
తాజా వార్తలు
‘ఏం కావాలంటే అది చేసుకోండి.. మేం వెళ్లం’
ఆస్ట్రేలియా పర్యటనకు ముందు రవిశాస్త్రి హెచ్చరిక..
ఇంటర్నెట్‌డెస్క్: ఆస్ట్రేలియాతో సుదీర్ఘ పర్యటనకు ముందు టీమ్ఇండియా ఆటగాళ్ల కుటుంబాలను అక్కడికి అనుమతించకపోవడంపై హెడ్‌కోచ్ రవిశాస్త్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడని ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ పేర్కొన్నారు. తాజాగా అశ్విన్‌తో ముచ్చటించిన సందర్భంగా ఆయన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. యూఏఈలో ఐపీఎల్ పూర్తయ్యాక టీమ్ఇండియా ఆటగాళ్లు 48 గంటలు క్వారంటైన్లో ఉన్నారని చెప్పారు. అప్పటికే పలువురు ఆటగాళ్లు తమ కుటుంబాలతో సహా ఆసీస్ పర్యటనకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అయితే, హఠాత్తుగా అక్కడి అధికారులు ఆటగాళ్ల కుటుంబాలను అనుమతించమని చెప్పారని గుర్తుచేసుకున్నారు.
ఈ నేపథ్యంలో రవిశాస్త్రి రంగంలోకి దిగి పరిస్థితులను చక్కబెట్టి.. ఆటగాళ్లు తమ కుటుంబాలతో ఆసీస్‌కు వెళ్లేలా కృషి చేశారని శ్రీధర్ తెలిపారు. ఇందుకోసం బీసీసీఐ అధికారులతో చర్చించి ఒప్పించారన్నారు. ఈ విషయంలో తమకు రాత్రింబవళ్లు ఫోన్‌కాల్స్ వచ్చాయని, ఎట్టి పరిస్థితుల్లో టీమ్ఇండియా ఆటగాళ్ల కుటుంబాలను అనుమతించమని వారు స్పష్టం చేశారని చెప్పారు. దాంతో తాము అసలు ఆస్ట్రేలియాకే వెళ్లమని, ఏం కావాలంటే అది చేసుకోమని శాస్త్రి బీసీసీఐ అధికారులకు గట్టి హెచ్చరికలు పంపారని ఫీల్డింగ్ కోచ్ పేర్కొన్నారు. అప్పుడు శాస్త్రి మాట్లాడుతూ 40 ఏళ్లుగా తాను ఆస్ట్రేలియాకు వెళ్తున్నానని.. వారితో ఎలా మాట్లాడాలో తనకు బాగా తెలుసు అని చెప్పారన్నారు. చివరికి బీసీసీఐ.. క్రికెట్ ఆస్ట్రేలియాను ఒప్పించడంతో అక్కడి అధికారులు అప్పటికప్పుడు అనుమతులు మంజూరు చేశారని శ్రీధర్ గుర్తుచేసుకున్నారు.
ఇవీ చదవండి..
చిరకాల కోరిక నెరవేర్చుకున్న సిరాజ్..!
36 ఆలౌట్: ఆ అర్ధరాత్రి ఏం జరిగిందంటే!