
తాజా వార్తలు
మేం వస్తున్నాం.. టీమిండియా కాస్త జాగ్రత్త!
ఇంటర్నెట్‌డెస్క్: ఎన్నో ప్రతికూలతల మధ్య ఆస్ట్రేలియాపై అద్వితీయ విజయం సాధించిన భారత్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ధైర్యంగా పోరాడిన యువ ఆటగాళ్లను కొనియాడుతున్నారు. అయితే ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ టీమిండియాకు అభినందలు చెబుతూనే హెచ్చరిస్తున్నాడు. మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న ఇంగ్లాండ్ సిరీస్‌ను ఉద్దేశిస్తూ.. కోహ్లీసేనకు త్వరలో అసలైన సవాలు ఎదురుకానుందని ట్వీట్ చేశాడు. అయితే ఈ ట్వీట్ హిందీలో చేయడం విశేషం.
‘‘చారిత్రక గెలుపుపై భారత్ గొప్పగా సంబరాలు చేసుకుంటోంది. ఎందుకుంటే ఎన్నో ప్రతికూలతల నడుమ ఈ విజయం దక్కింది. కానీ కొన్ని వారాల్లో అసలైన జట్టుతో టీమిండియా ఆడాల్సి ఉంది. మీ సొంతగడ్డపై మా జట్టుని ఓడించాలి. కాస్త జాగ్రత్త! ఈ రెండు వారాలు ఎక్కువగా సంబరాలు చేసుకోకండి’’ అని పీటర్సన్ ట్వీట్ చేశాడు. భారత పర్యటనలో ఇంగ్లాండ్ నాలుగు టెస్టులు, అయిదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. కాగా, చెన్నై వేదికగా ఫిబ్రవరి 5 నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది.
అయితే ఈ ట్వీట్‌పై నెటిజన్లు భారీగా స్పందిస్తున్నారు. కొందరు పీటర్సన్ సవాల్‌ను స్వాగతించగా, మరికొందరు ఆస్ట్రేలియాకు ఎదురైన పరాభవం ఇంగ్లాండ్‌కు తప్పదని కామెంట్లు చేస్తున్నారు. ఆసీస్ మాజీలు కూడా భారత్‌ను తక్కువగా అంచనా వేసి విమర్శలపాలయ్యారని, త్వరలో ఇంగ్లాండ్ మాజీలకు అదే పరిస్థితి ఎదురుకానుందని ట్రోల్ చేస్తున్నారు.
ఇదీ చదవండి
భారత్-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్
గబ్బా హీరోస్.. సూపర్ మీమ్స్