close

తాజా వార్తలు

Published : 06/04/2021 10:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఒక్క పరుగు.. రెండు కప్పులు..

ఐపీఎల్‌లో పరుగు తేడాతో విజయాలివే..

ఆఖరి బంతికి సిక్సర్‌ కొడితే ఆ కిక్కే వేరప్పా! నరాలు బిగపట్టే ఉత్కంఠ నడుమ.. చావోరేవో అన్నట్టు సాగే హోరాహోరీ సమరంలో.. ఆఖరి బంతి వరకు పోరాడి.. పరుగు తేడాతో విజయం సాధిస్తే.. ఆ కిక్కు అంతకు  పదింతలు ఉంటుందప్పా! మరి అసలు సిసలు టీ20 మజానిచ్చే ఐపీఎల్‌లో ఎన్ని జట్లు ఎన్నిసార్లు పరుగు తేడాతో గెలిచాయో తెలుసా!!


మూడుసార్లు.. రెండు ఫైనళ్లు

ఐపీఎల్‌లో ‘ఐదు సార్లు’ విజేత ముంబయి మూడుసార్లు పరుగు తేడాతో విజయం అందుకుంది. అందులో రెండు ఫైనల్‌ మ్యాచులే అవ్వడం ప్రత్యేకం. 2012లో పుణె వారియర్స్‌పై తొలుత బ్యాటింగ్‌ చేసి 120/9కి పరిమితమైంది ముంబయి. ఛేదనలో ఆఖరి ఓవర్లో పుణె 12 పరుగులు చేయాల్సి ఉండగా మునాఫ్‌ పటేల్‌‌ 10 పరుగులే ఇవ్వడంతో ఊపిరిపీల్చుకుంది.

2017లో హైదరాబాద్‌ వేదికగా రైజింగ్‌ పుణె, ముంబయి ఫైనల్లో తలపడ్డాయి. కఠినమైన పిచ్‌పై రోహిత్‌ సేన 129/8 పరుగులే చేసింది. అయితే మిచెల్‌ జాన్సన్‌ (26/3), బుమ్రా (26/2) ఛేదనలో పుణెను దెబ్బకొట్టారు. ఆఖరి ఓవర్లో 13 పరుగుల్ని కాపాడాల్సి ఉండగా మనోజ్‌ తివారీ, అర్ధశతకం చేసిన స్మిత్‌ను జాన్సన్‌‌ వరుస బంతుల్లో పెవిలియన్‌ పంపాడు. ఆఖరి బంతికి సుచిత్‌ రనౌట్‌ అవ్వడంతో ముంబయి విజేతగా అవతరించింది.

2019లోనూ ముంబయిది అదే పరిస్థితి. హైదరాబాద్‌ వేదికగా చెన్నై సూపర్‌కింగ్స్‌తో ఫైనల్‌. రోహిత్‌ సేన 149/8 పరుగులే చేసింది. స్వల్ప ఛేదనకు దిగిన ధోనీసేనను బుమ్రా (2/14), రాహుల్‌ చాహర్‌ (14/1) భారీ దెబ్బకొట్టారు. 148/7కు పరిమితం చేశారు. వాట్సన్స్‌ (80; 59 బంతుల్లో 8×4, 4×6) మెరుపుల్ని వృథా చేశారు. చెన్నై 12 బంతుల్లో 18 చేయాల్సి ఉండగా.. 19వ  ఓవర్లో బుమ్రా 9 పరుగులిచ్చి డ్వేన్‌ బ్రావోను ఔట్‌ చేశాడు. చివరి 6 బంతుల్లో 13 పరుగులు అవసరం కాగా 4వ బంతికి వాట్సన్‌ రనౌట్‌ అయ్యాడు. ఆఖరి బంతికి శార్దూల్‌ ఠాకూర్‌ ఔటవ్వడంతో ముంబయి నాలుగోసారి విజేతగా అవతరించింది.


పంజాబ్‌కు రెండుసార్లు..

పరుగు తేడాతో గెలిచిన అనుభవం పంజాబ్‌కు రెండుసార్లు ఉంది. 2008లో ముంబయిపై తొలుత 189/4 పరుగులు చేసింది. షాన్‌ మార్ష్‌ (81), పామెర్‌బాష్‌ (79) దంచికొట్టారు. ఛేదనలో సచిన్‌ (65) సైతం చెలరేగి ఆడాడు కానీ అతడికి మరెవ్వరి నుంచీ మద్దతు దొరకలేదు. ఆఖరి ఓవర్లో 19 పరుగులు చేయాల్సి ఉండగా విక్రమ్‌ సింగ్‌ 2, 4, 6 బంతులకు వికెట్లు తీసి ముంబయిని 188కి ఆలౌట్‌ చేశాడు.

ఆ తర్వాతి ఏడాదే దక్కన్‌ ఛార్జర్స్‌తో పంజాబ్‌కు మళ్లీ ఇదే పరిస్థితి ఎదురైంది. తొలుత పంజాబ్‌ 134/7 చేసింది. ఛేదనకు దిగిన దక్కన్‌ను యువీ (3/13), రమేశ్‌ పొవార్‌ (2/11), ఇర్ఫాన్‌ పఠాన్‌ (2/28) ఉక్కిరిబిక్కిరి చేశారు. ఆఖరి ఓవర్లో ఆ జట్టుకు 11 పరుగులు అవసరం కాగా మూడో బంతికి రోహిత్‌శర్మ (42), ఐదో బంతికి ఆర్పీసింగ్‌ (0)ను ఇర్ఫాన్‌ ఔట్‌ చేసి విజయం  అందించాడు.


బెంగళూరుకూ తప్పలేదు

పంజాబ్‌, చెన్నైపై ఒక్కోసారి ఒక్క పరుగు తేడాతో విజయ దుందుభి మోగించింది బెంగళూరు. 2016లో రాహుల్‌ (42), ఏబీడీ (64) దూకుడుతో కోహ్లీసేన 175/6 పరుగులు చేసింది. ఛేదనలో మురళీ విజయ్‌ (89), స్టాయినిస్‌ (34*) మెరుపులతో పంజాబ్‌ 174/4 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో విజయానికి 17 పరుగులు చేయాల్సి ఉండగా జోర్డాన్‌ 15 మాత్రమే ఇచ్చాడు.

2019లో చిన్నస్వామి వేదికగా జరిగిన మ్యాచులో మొదట బెంగళూరు 161/7 చేసింది. పార్థివ్‌ పటేల్‌ (53; 37 బంతుల్లో) ఆకట్టుకున్నాడు. ఛేదనలో ఎంఎస్‌ ధోనీ (84*; 48 బంతుల్లో) మెరుపు సిక్సర్లు బాదేయడంతో చెన్నై దాదాపుగా గెలిచినంత పని చేసింది. ఉమేశ్‌ వేసిన ఆఖరి ఓవర్లో 26 పరుగులు అవసరం కాగా.. మహీ 4, 6, 2, 6తో రెచ్చిపోయాడు. ఇక ఆఖరి బంతికి 2 పరుగులు చేయాల్సి ఉండగా శార్దూల్‌ రనౌట్‌ కావడంతో బెంగళూరు గెలిచింది.


మూడు జట్లు ఒక్కోసారి

2012లో దిల్లీ, రాజస్థాన్‌ హోరాహోరీగా తలపడ్డాయి. వీరేంద్ర సెహ్వాగ్‌ (63) మెరుపులతో మొదట దిల్లీ 152/6 పరుగులు చేసింది. ఛేదనలో రాహుల్‌ ద్రవిడ్‌ (40), అజింక్య రహానె (84*; 63 బంతుల్లో) రెచ్చిపోవడంతో రాజస్థాన్‌ లక్ష్యాన్ని సమీపించింది. ఆఖరి ఓవర్లో రాజస్థాన్‌కు 12 పరుగులు కావాలి. ఉమేశ్‌ యాదవ్‌ బంతి అందుకున్నాడు. తొలి 3 బంతుల్లో 2 పరుగులే ఇచ్చాడు. నాలుగో బంతిని రహానె సిక్సర్‌గా మలవడంతో ఉత్కంఠ పెరిగింది. తర్వాతి బంతికి 2, ఆఖరి బంతికి ఓవైసి‌ షా (1) రనౌట్‌ కావడంతో గెలుపు దక్కలేదు. దిల్లీ పరుగు తేడాతో గెలిచింది.

2016లో గుజరాత్, దిల్లీ నువ్వానేనా అన్నట్టు తలపడ్డాయి. డ్వేన్‌ స్మిత్‌ (53), మెక్‌కలమ్‌ (60) చెలరేగడంతో మొదట గుజరాత్‌ 6 వికెట్లకు 172 పరుగులు చేసింది. ఛేదనలో డుమిని (48), క్రిస్‌ మోరిస్‌ (82*; 32 బంతుల్లో) సిక్సర్లతో చెలరేగడంతో దిల్లీ లక్ష్యాన్ని సమీపించింది. వారిని ఓడించేందుకు గుజరాత్‌ సారథి రైనా తనతో సహా 8 మంది బౌలర్లను ప్రయోగించాడు. ఆఖరి ఓవర్లో దిల్లీకి 14 పరుగులు అవసరం. తొలి బంతిని మోరిస్ ‌బౌండరీగా మలిచాడు. కానీ బ్రావో నెమ్మది బంతులతో తర్వాత సింగిల్స్‌, డబుల్స్‌ మాత్రమే ఇచ్చాడు. పవన్‌ నేగి భారీ షాట్లు బాదలేకపోయాడు. 12 పరుగులే రావడంతో గుజరాత్‌ పరుగుతో గట్టెక్కింది.

2015లో చెన్నైకి ఒక్క పరుగు విజయం లభించింది. దిల్లీతో మ్యాచులో మొదట ధోనీసేన 7 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ఛేదనలో ఆల్బీ మోర్కెల్‌ (73; 55 బంతుల్లో) విజృంభించాడు. కానీ పట్టుబిగించిన ధోనీసేన మరెవ్వరినీ బ్యాటింగ్‌ చేయనివ్వలేదు. ఆశీష్‌ నెహ్రా (25/3), డ్వేన్‌ బ్రావో (2/36) సమయోచితంగా వికెట్లు తీశారు. ఇక ఆఖరి ఓవర్‌ నాటకీయంగా సాగింది. 19 పరుగులకు బ్రావో 17 ఇచ్చి ఒక వికెట్‌ తీశాడు. మోర్కెల్‌ రెండు బౌండరీలు, ఒక సిక్సర్‌ బాదినా ఫలితం 149/9కి పరిమితమైంది.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని