Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్‌లో సెమీస్‌కు చేరిన సింధు

తాజా వార్తలు

Updated : 30/07/2021 15:51 IST

 Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్‌లో సెమీస్‌కు చేరిన సింధు

క్వార్టర్స్‌లో యమగుచిపై ఉత్కంఠ విజయం

టోక్యో: రియో ఒలింపిక్స్‌లో రజతంతో మెరిసిన భారత అగ్రశ్రేణి షట్లర్‌ పి.వి. సింధు మరోసారి సత్తా చాటింది. టోక్యో ఒలింపిక్స్‌లో విజయ దుందుభి మోగిస్తూ సెమీస్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో జపాన్‌ క్రీడాకారిణి యమగూచిపై 21-13, 22-20తో అద్భుత విజయం సాధించింది. దాంతో మరోసారి భారత్‌కు పతకం ఖాయం చేసేలా కన్పిస్తోంది. 

సింధు, యమగూచి మధ్య 56 నిమిషాల పాటు జరిగిన క్వార్టర్స్‌ పోరు ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. తొలి గేమ్‌ ఆరంభంలో కాస్త తడబడిన సింధు.. ఆ తర్వాత మ్యాచ్‌ను తనవైపు తిప్పుకునేందుకు ఎంతోసేపు పట్టలేదు. తొలి గేమ్‌ విరామం సమయానికి 11-7తో స్పష్టమైన ఆధిక్యం సంపాదించింది. బ్రేక్‌ తర్వాత యమగూచి కాస్త పుంజుకున్నట్లే కన్పించినా సింధు ఎదురుదాడి ముందు తేలిపోయింది. దీంతో 21-13తో తొలి గేమ్‌ను సింధు దక్కించుకుంది.

అయితే రెండో గేమ్‌లో యమగూచి గట్టి పోటినిచ్చింది. ఆరంభం నుంచే సింధుపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసింది. ఒక దశలో 15-14తో సింధు పైచేయి సాధించింది. అప్పటి నుంచి పోరు మరింత రసవత్తరంగా మారింది. అయితే సింధు కూడా అవకాశం ఇవ్వకపోవడంతో 20-20తో ఇద్దరు సమంగా నిలిచారు. ఆఖర్లో సింధు విజృంభించి వరుసగా రెండు పాయింట్లు సాధించడంతో 22-20తో రెండో గేమ్‌ కూడా గెలించింది. 

అలా వరుస గేమ్‌లలో గెలిచి సింధు సెమీస్‌కు దూసుకెళ్లింది. మరో క్వార్టర్స్‌లో ఇథనాన్‌(థాయ్‌లాండ్‌), తై జు యింగ్‌(చైనీస్‌ తైపీ) తలపడనున్నారు. వీరిలో గెలిచిన వారితో సింధు సెమీస్‌లో పోటీపడనుంది. 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని