INDvsPAK: 2011 సెమీస్‌ సీక్రెట్‌ తెలుసా?

తాజా వార్తలు

Published : 03/07/2021 01:07 IST

INDvsPAK: 2011 సెమీస్‌ సీక్రెట్‌ తెలుసా?

ఇంటర్నెట్‌డెస్క్‌: 2011 వన్డే ప్రపంచకప్‌ను భారత జట్టు అభిమానులు అంత తేలిగ్గా మర్చిపోరు. మరీ ముఖ్యంగా మొహాలి వేదికగా పాకిస్థాన్‌తో తలపడిన సెమీ ఫైనల్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, నాటి మ్యాచ్‌లోని ఓ ఆసక్తికరమైన సంగతిని టీమ్‌ఇండియా ఛాంపియన్‌ మునాఫ్‌ పటేల్‌ తాజాగా అభిమానులతో పంచుకున్నాడు. ఆ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 260 పరుగులు చేయగా పాక్‌ చివరికి 231కే ఆలౌటై ఓటమిపాలైంది. దాంతో ధోనీసేన ఫైనల్‌కు దూసుకెళ్లి అక్కడ కప్పు సాధించింది.

కాగా, ఆ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేయగా శుభారంభం దక్కింది. 15 ఓవర్లకు ఒక వికెట్‌ మాత్రమే కోల్పోయి సుమారు 70 పరుగులతో మంచిస్థితిలో కొనసాగుతోంది. ఓపెనర్‌ కమ్రన్‌ అక్మల్‌(19) విఫలమయ్యాక మహ్మద్‌ హఫీజ్‌(43) నిలకడగా ఆడి భారత్‌పై ఒత్తిడి తెచ్చేప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే మునాఫ్‌పటేల్‌ వేసిన 15.3 ఓవర్‌కు అతడు వికెట్లవెనుక కీపర్‌ ధోనీ చేతికిచిక్కి పెవిలియన్‌ బాటపట్టాడు. అదే సమయంలో మునాఫ్‌ అతడి వైపు కోపంగా చూస్తూ ఏదో అన్నాడు. అయితే, ఆ ఫొటోను శుక్రవారం ట్విటర్‌లో పంచుకున్న టీమ్‌ఇండియా మాజీ పేసర్‌ ఈ సంఘటన ఎంత మందికి తెలుసంటూ అభిమానులను ప్రశ్నించాడు.

దానికి స్పందించిన ఓ అభిమాని గతంలో ఇదే విషయాన్ని మునాఫ్‌ను అడిగినట్లు చెప్పుకొచ్చాడు. ‘సర్‌.. మీకు గుర్తుందా ఆరోజు మీరు హఫీజ్‌ను ఔట్‌చేశాక ఏమన్నారో చెప్పమని ఇంతకుముందు మిమ్మల్ని అడిగాను. కానీ మీరు సమాధానం చెప్పలేదు’ అని రీట్వీట్‌ చేశాడు. ప్రతిస్పందించిన మునాఫ్‌ సరదాగా నవ్వుతూ ‘నాకు వికెట్‌ ఇచ్చినందుకు హఫీజ్‌కు థాంక్యూ చెప్పాను’ అంటూ సమాధానమిచ్చాడు. ఇక ఆ మ్యాచ్‌లో తొలుత సచిన్‌ తెందూల్కర్‌(85; 115 బంతుల్లో 11x4), సెహ్వాగ్‌(38; 25 బంతుల్లో 9x4) రాణించగా మధ్యలో సురేశ్‌ రైనా(36; 39 బంతుల్లో 3x4) విలువైన పరుగులు చేశాడు. ఛేదనలో పాక్‌ 100 పరుగుల తర్వాత వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. దాంతో 231 పరుగులకే పరిమితమై 29 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మిస్బాఉల్‌హక్‌(56; 76 బంతుల్లో 5x4, 1x6) చివరివరకూ పోరాడినా ఫలితం లేకుండా పోయింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని