Dhoni: 13 ఏళ్ల అభిమాని కల నిజం చేసిన ధోనీ 

తాజా వార్తలు

Published : 05/07/2021 00:57 IST

Dhoni: 13 ఏళ్ల అభిమాని కల నిజం చేసిన ధోనీ 

సతీమణి సాక్షికి అరుదైన బహుమతి

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ తాజాగా ఓ అభిమాని కలను నిజం చేశాడు. 13 ఏళ్లుగా తనని కలవాలని చూస్తున్న అతడిని కలవడమే కాకుండా ఫొటోలు, ఆటోగ్రాఫ్‌ ఇచ్చి మరీ సంబరపడేలా చేశాడు. మహీ ప్రస్తుతం కుటుంబంతో సహా హిమాచల్‌ ప్రదేశ్‌లోని రత్నారి అనే ప్రాంతంలో విహారయాత్రకు వెళ్లాడన్న సంగతి తెలిసిందే. అక్కడ మీనాబాగ్‌ అనే హోటల్లో ప్రత్యేకంగా విడిది చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అక్కడ పనిచేస్తున్న హోటల్‌ సిబ్బందిని కలిసిన ధోనీ వారితో కాసేపు సంతోషంగా ముచ్చటించాడు. ఆ విషయాలను మీనాబాగ్‌ హోటల్‌ యాజమాన్యం ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా పంచుకుంది.

‘ధోనీకి దగ్గరుండి సపర్యలు చేసేందుకు దేవ్‌ అనే మా సిబ్బంది ఒకరు సిమ్లాలోని మీనాబాగ్‌ హోటల్స్‌ నుంచి రత్నారిలోని మీనాబాగ్‌కు కావాలనే ట్రాన్స్‌ఫర్‌ చేసుకున్నారు. 2008లో ధోనీ ఒకసారి క్రికెట్‌ టోర్నీలో భాగంగా హిమాచల్‌కు వచ్చినప్పుడు దేవ్‌ ఎలాగైనా కలవాలని ఎంతో ప్రయత్నించాడు. కానీ, చివరికి పోలీసులతో దెబ్బలు తిన్నాడు. ఇప్పుడు తనకిష్టమైన క్రికెటర్‌ను కలిసేందుకు సిమ్లా నుంచి ఇక్కడికి ఉద్యోగ మార్పు చేసుకున్నాడు. ధోనీని కలిశాక తన ఫోన్‌ కవర్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకోగా.. దాన్ని ఎప్పుడూ మార్చనని చెప్పాడు’ అని పేర్కొంది.

మరోవైపు ఆదివారం ధోనీ, సాక్షిల 11వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారిద్దరూ ఈ ప్రత్యేకమైన రోజును మరింత తీపిగుర్తుగా జరుపుకోవాలని అనుకున్నారు. ఈ క్రమంలోనే మహీ తన ప్రియమైన భార్యకు ఓ అరుదైన బహుమతి ఇచ్చాడు. సాక్షి దాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పంచుకోవడం గమనార్హం. ఇంతకీ ఆ బహుమతేంటో తెలుసా? ఆమెకెంతో ఇష్టమైన వింటేజ్‌ కారు. పాతకాలం నాటి అంబాసిడర్‌ కారును మహీ బహుకరించాడు. కాగా, చెన్నై సూపర్‌ కింగ్స్‌ టీమ్‌ ట్విటర్‌లో ఈ స్టార్‌ జంటకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు చెప్పింది. ‘మా రాజు, రాణికి సూపర్‌ హ్యాపీ యానివర్సరీ’ అని పేర్కొంటూ వారిద్దరు ఎక్కడో ప్రయాణిస్తున్న ఓ ఫొటోను అభిమానులతో పంచుకుంది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని