
తాజా వార్తలు
హైదరాబాద్లో ఐపీఎల్ లేనట్లే
దిల్లీ: వేసవి వచ్చిందంటే స్టేడియానికి వెళ్లి ఐపీఎల్ మ్యాచ్లు ఆస్వాదించాలని కోరుకుంటారు క్రికెట్ అభిమానులు. గత ఏడాది కరోనా కారణంగా వాయిదా పడ్డ లీగ్.. చివరికి భారత్ నుంచి యూఏఈకి తరలిపోయింది. ఈ ఏడాది ఐపీఎల్ స్వదేశంలోనే జరగబోతోంది కానీ.. వేదికల్ని కుదించనున్న నేపథ్యంలో హైదరాబాద్ వాసులకు లీగ్ భాగ్యం లేనట్లే. ఈసారి ఐపీఎల్ మ్యాచ్లను ఆరు వేదికలకే పరిమితం చేయనున్నట్లు సమాచారం. వాటిలో ఉప్పల్ స్టేడియం లేదని తెలుస్తోంది. ప్రస్తుతానికి చెన్నై, కోల్కతా, అహ్మదాబాద్, బెంగళూరు, దిల్లీలను మాత్రమే వేదికలుగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే ముంబయిని మరో వేదికగా ఎంచుకుంటారు. ముంబయిలో మ్యాచ్లు వీలు కాని పక్షంలో హైదరాబాద్కు అవకాశం దక్కుతుందేమో చూడాలి. ప్రస్తుతానికైతే హైదరాబాద్, జైపూర్, మొహాలిలను పక్కన పెట్టారు. కరోనా ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గని నేపథ్యంలో వీలైనన్ని తక్కువ వేదికల్లో మ్యాచ్లు నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. గతంలో మాదిరి వేర్వేరు జట్లు వేర్వేరు వేదికల్లో తలపడటం కాకుండా.. జట్లన్నింటినీ ఒకే చోట ఉంచి వరుసగా ఒక స్టేడియంలో కొన్ని మ్యాచ్లు నిర్వహించి.. తర్వాత మరో వేదికకు అన్ని జట్లనూ తరలించి అక్కడ మ్యాచ్లు నిర్వహించేలా బోర్డు ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. ఇలా అయితేనే క్వారంటైన్ నిబంధనలు పాటించడానికి వీలుంటుంది. ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియంగా రూపుదిద్దుకున్న మొతేరాలో ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహిస్తే లీగ్కే కళ వస్తుందన్న ఉద్దేశంతో అహ్మదాబాద్ కేంద్రంగా ఏ ఫ్రాంఛైజీ లేకపోయినా దాన్ని ఒక వేదికగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.