close

తాజా వార్తలు

Updated : 19/10/2020 00:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పంజాబ్‌ సూపరో సూపర్‌!!

ముంబయి పరాజయం

పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి ఎగబాకిన రాహుల్‌ సేన

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇది కదా క్రికెట్ అభిమానులు కోరుకునే అసలు మజా! టోర్నీ ఆద్యంతం దక్కాల్సిన వినోదం ఒక్క మ్యాచ్‌లోనే అందింది. దుబాయ్‌ వేదికగా పంజాబ్‌×ముంబయి మ్యాచ్‌ టై కావడంతో సూపర్‌ఓవర్‌కు దారి తీయగా.. సూపర్‌ ఓవర్ కూడా‌ టైగా మారింది. దీంతో మరోసారి సూపర్‌ ఓవర్‌ నిర్వహించారు. దీనిలో పంజాబ్‌ పైచేయి సాధించి లీగ్‌లో మూడో విజయాన్ని నమోదు చేసింది. తొలుత జరిగిన సూపర్‌ ఓవర్‌లో బుమ్రా రెండు వికెట్లు తీసి పంజాబ్‌ను అయిదు పరుగు‌లకే కట్టడి చేశాడు. అనంతరం షమి కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో ముంబయి సరిగ్గా అయిదు పరుగులే చేసింది. ఆఖరి బంతికి డికాక్‌ రెండో పరుగు కోసం ప్రయత్నించి రనౌటయ్యాడు. అనంతరం మరో సూపర్‌ఓవర్‌లో.. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబయి వికెట్ కోల్పోయి 11 పరుగులు చేసింది. తర్వాత బరిలోకి దిగిన గేల్‌, మయాంక్‌ లక్ష్యాన్ని మరో రెండు బంతులుండగానే ఛేదించి జట్టును విజయతీరాలకు చేర్చారు. నిబంధనల ప్రకారం తొలి సూపర్‌ఓవర్‌లో బౌలింగ్‌ చేసిన బౌలర్‌/క్రీజులోకి వచ్చిన బ్యాట్స్‌మెన్‌ కాకుండా ఇతరులు మరో సూపర్‌ఓవర్‌లో బౌలింగ్‌/బ్యాటింగ్‌కు రావాల్సి ఉండటంతో దాదాపు కీలక బ్యాట్స్‌మెన్‌ అందరూ క్రీజులోకి వచ్చారు. లీగ్‌ చరిత్రలో డబుల్‌ సూపర్‌ ఓవర్‌ మ్యాచ్‌ ఇదే.

రాహుల్‌ దూకుడు..

అంతకుమందు టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబయి ఆరు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. డికాక్‌ (53; 43 బంతుల్లో, 3×4, 3×6), పొలార్డ్‌ (34*; 12 బంతుల్లో, 1×4, 4×4), కౌల్టర్‌నైల్‌ (24*, 12 బంతుల్లో, 4×4) మెరిశారు. అనంతరం బరిలోకి దిగిన పంజాబ్‌ 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 176 పరుగులే చేసింది. కేఎల్‌ రాహుల్ (77; 51 బంతుల్లో, 7×4, 3×6) గొప్పగా పోరాడాడు. ఆ జట్టును బుమ్రా (3/24) దెబ్బ తీశాడు. 

ఛేదనకు దిగిన పంజాబ్‌కు శుభారంభం దక్కలేదు. మయాంక్‌ అగర్వాల్‌ (11)ను బుమ్రా బోల్తా కొట్టించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన గేల్‌ (24; 21 బంతుల్లో, 1×4; 2×6)తో కలిసి రాహుల్‌ దూకుడుగా ఆడటంతో పవర్‌ప్లేలో 50 పరుగులు చేసింది. అయితే తర్వాత ధాటిగా ఆడలేకపోవడంతో పంజాబ్ స్కోరు నెమ్మదించింది. ఈ క్రమంలో దూకుడుగా ఆడే యత్నంలో గేల్‌ పెవిలియన్‌కు చేరాడు. అయితే తర్వాత క్రీజులోకి వచ్చిన పూరన్ బౌండరీల మోత మోగించడంతో స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. కానీ పూరన్‌, మాక్స్‌వెల్‌ను వరుస ఓవర్లలో ఔట్‌ చేసి మ్యాచ్‌పై ముంబయి పట్టుబిగించింది. మరోవైపు రాహుల్ తన పోరాటం కొనసాగించాడు. ఈ క్రమంలో 35 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. దీపక్‌ హుడా (23*; 16 బంతుల్లో, 1×4, 1×6) సహకారంతో క్రమంగా లక్ష్యాన్ని కరిగించాడు. కానీ బుమ్రా 148.5 కి.మీ/గ వేగంతో యార్కర్‌ను సంధించి రాహుల్‌ను క్లీన్‌బౌల్ట్‌ చేశాడు. అయితే కౌల్టర్‌నైల్‌ వేసిన 19వ ఓవర్‌లో జోర్డాన్ (13 బంతుల్లో, 2×4), హుడా చెరో బౌండరీ బాదడంతో విజయ సమీకరణం 6 బంతుల్లో 9 పరుగులుగా మారింది. ఆఖరి బంతికి రెండు పరుగులు అవసరమవ్వగా.. జోర్డాన్‌ రెండో పరుగుకి ప్రయత్నించి రనౌటవ్వడంతో మ్యాచ్ టైగా ముగిసింది.

మెరిసిన డికాక్‌..

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ముంబయి పవర్‌ప్లేలో 43 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రోహిత్‌ శర్మ (9), సూర్యకుమార్ (0), ఇషాన్‌ కిషన్‌ (7) విఫలమయ్యారు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన కృనాల్ పాండ్య (34; 30 బంతుల్లో, 4×4, 1×6)తో కలిసి ఓపెనర్‌ డికాక్‌ (53; 43 బంతుల్లో, 3×4, 3×6) ఇన్నింగ్స్‌ చక్కదిద్దాడు. వీరిద్దరు కలిసి నాలుగో వికెట్‌కు 58 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే దూకుడుగా ఆడే క్రమంలో కృనాల్‌ వెనుదిరిగాడు. మరోవైపు నిలకడగా ఆడుతున్న డికాక్‌ 39 బంతుల్లో అర్ధశతకాన్ని సాధించాడు. అయితే హార్దిక్‌ పాండ్య (8)ను షమి, డికాక్‌ను జోర్డాన్‌ వరుస ఓవర్లలో పెవిలియన్‌కు పంపించి ఆ జట్టును మరోసారి దెబ్బ తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన కౌల్డర్‌నైల్‌తో కలిసి పొలార్డ్‌ చెలరేగాడు. వీరిద్దరి ధాటికి ఆఖరి మూడు ఓవర్లలో 54 పరుగులు వచ్చాయి. పంజాబ్‌ బౌలర్లలో షమి, అర్షదీప్‌ చెరో రెండు వికెట్లు, జోర్డాన్‌, బిష్ణోయ్‌ చెరో వికెట్ తీశారు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.