close

తాజా వార్తలు

Published : 04/12/2020 16:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సరికొత్త ఫార్మాట్లో..ఐపీఎల్‌ 2021!

(చిత్రం: ఐపీఎల్‌ నుంచి)

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2021 సీజన్‌ సరికొత్త ఫార్మాట్లో జరగనుందని సమాచారం. పది జట్లను రెండు బృందాలుగా విభజించి లీగ్‌ దశలో మ్యాచులు నిర్వహిస్తారని తెలుస్తోంది. టోర్నీ నిడివి పెరగకుండా ఉండేందుకే ఇలా చేస్తున్నారని లీగ్‌ వర్గాలు అంటున్నాయి.

ప్రస్తుతం ఐపీఎల్‌లో ఎనిమిది జట్లు ఉన్నాయి. ప్రతి జట్టు మిగిలిన అన్ని జట్లతో రెండుసార్లు తలపడుతుంది. ఒకటి సొంత మైదానంలో మరొకటి ప్రత్యర్థి మైదానంలో ఆడుతుంది. అంటే మొత్తంగా 14 లీగు మ్యాచుల్లో పోటీపడుతుంది. ఎక్కువ మ్యాచులు గెలిచి టాప్‌-4లో నిలిచిన జట్లు ప్లేఆఫ్స్‌ ఆడతాయి.

నిజానికి ఐపీఎల్‌లో తొమ్మిదో జట్టు వస్తుందని అంతా అనుకున్నారు. కానీ బీసీసీఐ సాధారణ వార్షిక సమావేశం అజెండా రాగానే పదో జట్టు ఉంటుందని తెలిసింది. అదానీ, గోయెంకా గ్రూప్స్‌ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే సీజన్‌ 10 జట్లతో జరగడం ఖాయంగానే అనిపిస్తుంది. 2011లోనూ లీగులో 10 జట్లు తలపడ్డాయి. ఆ తర్వాత రెండేళ్లు 9 జట్లు ఆడాయి. వచ్చే సీజన్లో పది జట్లు ఉంటాయి కాబట్టి మళ్లీ 2011 మోడల్‌ను ప్రవేశపెట్టాలన్నది బీసీసీఐ ఉద్దేశంగా తెలుస్తోంది.

జట్లను రెండు బృందాలుగా చేసినప్పటికీ ఒక్కో జట్టు లీగు దశలో 14 మ్యాచులే ఆడుతుంది. అంటే ఒక్కో జట్టు తన బృందంలోని మరో జట్టుతో రెండు సార్లు తలపడుతుంది. అవతలి బృందంలోని జట్లతో ఒక్కో మ్యాచు ఆడుతుంది. మిగిలిన ఒక జట్టుతో రెండుసార్లు ఆడుతుంది. ఎక్కువ పాయింట్లు వచ్చిన నాలుగు జట్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి. జట్లను విడదీసేందుకు డ్రా తీస్తారు. పది జట్లు అవ్వడంతో బీసీసీఐ భారీ వేలం నిర్వహించక తప్పదు. అలా జరిగితే తమకు ఇష్టమైన ఆటగాళ్లు ఎక్కువ మంది ఉండరేమోనని ఇప్పుడున్న ఫ్రాంచైజీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన