
తాజా వార్తలు
ఫించ్ నువ్విలా చెప్పడం మంచిది కాదు..
ఆసీస్ మాజీ సారథి మైఖెల్ క్లార్క్
ఇంటర్నెట్‌డెస్క్: ఐపీఎల్ 14వ సీజన్లో ఏ ఫ్రాంఛైజీ తనని కొనుగోలు చేయకపోవడం ఆశ్చర్యం కలిగించలేదని ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్ చేసిన వ్యాఖ్యలపై ఆ జట్టు మాజీ సారథి మైఖెల్ క్లార్క్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. టీ20ల్లో ఆస్ట్రేలియా కెప్టెన్‌గా ఉన్న అతడు ఇలా పేర్కొనడం సరికాదన్నాడు. గతేడాది ఐపీఎల్ 13వ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడిన ఫించ్ పూర్తిగా విఫలమయ్యాడు. తర్వాత బిగ్‌బాష్ లీగ్‌లోనూ తేలిపోయాడు. ఈ క్రమంలోనే గతవారం జరిగిన ఐపీఎల్ వేలంలో ఏ ఫ్రాంఛైజీ అతడిని కొనుగోలు చేయలేదు.
తాజాగా ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడిన ఫించ్.. ‘నిజం చెప్పాలంటే వేలం పాటలో నన్ను ఎవరూ కొనుగోలు చేయకపోవడం ఆశ్చర్యం కలిగించలేదు.ఎప్పుడైనా క్రికెట్ ఆడటానికే ఇష్టపడతా. అయితే.. ఇంట్లో కొంత సమయం గడపడం కూడా మంచిదే. ఆగస్టులో ఇంగ్లాండ్‌కు వెళ్లినప్పటి నుంచి తీరికలేకుండా ఆడుతున్నా. పలుమార్లు క్వారంటైన్, బయో బబుల్ లాంటి వాతావరణంలో గడిపా. కాబట్టి.. ఇప్పుడు ఇంట్లో సమయం గడిపితే పునరుత్తేజితం కావొచ్చు’ అని అభిప్రాయపడ్డాడు. అయితే, ఈ వ్యాఖ్యలపై క్లార్క్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
‘‘టీ20ల్లో నువ్వు ఆస్ట్రేలియా కెప్టెన్‌వి. ప్రతి ఫ్రాంఛైజీ నిన్ను తీసుకోవాలనే ఆలోచనతోనే ఉండాలి. కొన్నిసార్లు సరిగ్గా ఆడకపోయినా ఫర్వాలేదు. కానీ, నువ్వెంత గొప్ప ఆటగాడివనే విషయం తెలిస్తే.. నీ ఆలోచనా విధానంలో అలాంటి మార్పు వస్తుంది. ఒకవేళ బీబీఎల్‌లో సరిగ్గా ఆడకపోయినా.. తర్వాతి టోర్నీల్లో భారీ ఇన్నింగ్స్‌తో లెక్క సరిచేస్తా అని చెప్పాలి. కానీ, ఇలా నన్నెవరూ తీసుకోరని ముందే ఊహించానని చెప్పడం సరికాదు’’ అని క్లార్క్ పేర్కొన్నాడు.