యాష్‌తో మినీ సమరం..పుజారా భారీ వికెట్‌

తాజా వార్తలు

Published : 05/02/2021 02:02 IST

యాష్‌తో మినీ సమరం..పుజారా భారీ వికెట్‌

అరంగేట్రం గర్వించే సందర్భమన్న ఇంగ్లాండ్‌ సారథి

చెన్నై: జూనియర్‌ స్థాయి క్రికెట్‌ ఆడుతున్నప్పటి నుంచే స్పిన్‌ను చక్కగా ఎదుర్కొనేవాడినని ఇంగ్లాండ్‌ సారథి జో రూట్‌ అన్నాడు. కచ్చితత్వంతో స్వీప్‌ షాట్‌ ఆడటం అక్కడే నేర్చుకున్నానని వివరించాడు. టీమ్‌ఇండియాతో సిరీసులో చెతేశ్వర్‌ పుజారా అత్యంత కీలకమవుతాడని పేర్కొన్నాడు. అద్భుతంగా ఆడే విరాట్‌ కోహ్లీ, కేన్‌ విలియమ్సన్‌, స్టీవ్‌ స్మిత్‌ నుంచి నేర్చుకొనేందుకు మొహమాటపడనని వెల్లడించాడు. నాగ్‌పుర్‌లో భారత్‌పై టెస్టుల్లో అరంగేట్రం చేయడం తన కెరీర్లోనే అత్యంత గర్వించే సందర్భమని వెల్లడించాడు. వందో టెస్టుకు ముందు అతడు మీడియాతో మాట్లాడాడు.


అశ్విన్‌తో యుద్ధం

బాల్యంలో నేను బక్కపల్చగా ఉండేవాడిని. దేహదారుఢ్యం పెంచుకొనేందుకు చాలా సమయమే పట్టింది. బంతిలో వేగం ఉండదు కాబట్టి స్పిన్నర్ల బౌలింగ్‌లో ఆడేందుకు నేనో దారి కనుక్కోవాలని అనుకున్నా. స్వీప్‌తో ఎక్కువ బలం సృష్టించొచ్చని తెలుసుకున్నా. కొంతమంది అద్భుత ఆటగాళ్లు, కోచ్‌ల వద్ద మెలకువలు నేర్చుకున్నా. కేవలం డిఫెండ్‌ చేసేందుకో, ఆధిపత్యం వహించేందుకో ప్రయత్నించను. బంతిని బట్టి ఆడతాను. క్రీజులో కాసేపుంటే ఎక్కువ పరుగులు చేస్తాను. సొంతగడ్డపై అశ్విన్‌కు మంచి రికార్డుంది. అయితే నేనతడి బౌలింగ్‌లో ఆడాను. భారీ పరుగులూ చేశాను. కొన్నిసార్లు అతడూ నాపై ఆధిపత్యం చెలాయించాడు. టెస్టు మ్యాచులో మా ఇద్దరి మధ్య చిన్న యుద్ధమే ఉండొచ్చు. యార్క్‌షైర్‌ క్లబ్‌ క్రికెట్‌ ఆడేటప్పుడు పాక్‌ క్రికెటర్‌ నదీమ్‌ ఖాన్‌తో ఆడుతూ స్వీప్‌ షాట్‌కు మెరుగులు దిద్దుకున్నా.


పుజారా.. పెద్ద వికెట్‌

ప్రస్తుతం విరాట్‌ కోహ్లీ, స్టీవ్‌స్మిత్‌, విలియమ్సన్‌ గొప్ప క్రికెటర్లు. వారి వద్ద నేర్చుకొనేందుకు ఎప్పుడూ వెనుకాడను. ఇక టీమ్‌ఇండియా ఆటగాడు చెతేశ్వర్‌ పుజారా గొప్ప ఆటగాడు. యార్క్‌షైర్‌లో అతడితో కలిసి కొన్ని మ్యాచులు ఆడినందుకు సంతోషగా ఉంది. బ్యాటింగ్‌ గురించి అతడితో మాట్లాడేవాడిని. క్రికెట్‌పై అతడికున్న ప్రేమ ఆసక్తికరంగా ఉంటుంది. అతడితో కలిసి ఆడినా, ఎదుర్కొన్నా నేర్చుకొనేందుకు ఎంతో ఉంటుంది. అతడు టీమ్‌ఇండియాకు ఎంతో విలువ చేకూరుస్తాడు. అతడు మాకు పెద్ద వికెట్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అతడి సుదీర్ఘ ఇన్నింగ్స్‌ను తట్టుకొనేందుకు మేం మానసికంగా బలంగా ఉండాలి. పుజారా మానసికంగా ఎంతో బలవంతుడు.


గర్వించే సందర్భం

తొలిసారి ఇంగ్లాండ్‌ జెర్సీ ధరించి మైదానంలోకి అడుగుపెట్టడం నా జీవితంలోనే అత్యంత గర్వించే సందర్భం. చిన్నప్పుడు కెవిన్‌ పీటర్సన్‌ను చూస్తూ పెరిగాను. అవతలి ఎండ్‌లో అతడున్నప్పుడు అతడిని చూస్తూ క్రీజులోకి అడుగుపెట్టాను. నా చిన్ననాటి కల నిజమైనందుకు అప్పుడు చిరునవ్వు, సంతోషాన్ని ఆపుకోలేకపోయా. ఆ సందర్భం నాకెంతో ఉత్సాహం కలిగించింది. ఇప్పుడూ అదే ఉత్సాహంతో నేను ఆడాలి. ఎందుకంటే నేనింకా నా కలను నిజం చేసుకుంటూనే ఉన్నాను. పెద్ద సిరీసులకు ముందు సాధ్యమైనంతగా సేద తీరుతాను. గిటార్‌ వాయిస్తాను. ఐప్యాడ్‌లో సిరీసులు చూస్తాను. లేదంటే ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న క్రికెట్‌ను వీక్షిస్తాను. ఏదేమైనా సేద తీరుతాను.

-ఇంటర్నెట్‌ డెస్క్‌

ఇవీ చదవండి
సెహ్వాగ్‌ లాగే పంత్‌ భయపెట్టిస్తాడు 
క్రిస్‌గేల్‌ 22 బంతుల్లో 84 పరుగులు

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని