నా ట్వీట్లకు కల్పితాలు జోడించొద్దు: అశ్విన్‌ 
close

తాజా వార్తలు

Published : 27/02/2021 12:27 IST

నా ట్వీట్లకు కల్పితాలు జోడించొద్దు: అశ్విన్‌ 

నేను క్రికెటర్‌.. దాని గురించే మాట్లాడా..

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా సీనియర్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ తన ట్వీట్లకు అనవసర కల్పితాలు జోడించొద్దని కోరాడు. శుక్రవారం అతడు అర్థంకాని విధంగా వరుసగా మూడు ట్వీట్లు చేయడంతో అవి వైరల్‌గా మారి అందర్నీ అయోమయానికి గురిచేశాయి. అశ్విన్‌ ఏం చెప్పదల్చుకున్నాడో తెలియక నెటిజెన్లు గందరగోళానికి గురయ్యారు. ఈ క్రమంలోనే ఓ మీడియా ఛానల్‌ ఆ ట్వీట్లపై ఓ కథనం ప్రసారం చేసింది. అతడు చేసిన ట్వీట్లు రైతు ఉద్యమం నేపథ్యంలో ఉన్నాయని అర్థం వచ్చేలా ప్రసారం సాగించింది.

ఆ కథనానికి సంబంధించిన ఓ వీడియోను తాజాగా పంచుకొని అశ్విన్‌ ఇలా రాసుకొచ్చాడు. ‘వరుస ట్వీట్లలో నేను చెప్పింది ఇదే. నా ట్వీట్లకు రాజకీయ దురుద్దేశాలు అంటించవద్దని మీ అందర్నీ కోరుతున్నా. నా వృత్తి క్రికెట్‌ ఆడటం. నేను దాని గురించే మాట్లాడాను. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి కల్పితాలు జోడించకండి’ అని పేర్కొన్నాడు. కాగా, అశ్విన్‌ చేసిన ట్వీట్లు నిజంగానే ఎవరికీ అర్థంకాలేదు. పింక్‌బాల్‌ టెస్టులో టీమ్‌ఇండియా రెండు రోజుల్లోనే ఇంగ్లాండ్‌ను చిత్తు చేసిన నేపథ్యంలో మొతేరా పిచ్‌పై అనేక విమర్శలొచ్చాయి. స్పిన్‌కు అనుకూలించే విధంగా రూపొందించిన ఈ పిచ్‌ టెస్టులకు పనికిరాదని పలువురు మాజీలు అభిప్రాయపడ్డారు. దాంతో ఆయా క్రికెటర్ల వ్యాఖ్యలపై స్పందిస్తూ అశ్విన్‌ వరుస ట్వీట్లు చేశాడని కొందరు అభిమానులు కామెంట్లు పెట్టారు.

మరోవైపు మూడో టెస్టులో మొత్తం ఏడు వికెట్లు తీసిన అశ్విన్‌ సుదీర్ఘ ఫార్మాట్‌లో 400 వికెట్లు పూర్తి చేసుకున్న టీమ్‌ఇండియా నాలుగో బౌలర్‌గా నిలిచాడు. కుంబ్లే(619), కపిల్‌ (434), హర్భజన్‌(417) తర్వాత ఈ వెటరన్‌ స్పిన్నర్‌ 401 వికెట్లతో కొనసాగుతున్నాడు. ఇక ప్రపంచ క్రికెట్‌లో శ్రీలంక స్పిన్‌ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌ (72 టెస్టుల్లో) తర్వాత అశ్వినే (77 టెస్టుల్లో) అత్యంత వేగంగా ఈ మైలురాయి అందుకున్న క్రికెటర్‌గా నిలిచాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని