క్యాచ్‌ పట్టి తొడ కొట్టి..
close

తాజా వార్తలు

Updated : 09/04/2021 09:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

క్యాచ్‌ పట్టి తొడ కొట్టి..

ఒక్క క్యాచ్‌ మొత్తం మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేయగలదు. ఆ ఒక్క క్యాచే గెలుస్తుందనుకున్న జట్టును ఓడిపోయేలా చేయగలదు. ఓడిపోయే జట్టును గెలిపించగలదు. అందుకే క్యాచులే మ్యాచులకు బాస్‌లు! ముఖ్యంగా రసవత్తరంగా జరిగే టీ 20లు, ఐపీఎల్‌ మ్యాచుల్లో ఫీల్డర్లు పాదరసంలా కదిలితేగాని క్లిష్టమైన క్యాచులను ఒడిసిపట్టలేరు. మరీ ఐపీఎల్‌లో అత్యధిక క్యాచులను పట్టిన ఆటగాళ్లెవారో చూసేద్దాం రండి! 

రైనా..రయ్‌ రయ్‌

భారత క్రికెట్‌ చరిత్రలోనే కాకుండా ప్రపంచంలో ఉన్న గొప్ప ఫీల్డర్ల జాబితాను పరిశీలిస్తే సురేశ్‌ రైనా పేరు మొదటి వరుసలో ఉంటుంది. మెరుపు వేగంతో ముందుకు కదులుతూ బంతిని చేజిక్కించుకోవడంలో రైనా నేర్పరి. ఎన్నో మ్యాచుల్లో అబ్బురపరిచే ఫీల్డింగ్‌ చేసి అద్భుతమైన  క్యాచులను పట్టి మ్యాచులను మలుపుతిప్పాడు. ఐపీఎల్‌లో సుదీర్ఘకాలంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ఆడుతున్న రైనా.. ఇప్పటివరకు 102 క్యాచులను పట్టాడు. ఈ మెగాటీ20 లీగ్‌లో 100కు పైగా క్యాచులు పట్టిన ఏకైక ఆటగాడు రైనాయే.

బౌండరీ ‘బౌన్సర్‌’.. పొలార్డ్‌

గాల్లోకి లేచిన బంతి కీరన్‌ పొలార్డ్‌ వైపు వెళ్తుంటే ఆ బంతిని బాదిన బ్యాట్స్‌మన్‌ గుండె గుభేలుమంటుంది. ఎందుకంటే పొలార్డ్ చేతిలోకి బంతి వెళ్తే కిందపడటం చాలా అరుదు. పొడుగ్గా ఉండే ఈ ముంబయి ఇండియన్స్‌ ఆల్‌రౌండర్‌ ఎక్కువగా లాంగ్‌ ఆన్‌, లాంగ్‌ ఆఫ్‌లో ఫీల్డింగ్ చేస్తుంటాడు.  ఈ కరేబియన్‌ ఆటగాడికి బౌండరీ లైన్ దగ్గర క్యాచులు పట్టడం వెన్నతో పెట్టిన విద్య. ఎన్నో సార్లు బౌండరీల దగ్గర సిక్సర్‌ వెళ్లే బంతులను ఒంటిచేత్తో పట్టి అబ్బుపరిచాడు.  ఐపీఎల్‌లో పొలార్డ్‌ ఇప్పటివరకు 90 క్యాచులు పట్టాడు.

హిట్‌మ్యాన్‌.. ‘సర్కి‌ల్‌’ స్టార్

ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్  రోహిత్ శర్మ ఎక్కువగా సర్కిల్ లోపల, స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తుంటాడు. మంచి డైవ్‌లు చేస్తూ ఎన్నోసార్లు అద్భుతమైన క్యాచులను అందుకున్నాడు. క్రీజులో ఉన్న బ్యాట్స్‌మెన్ బలహీనతలను బట్టి ఫీల్డింగ్‌ పెట్టడం.. అందుకు తగ్గట్టుగా బౌలర్లతో బంతులు వేయించడంలో  హిట్‌మ్యాన్‌‌ దిట్ట. ఇతని సారథ్యంలోనే ముంబయి ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచి రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు  200 ఐపీఎల్‌ మ్యాచులాడిన రోహిత్‌ 89 క్యాచులను చేజిక్కించుకున్నాడు. 

ఏబీడీ..సూపర్‌ మ్యాన్‌

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉత్తమ ఫీల్డర్లలో దక్షిణఫ్రికాకు చెందిన ఏబీ డివిలియర్స్‌ ఒకడు. ఏబీడీ ఐపీఎల్‌లో చాలాకాలంగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తరఫున ఆడుతున్నాడు. చిరుతలా పరుగెత్తుతూ సూపర్‌ డైవ్‌లు చేస్తూ బంతిని అందుకోవడంలో అతడు మేటి. ఎన్నో కళ్లు చెదిరే క్యాచులను పట్టి అబ్బురపరిచాడు.  ఐపీఎల్‌లో ఇప్పటివరకు 124 మ్యాచుల్లో అతడు 83 క్యాచులు అందుకున్నాడు.

గబ్బర్‌ సింగ్‌.. క్యాచ్‌ పట్టి తొడ కొట్టి

టీమిండియా ‘గబ్బర్‌సింగ్‌’ శిఖర్‌ ధావన్‌.. క్యాచ్ పట్టిన ప్రతిసారి తొడ కొట్టి మీసం మెలేస్తూ అభిమానులను మరింత ఉత్సాహాపరుస్తాడు. ఐపీఎల్‌లో దిల్లీ డేర్‌డేవిల్స్‌, ముంబయి ఇండియన్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్లకు ఆడిన గబ్బర్‌సింగ్.. 2019 నుంచి దిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతున్నాడు. శిఖర్ ధావన్ ఇప్పటివరకు 178 మ్యాచుల్లో 76 క్యాచులను పట్టాడం గమనార్హం.

 విరాట్.. బుల్లెట్

ఐపీఎల్‌ ప్రారంభమైనప్పటి నుంచి రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకే ‘రన్ మెషిన్‌‌’ విరాట్‌ కోహ్లి 2013లో ఆ జట్టు నాయకత్వ బాధ్యతలను చేపట్టాడు. మైదానంలో దూకుడుగా ఉండే కోహ్లి.. మంచి ఫీల్డర్‌ కూడా. విరాట్‌ బుల్లెట్‌ వేగంతో దూసుకెళ్తూ కఠినమైన క్యాచులను సైతం అలవోకగా ఒడిసిపట్టి మ్యాచులను మలుపు తిప్పగలడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 192 మ్యాచులాడిన కోహ్లి 76 క్యాచ్‌లు అందుకున్నాడు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని