
తాజా వార్తలు
కోహ్లీ ఆధునిక క్రికెట్ హీరో: స్టీవ్ వా
ముంబయి: టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ ఆధునిక క్రికెట్ హీరో అని ఆసీస్ క్రికెట్ దిగ్గజం స్టీవ్ వా ప్రశంసించాడు. ఏదీ అసాధ్యం కాదన్న భారత సరికొత్త వైఖరికి అతడు ప్రతినిధి అని పేర్కొన్నాడు. ప్రత్యర్థి జట్టు కవ్వింతలకు లొంగిపోకుండా ఎదురుదాడి చేసే అతడి వైఖరిని అభిమానులు ఎంతగానో ఇష్టపడతారని వెల్లడించాడు. ‘క్యాప్చరింగ్ క్రికెట్: స్టీవ్ వా ఇన్ ఇండియా’ అనే 60 నిమిషాల డాక్యుమెంటరీ ఆవిష్కరణ సందర్భంగా అతడు మాట్లాడాడు.
భారత ప్రజలు క్రికెట్‌ను ఆస్వాదించే విధానం చూస్తే తనకెప్పుడూ అద్భుతంగా అనిపిస్తోందని వా తెలిపాడు. ‘క్రికెట్‌ను కెమెరాలో బంధించడం నాకెంతో ప్రత్యేకం. ఎందుకంటే నాకిష్టమైన క్రికెట్, ఫొటోగ్రఫీ రెండూ ఇందులో ఉంటాయి. 1986లో తొలిసారి భారత పర్యటనకు వచ్చినప్పటి నుంచి ఇక్కడి ప్రజలు క్రికెట్‌ను వేడుక చేసుకోవడం చూస్తే అద్భుతంగా అనిపిస్తుంది’ అని అతడు పేర్కొన్నాడు. స్థానికంగా సందర్శించిన ప్రాంతాలు తనకు జీవితకాల జ్ఞాపకాలను అందించాయని వెల్లడించాడు.
‘ఈ మధ్యే నేను సందర్శించిన తాజ్ మహల్, చిన్నస్వామి స్టేడియం, మహారాజా లక్ష్మీ విలాస్ ప్యాలెస్, హెచ్పీసీ స్టేడియం, ఓవల్‌మైదాన్, దిల్లీ, కోల్‌కతాలోని కొన్ని ప్రాంతాలు ఎన్నెన్నో గాథలు, జీవితకాల జ్ఞాపకాలను అందించాయి. నా డాక్యుమెంటరీ చూసినప్పుడు నా ప్రయాణంలోని ప్రతి భావోద్వేగాన్ని భారత అభిమానులు గుర్తించగలరు’ అని స్టీవ్ వా అన్నాడు. ఈ డాక్యుమెంటరీకి హర్షభోగ్లే గొంతును అరువివ్వగా నెల్ మిన్చిన్ దర్శకత్వం వహించాడు. మిథిలా గుప్తా రచన చేశారు. సచిన్ తెందూల్కర్, రాహుల్ ద్రవిడ్, ఆడమ్ గిల్‌క్రిస్ట్, లీసా స్టేల్కర్ వంటి మాజీ క్రికెటర్ల ఇంటర్వ్యూలు ఇందులో ఉన్నాయి. బాల్యంలో ముంబయి మైదానాల్లో క్రికెట్ ఆడినప్పుడు ఎలా ఉండేదో సచిన్ వివరించాడు. భారత యువత శక్తిసామర్థ్యాలకు వ్యవస్థ ఎలాంటి తోడ్పాటు అందిస్తోందో ద్రవిడ్ వెల్లడించాడు.