WTC Final: ఇది మా రెండేళ్ల కష్టానికి ఫలితం..
close

తాజా వార్తలు

Published : 16/06/2021 01:20 IST

WTC Final: ఇది మా రెండేళ్ల కష్టానికి ఫలితం..

కివీస్‌తో తుదిపోరుపై చెతేశ్వర్‌ పుజారా..

సౌథాంప్టన్‌: మరో రెండు రోజుల్లో న్యూజిలాండ్‌తో జరిగే టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ తమకు ఇతర ఫార్మాట్లలో జరిగే ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌తో సమానమని టీమ్‌ఇండియా టెస్టు స్పెషలిస్టు చెతేశ్వర్‌ పుజారా అన్నాడు. తుదిపోరుకు ముందు వర్చువల్‌ మీడియా సమావేశంలో పాల్గొన్న అతడు టీమ్‌ఇండియాపై, ఆ ఛాంపియన్‌షిప్‌ టోర్నీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇదో పెద్ద మ్యాచ్‌ అని, అయినా తాను ఇతర సాధారణ మ్యాచ్‌ల్లాగే చూస్తానని చెప్పాడు. టెస్టు క్రికెట్‌ కొనసాగడానికి ఇలాంటి టోర్నీలే ఉపయోగపడతాయన్నాడు.

‘కచ్చితంగా టెస్టు క్రికెట్‌ మనుగడ సాగాలని ఆశిస్తున్నా. ఈ టెస్టు ఛాంపియన్‌షిప్‌ తప్పకుండా అందుకు సహకరిస్తుంది. ఫైనల్లో మేం విజయం సాధిస్తే భారత్‌లో మరింత మంది యువకులు టెస్టు క్రికెట్‌ ఆడాలని అనుకుంటారు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఈ ఫార్మాట్‌కు మంచి ఆదరణ దొరకాలని కోరుకుంటున్నా. అందుకు ఈ టెస్టు ఛాంపియన్‌షిప్‌ టోర్నీనే సరైన మార్గం. ఇక కివీస్‌తో ఫైనల్లో తలపడటం వ్యక్తిగతంగా నాకు చాలా గొప్ప విశేషం. ఎందుకంటే నేను కేవలం టెస్టులు మాత్రమే ఆడతాను. మరోవైపు మేం కూడా తొలిసారి ఈ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో ఆడబోతున్నాం. ఈ స్థాయికి చేరడానికి రెండేళ్లుగా ఎంతో శ్రమించాం. అందుకోసం ఇంటా బయటా అనేక సిరీస్‌లు గెలవాల్సి వచ్చింది. టాప్‌లో నిలవడానికి బాగా కష్టపడ్డాం. ఇది మాకు ఇతర ఫార్మాట్లలో జరిగే ప్రపంచకప్‌ ఫైనల్‌ లాంటిది. ఈ మ్యాచ్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’ అని పుజారా చెప్పుకొచ్చాడు.

ఇక క్వారంటైన్‌ తర్వాత తిరిగి ప్రాక్టీస్‌ చేయడంపై స్పందించిన టెస్టు స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌.. ఇది తమకు తిరిగి లయ అందుకోవడం లాంటిదని చెప్పాడు. అందుకోసం బ్యాట్స్‌మెన్‌, బౌలర్లు బాగా కష్టపడ్డారని చెప్పాడు. మూడు వారాలు క్వారంటైన్‌లో ఉన్న తర్వాత సాధన చేస్తున్నామని పేర్కొన్నాడు. అలాగే జట్టు రెండు బృందాలుగా విడిపోయి ఆడిన ప్రాక్టీస్‌ మ్యాచ్‌ల్లోనూ ఆటగాళ్లు తీవ్రంగా సాధన చేసినట్లు వివరించాడు. అప్పుడు బ్యాట్స్‌మెన్‌ ప్రధానంగా స్వింగయ్యే బంతుల్ని వదిలేయడంపై దృష్టిసారించారని చెప్పాడు. అలాగే అనువైన బంతుల్ని షాట్లుగా మలిచామని తెలిపాడు. తుదిపోరు ఎలా జరగనుందనే అంచనాతో ప్రాక్టీస్‌ చేశామని, అదే జట్టుకు ముఖ్యమని పుజారా స్పష్టం చేశాడు. చివరగా పేస్‌ బౌలర్లపై స్పందించిన అతడు.. వారివల్లే టీమ్‌ఇండియా ఫైనల్‌కు చేరిందన్నాడు. బుమ్రా, షమి, ఇషాంత్‌, ఉమేశ్‌, సిరాజ్‌ లాంటి బౌలర్లు కొంతకాలంగా టెస్టుల్లో 20 వికెట్లు తీస్తున్నారని, దాంతోనే జట్టుకు విజయాలు అందిస్తున్నారని మెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే ఫైనల్లో న్యూజిలాండ్‌తో ఆడేందుకు సిద్ధంగా ఉన్నారన్నాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని