపెట్టుకున్నాడు. మరోవైపు రాహుల్‌ ఏ స్థానంలో బ్యాటింగ్‌కు పంపించినా విజయవంతం అవుతున్నాడు. ముఖ్యంగా ఐపీఎల్‌లో ఓపెనర్‌గా మెరుపులు మెరిపించాడు. ఆరెంజ్‌ క్యాప్‌ సొంతం చేసుకున్నాడు.

‘టీ20 ప్రపంచకప్‌ సమీపిస్తున్న వేళ కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌శర్మ టీమ్‌ఇండియా తొలి ప్రాధాన్య ఓపెనర్లు. శిఖర్‌ ధావన్‌ రిజర్వు ఓపెనర్‌గా ఉంటాడు. తనవంతు వచ్చేదాకా అతడు ఎదురు చూడక తప్పదు. బహుశా వన్డేల్లో అతడికి చోటు దక్కొచ్చు. అదీ టీ20 ప్రపంచకప్‌నకు అదనపు సన్నద్ధతగా భావిస్తేనే’ అని దేవాంగ్‌ గాంధీ అన్నారు. తొలిసారి టీమ్‌ఇండియాకు ఎంపికైన సూర్యకుమార్‌ యాదవ్‌ పైన ఆయన ప్రశంసలు కురిపించారు.

‘ముంబయి ఇండియన్స్‌ విజయవంతం అవ్వడంలో సూర్యకుమార్‌ కీలక పాత్ర పోషించాడు. ఒక ప్రత్యేకమైన స్థానంలో బ్యాటింగ్‌ చేస్తూ పరుగుల వరద పారించాడు. టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని ఆడిస్తే అతడికి ఎక్కువ అవకాశాలు ఇవ్వడం మంచిది. వన్డే సిరీసులోనూ అతడికి చోటివ్వాలి’ అని అని గాంధీ సూచించారు. టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ లైనప్‌లో సూర్యకు ఐదో స్థానం ఇవ్వాలన్నారు. రిషభ్ పంత్‌ను నాలుగో స్థానంలో పంపించాలని సలహా ఇచ్చారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని