
తాజా వార్తలు
ఆర్సీబీ నిర్ణయంపై పార్థివ్ పటేల్ జోక్..
ఇంటర్నెట్‌డెస్క్: ఐపీఎల్ 2021 కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) తనని తొలగించడంపై టీమ్ఇండియా మాజీ బ్యాట్స్‌మన్ పార్థివ్ పటేల్ సరదాగా స్పందించాడు. ఏప్రిల్, మేలో నిర్వహించే టీ20 లీగ్ 14వ సీజన్లో ఎవరెవరిని అట్టిపెట్టుకోవాలో, ఎవరెవరిని వదిలించుకోవాలో ఇప్పటికే ఆయా ఫ్రాంఛైజీలు ఒక నిర్ణయానికి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే బుధవారం అన్ని జట్లూ తమకు కావాలసిన, అవసరం లేని ఆటగాళ్ల జాబితాలను విడుదల చేశాయి. అందరిలాగే ఆర్సీబీ తమ జాబితాను ప్రకటించగా అందులో మొత్తం 10 మంది పేర్లు ఉన్నాయి.
అయితే, ఆ వదిలించుకున్న వారి జాబితాలో సీనియర్ బ్యాట్స్‌మన్ పార్థివ్‌పటేల్ పేరు కూడా ఉంది. అతడు గత డిసెంబర్లోనే అన్ని ఫార్మాట్ల ఆటకు వీడ్కోలు పలికాడు. దీంతో తాను రిటైర్ అయ్యాక ఆర్సీబీ తగిన విధంగా సత్కరించింది అని పేర్కొంటూ కొంటెగా ట్వీట్ చేస్తూ ఆ జట్టుకు ధన్యవాదాలు తెలిపాడు. ఈ విషయం పక్కనపెడితే, పార్థివ్ మాటల్లో కాస్తంత బాధ కూడా ఉందని అనిపిస్తోంది. ఎందుకంటే మూడేళ్ల క్రితం ఈ జట్టులో చేరిన అతడు ఇటీవల యూఏఈలో జరిగిన 13వ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. 2018-19 సీజన్లలో 6, 14 మ్యాచ్‌లాడి 153, 373 పరుగులు చేశాడు. కానీ, గత సీజన్లో ఆర్సీబీ పార్థివ్‌కు అవకాశమే ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఆ జట్టుపై పరోక్ష వ్యాఖ్యలు చేశాడని అభిమానులు భావిస్తున్నారు.
ఇవీ చదవండి..
ఇంకా నయం.. వారినీ తీసేస్తారనుకున్నా: గంభీర్
రిషభ్ పంత్ కాదు.. స్పైడర్ పంత్: ఐసీసీ