MS Dhoni: తప్పుగా అర్థం చేసుకున్నారు!

తాజా వార్తలు

Published : 24/05/2021 15:02 IST

MS Dhoni: తప్పుగా అర్థం చేసుకున్నారు!

సీనియర్లను ఉద్దేశించే మహీ అన్నాడు: జగదీశన్‌

చెన్నై: గతేడాది ఎంఎస్‌ ధోనీ అన్న ‘కసి కనిపించలేదు’ మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని చెన్నై సూపర్‌కింగ్స్‌ యువ ఆటగాడు ఎన్‌.జగదీశన్‌ అన్నాడు. అవి యువ క్రికెటర్లను ఉద్దేశించినవి కావన్నాడు.  జట్టులోని అనుభవజ్ఞులు బాగా ఆడాలని మహీ పరోక్షంగా అన్నాడని తెలిపాడు. నిజానికి ఆ సీజన్లో రుతురాజ్‌, తాను బాగానే ఆడామని వెల్లడించాడు.

యూఏఈలో జరిగిన చివరి సీజన్లో చెన్నై సూపర్‌కింగ్స్‌ ఘోర ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. సురేశ్ రైనా దుబాయ్‌కు వచ్చాక వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నాడు. హర్భజన్‌ సింగ్‌ అక్కడికి రాలేదు. సీజన్‌కు ముందే రుతురాజ్‌, దీపక్‌ చాహర్‌ కరోనా బారిన పడ్డారు. సాధన చేసేందుకు వారికి తగిన సమయం దొరకలేదు. ధోనీ సహా మిగతా ఆటగాళ్లంతా పేలవంగా ఆడారు. ఓటములకు కారణం అడగ్గా.. ‘యువకుల్లో జ్వాల కనిపించలేదు’ అని మహీ అప్పుడు చెప్పాడు.

‘ధోనీ వ్యాఖ్యల్ని మీడియా తప్పుగా అర్థం చేసుకుంది. అవి యువకులను ఉద్దేశించినవి కావు. నిజానికి నేను, రుతు బాగా ఆడాం. ఏదేమైనా సీనియర్లు సహా అందరిలోనూ ఆత్మవిశ్వాసం పెంచేది మహీయే. జట్టులోని సీనియర్లు దిగ్గజాలు. వారిని వేలెత్తి చూపలేరు కదా! అనుభవజ్ఞులకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది. అందుకోసం ఏదైనా చేయాలి. అందుకే ధోనీ వ్యాఖ్యల తర్వాత జట్టు బాగా ఆడింది’ అని జగదీశన్‌ అన్నాడు. కాగా సీఎస్‌కేలో సాంకేతిక అంశాలపై ఎక్కువగా దృష్టి పెట్టరని, ప్రక్రియనే నమ్ముతారని అతడు వెల్లడించాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని