
తాజా వార్తలు
మా సత్తాకు ఇదో పరీక్ష
క్రెఫెల్డ్ (జర్మనీ): ఒలింపిక్స్‌కు వ్యూహాత్మకంగా, శారీరకంగా, మానసికంగా ఎంత సన్నద్ధమయ్యామో తెలుసుకొనేందుకు నాణ్యమైన జర్మనీ, బ్రిటన్ జట్లతో ఆడటం ఒక పరీక్ష అని భారత హాకీ గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేశ్ అంటున్నాడు. కరోనా మహమ్మారి వల్ల ఏడాది కాలంగా అంతర్జాతీయ పోటీల్లో ఆడలేకపోయామని పేర్కొన్నాడు. ప్రపంచ నాలుగో ర్యాంకు టీమ్ఇండియా ఐరోపా పర్యటనలో భాగంగా ఆదివారం జర్మనీతో తలపడనుంది. మంగళవారం మరోసారి పోటీపడ్డాక బెల్జియంలోని యాంట్‌వెర్ప్‌కు వెళ్తుంది. అక్కడ మార్చి 6, 8న బ్రిటన్‌తో ఆడనుంది.
‘ఒలింపిక్స్‌కు సన్నద్ధమయ్యేందుకు జర్మనీ, బ్రిటన్‌తో మ్యాచులు అత్యంత కీలకమైనవి. వ్యూహాత్మకంగా, భౌతికంగా, మానసికంగా మమ్మల్ని మేం పరీక్షించుకొనేందుకు ఇదో సదవకాశం. కరోనా మహమ్మారి ఇంకా కొనసాగుతున్నా నాణ్యమైన జట్లతో ఆడుతుండటం మా అదృష్టం. ఈ సిరీసుల ఫలితాల ద్వారా మరికొన్ని నెలల్లో ఆరంభమవుతున్న ఒలింపిక్స్‌కు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాం. ఏడాది కాలంగా మ్యాచులు ఆడకపోవడం కష్టమైన విషయం. సాయ్‌లో మేం అంతర్గత మ్యాచులు ఆడినప్పటికీ ఐరోపా పర్యటన ద్వారా మా ప్రదర్శన స్థాయి ఏంటో తెలిసిపోతుంది’ అని శ్రీజేశ్ తెలిపాడు.
‘మేం జర్మనీ జట్టును కూలంకషంగా పరిశీలించాం. వారి ఆటతీరును విశ్లేషించాం. వారితో ఎలా తలపడాలో శిబిరంలో కొన్నాళ్లుగా సాధన చేస్తున్నాం. వాళ్లు మ్యాన్ టు మ్యాన్ పద్ధతిలో ఆడతారు. అందుకే వారిపై విజయం సాధించాలంటే మా జట్టు శైలిని కాస్త మార్చుకోవాలి. ఇన్నాళ్లూ శిబిరంలో వేసుకున్న ప్రణాళికలను కచ్చితత్వంలో అమలు చేయడంపైనే మేం దృష్టిపెట్టాం’ అని శ్రేజేశ్ వెల్లడించాడు.