
తాజా వార్తలు
ఇదేంటి మాక్సీ.. రాహుల్‌కు బాధేయదా ఏంటి!
క్రికెట్ ఒక సరదా క్రీడ! ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. గెలుస్తుందనుకున్న జట్టు ఓడిపోతుంది. ఇక ఓటమి ఖాయమే అనుకుంటే హఠాత్తుగా గెలిచేస్తుంది. ఆటగాళ్ల ప్రదర్శనా ఇదే రీతిలో ఉంటుంది. ఒక్కోసారి సిరీస్ మొత్తం ఆడినా పరుగులేమీ చేయరు. కొన్నిసార్లేమో ఒకట్రెండు మ్యాచుల్లోనే సిరీస్‌లో గుర్తుండిపోయే స్కోర్లు సాధించేస్తారు. ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు మాక్స్వెల్ బహుశా ఇదే ఒరవడి కొనసాగిస్తున్నాడేమో! ఎందుకంటే..
ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న వన్డే సిరీసులో గ్లెన్ మాక్స్వెల్ వీరోచిత ఫామ్ కనబరుస్తున్నాడు. క్రీజులో అడుగుపెట్టింది మొదలు ఎడాపెడా సిక్సర్లు, బౌండరీలు బాదేస్తున్నారు. క్షణాల్లో స్కోరు బోర్డు, లక్ష్యాలను మార్చేస్తున్నాడు. ఆకలిగొన్న పులిలా టీమ్ఇండియా బౌలర్లను వేటాడేస్తున్నాడు. సిడ్నీలో జరిగిన రెండు వన్డేలే ఇందుకు నిదర్శనం. అప్పటిదాకా టాప్ఆర్డర్ను ఔట్ చేయలేకపోతున్న బౌలర్లను అతడు మరింత బాధిస్తున్నాడు. తొలి మ్యాచులో 19 బంతుల్లోనే 45 పరుగులు సాధించాడు. 5 బౌండరీలు, 3 సిక్సర్లు దంచాడు. అంటే కేవలం 8 బంతుల్లోనే 38 పరుగులు చేసేశాడు. మిగిలినవి సింగిల్స్, డబుల్స్ రూపంలో వచ్చాయి. ఇక రెండో వన్డేలో మరింత కసిగా చెలరేగాడు. అజేయంగా నిలిచి 29 బంతుల్లోనే 63 పరుగులు సాధించాడు. 4 సిక్సర్లు, 4 బౌండరీలు బాదడం గమనార్హం. కేవలం 2 వన్డేల్లోనే 225 స్ట్రైక్‌రేట్, 108 సగటుతో 48 బంతుల్లోనే 108 పరుగులు చేశాడు.
విచిత్రంగా.. ఇదే మాక్సీ ఐపీఎల్ పదమూడో సీజన్లో ఘోర ప్రదర్శన చేశాడు. 13 మ్యాచుల్లో 15.42 సగటు, 101.88 స్ట్రైక్‌రేట్‌తో 108 పరుగులు చేశాడు. ఇందుకోసం 106 బంతుల్ని ఎదుర్కొన్నాడు. ఇక బౌండరీల విషయానికి వస్తే కనీసం మ్యాచుకు ఒక్కటి చొప్పునా బాదలేదు. మొత్తంగా 9 కొట్టాడు. ఇక సిక్సర్ల సంగతి సరేసరి. ఒక్కటంటే ఒక్కటీ బాదలేదు. అతడి 108 పరుగుల్లో ఫోర్ల ద్వారా 36 వస్తే మిగతావన్నీ సింగిల్స్, డబుల్సే. అందుకే అప్పుడు 13 మ్యాచుల్లో 108 ఇప్పుడు 2 మ్యాచుల్లో 108ని చూడగానే అందరికీ ఆశ్చర్యంగా అనిపిస్తోంది. మాక్సీ కనీసం రెండు మ్యాచుల్లోనైనా భారీ స్కోర్లు చేసుకుంటే పంజాబ్ ప్లేఆఫ్స్‌కు చేరుకొనేది కదా! అనుకుంటున్నారు. పాపం! ఆ జట్టు సారథి కేఎల్ రాహుల్ ఇప్పుడు టీమ్ఇండియా తరఫున కీపింగ్ చేస్తున్నాడు. ఎంత క్షమాపణ చెప్పినప్పటికీ అతడి కళ్ల ముందే మాక్స్వెల్ భారీ సిక్సర్లు ఆడేస్తుంటే రాహుల్‌కు మాత్రం మనసులో బాధేయదా ఏంటి!
-ఇంటర్నెట్ డెస్క్