ఓపెనర్‌ ఎవరో చెప్పేసిన కోహ్లీ

తాజా వార్తలు

Published : 12/03/2021 01:25 IST

ఓపెనర్‌ ఎవరో చెప్పేసిన కోహ్లీ

అహ్మదాబాద్‌: ఇంగ్లాండ్‌తో టీ20 సిరీసులో రోహిత్‌శర్మకు జోడీగా కేఎల్‌ రాహుల్‌ ఓపెనింగ్‌ చేస్తాడని టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ వెల్లడించాడు. శిఖర్ ధావన్‌ మూడో ఓపెనర్‌గా ఉంటాడన్నాడు. వాషింగ్టన్‌ సుందర్‌ బాగా ఆడుతున్నంత వరకు రవిచంద్రన్‌ అశ్విన్‌కు పరిమిత ఓవర్ల క్రికెట్‌ జట్టులో చోటు కష్టమేనని వెల్లడించాడు. తొలి టీ20కి ముందు విరాట్‌ మీడియాతో మాట్లాడాడు.

‘రోహిత్‌ జట్టులో ఉంటే కేఎల్‌ రాహుల్ అతడితో కలిసి‌ ఓపెనింగ్‌ చేస్తాడు. ఇది చిన్న విషయం. నిలకడగా పరుగులు చేస్తున్నంత వరకు వీరిద్దరే ఇన్నింగ్స్‌ ఆరంభిస్తారు. రోహిత్‌ విశ్రాంతి తీసుకుంటే, రాహుల్‌కు గాయమైతే శిఖర్‌ మూడో ఓపెనర్‌గా వస్తాడు. సాధారణ పరిస్థితుల్లో మాత్రం రోహిత్‌, రాహులే ఓపెనర్లు’ అని విరాట్‌ అన్నాడు.

గతేడాది ఐపీఎల్‌లో రవిచంద్రన్‌ అశ్విన్‌ బాగా ఆడాడు. ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. అతడికి తెలుపు బంతి క్రికెట్లో చోటు దక్కుతుందా అని ప్రశ్నించగా ‘వాషింగ్టన్‌ సుందర్‌ బాగా ఆడుతున్నాడు. అశ్విన్‌, సుందర్‌ ఆఫ్‌ స్పిన్‌ వేస్తారు. అందుకే చోటు మాత్రం ఒక్కరికే ఉంటుంది. సుందర్‌ పేలవ ఫామ్‌లో ఉండి, వికెట్లు తీయలేకపోతుంటే మరొకరికి అవకాశం దొరుకుతుంది’ అని కోహ్లీ బదులిచ్చాడు. ‘అడిగే ప్రశ్నలకు కాస్త తర్కమూ ఉండాలి. అశ్విన్‌ను ఎక్కడ తీసుకోవాలి? ఎక్కడ ఆడించాలో మీరే సూచించండి. సుందర్‌ ఇప్పటికే బాగా ఆడుతున్నాడు. ప్రశ్నలు అడగడం తేలికే. కానీ తర్కమూ అవసరమే కదా’ అని విరాట్‌ తెలిపాడు.

ఫిట్‌నెస్‌ ప్రమాణాలు అందుకోనంత వరకు ఆటగాళ్లకు జట్టులో చోటు దొరకదని కోహ్లీ స్పష్టం చేశాడు. వరుణ్‌ చక్రవర్తి గురించి అడగ్గా ఇలా జవాబిచ్చాడు. ఎన్‌సీఏలో నిర్వహించిన యోయో (17.1), 2 కి.మీ పరుగు (8 నిమిషాల్లో) పోటీల్లో వరుణ్‌ విఫలమైన సంగతి తెలిసిందే.

‘టీమ్‌ఇండియా కోసం సృష్టించుకున్న వ్యవస్థను అందరూ అర్థం చేసుకోవాలి. ఫిట్‌నెస్‌ పరంగా అత్యున్నత స్థాయిలో ఉండటం అవసరం. అలా పాటిస్తోంది కాబట్టే టీమ్‌ఇండియా అన్ని ఫార్మాట్లలో ఇప్పుడింత పటిష్ఠంగా ఉంది. జట్టులో చోటు కావాలంటే ప్రమాణాలను అందుకొనేందుకు ప్రయత్నించాలి. ఇందులో రాజీ లేదు’ అని విరాట్‌ స్పష్టం చేశాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని