close

తాజా వార్తలు

Updated : 21/01/2021 18:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

విశ్రమించను.. విజయం తలకెక్కించుకోను: సిరాజ్‌

మున్ముందు సిరీసుల్లో మరింత ఆత్మవిశాసంతో ఆడతా

హైదరాబాద్‌: తండ్రి మరణం మానసికంగా తననెంతో కలచివేసిందని టీమ్‌ఇండియా యువపేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ అన్నాడు. ఇంటికి రాగానే అమ్మ ఏడ్చిందని పేర్కొన్నాడు. ఆమెను ఓదార్చడం వింత అనుభూతిని ఇచ్చిందని వెల్లడించాడు. ఆస్ట్రేలియా పర్యటనలో అంతులేని ఆత్మవిశ్వాసం లభించిందని స్పష్టం చేశాడు. ఇకపై అన్ని సిరీసుల్లో మెరుగైన ప్రదర్శనలు చేసేందుకు ఆ ఆత్మవిశ్వాసం పనికొస్తుందన్నాడు. ఉదయం హైదరాబాద్‌కు చేరుకున్న సిరాజ్‌ సాయంత్రం మీడియాతో మాట్లాడాడు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చాడు. కాగా ఈ హైదరాబాదీ కుర్రాడికి పెళ్లి కుదిరిందని తెలిసింది. అయితే కాబోయే సతీమణి గురించి చెప్పేందుకు అతడు నిరాకరించాడు.ఇంటి భోజనం రుచిచూశా

నాన్న మరణవార్త విన్నాక విలపించానని సిరాజ్‌ చెప్పాడు. మిత్రులు, కుటుంబ సభ్యులు, టీమ్‌ఇండియా సహచరులు తనను ఓదార్చారని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాలో అనుభవించిన వేదన, సవాళ్లు తనలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేశాయని వెల్లడించాడు. నగరానికి వచ్చాక బిర్యానీ ఏం తినలేదని తెలిపాడు. చాన్నాళ్ల తర్వాత ఇంట్లో వండిన ఆహారం తినడంతో ఆనందం కలిగిందన్నాడు.


లబుషేన్‌ వికెట్‌ ప్రత్యేకం

ఆస్ట్రేలియాలో సాధించిన ప్రతి వికెట్‌ను తన తండ్రికి అంకితమిచ్చినట్టు సిరాజ్‌ తెలిపాడు. తాను తీసిన 13 వికెట్లలో మార్నస్‌ లబుషేన్‌ వికెట్ ‌ఎంతో ప్రత్యేకమన్నాడు. ఐదు వికెట్ల ఘనత అందుకోవడం సంతృప్తినిచ్చిందని పేర్కొన్నాడు. ఆఖరి టెస్టులో ప్రధాన పేసర్‌గా భావించలేదని జట్టు అవసరాల మేరకు ఆడాలనుకున్నానని వెల్లడించాడు. సవాళ్లంటే తనకిష్టమని, వాటిని ఎదుర్కోవడాన్ని ఆస్వాదిస్తానని తెలిపాడు. నిజానికి తనపై కాస్త ఒత్తిడి ఉన్నప్పటికీ బయటకు ప్రదర్శించలేదన్నాడు. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా బంతులు విసిరానని వెల్లడించాడు.


విశ్రాంతి లేదు

‘ప్రస్తుత ప్రదర్శననే మున్ముందు సిరీసుల్లో పునరావృతం చేయాలని అనుకుంటున్నా. ఐపీఎల్‌లో ఆడిన అనుభవం అక్కడ పనికొచ్చింది. లీగులో వార్నర్‌కు ఇన్‌స్వింగర్లు వేసేవాడిని. ఆసీస్‌లోనే అదే ప్రణాళిక అమలు చేశాను. ఈ విజయాన్ని తలకెక్కించుకోకుంటేనే మంచిది. విరాట్‌ కోహ్లీ, అజింక్య రహానె ఇద్దరూ మంచి సారథులే. వాషింగ్టన్‌ సుందర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, నవదీప్‌ సైని, నాకూ అజింక్య ఎన్నో సలహాలు ఇచ్చాడు. మాలో ఆత్మవిశ్వాసం నింపాడు. విజయం దక్కించుకోవాలంటే కఠినంగా శ్రమించాలి. సవాళ్లను అధిగమిస్తే విజయవంతం అవ్వగలం. మున్ముందు సిరీసులను తీవ్రంగా తీసుకుంటాను. విశ్రమించే సమస్యే లేదు’ అని సిరాజ్‌ తెలిపాడు.


అండగా విరాట్‌

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో విరాట్‌ భయ్యా ప్రోత్సాహాన్ని మరువలేనని సిరాజ్‌ అన్నాడు. తన ప్రదర్శన బాగాలేనప్పుడు అండగా నిలిచాడని తెలిపాడు. ఎక్కువ ఒత్తిడికి లోను కావొద్దని, ఆందోళన చెందకూడదని పేర్కొన్నాడు. డేల్‌ స్టెయిన్‌ ఎన్నో సలహాలు ఇచ్చాడన్నాడు. టీమ్‌ఇండియాలో జూనియర్‌, సీనియర్‌ అన్న భేదాలేమీ ఉండవన్నాడు. బుమ్రాతో కలిసి రెండు టెస్టులు ఆడినప్పుడు ఎంతో మద్దతుగా ఉన్నాడన్నాడు. బంతి బంతికీ సలహాలు ఇచ్చాడని పేర్కొన్నాడు. మహ్మద్‌ షమి, ఉమేశ్‌ యాదవ్‌ వచ్చినా జట్టు  యాజమాన్యం తనకు అప్పగించిన పాత్రను పోషిస్తానని వెల్లడించాడు.


ప్రతిభ కావాలి

హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం, క్రికెట్లో అవినీతి గురించి ప్రశ్నించగా ‘ఆటపై అభిమానం, తగినంత శ్రమిస్తే ఎవరికైనా అవకాశాలు వస్తాయి. క్రికెట్లో అవినీతి జరుగుతుంది అనడం అవాస్తవం. ప్రతిభ ఉంటే డబ్బులతో ఏం అవసరం? క్రికెట్లో డబ్బులు తీసుకుంటారన్నది నిజం కాదు’ అని  సిరాజ్‌ అన్నాడు. ఒకప్పుడు రంజీల్లో హనుమ విహారి తనకు సారథి అని ఏయే బ్యాట్స్‌మెన్‌కు ఎలాంటి బంతులు వేయాలో సలహాలు ఇచ్చేవాడని తెలిపాడు. తనకెంతో మద్దతుగా నిలిచేవాడని పేర్కొన్నాడు.
Tags :

స్పోర్ట్స్

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని